బంగారంపై రుణ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల తాకట్టుపై బ్యాంకులు ఇచ్చే రుణాల పరిమితిని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సడలించింది. ‘ఆయా బ్యాంకుల బోర్డులు ఆమోదించిన విధానాల ప్రకారం వ్యవసాయేతర అవసరాలకు బంగారు ఆభరణాలపై రుణ పరిమితిని బ్యాంకులు నిర్ణయించుకోవచ్చు..’ అని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆర్‌బీఐ తెలిపింది. ఇలాంటి రుణాల కాలపరిమితి 12 నెలలకు మించకూడదని పేర్కొంది. బంగారం విలువలో 75 శాతం వరకు రుణం ఇవ్వవచ్చని తెలిపింది.
ప్రస్తుత రుణాలకు కూడా కొత్త నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. బంగారంపై రుణాన్ని రూ.లక్షకు పరిమితం చేస్తూ ఆర్‌బీఐ గత డిసెంబర్ 30న ఆదేశాలు జారీచేసింది. దీంతో, పరిమితి పెంచాలనీ, ఇతర నిబంధనలను పునఃసమీక్షించాలనీ పలు బ్యాంకులు ఆర్‌బీఐని అభ్యర్థించాయి. దాంతో ఆర్‌బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది.
పసిడి దిగుమతులపై ఆంక్షల కొనసాగింపు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై మునుపటి యూపీఏ ప్రభుత్వం విధించిన నిబంధనలు కొనసాగనున్నాయి. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)ను అదుపు చేసేందుకు తెచ్చిన ఈ నిబంధనలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం రాజ్యసభలో తెలిపారు. 2012-13లో స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 4.7 శాతానికి (8,820 కోట్ల డాలర్లు) క్యాడ్ చేరుకుందనీ, క్యాడ్ అదుపునకు యూపీఏ చేపట్టిన చర్యలన్నిటినీ కొనసాగించేందుకు యత్నిస్తున్నామనీ జైట్లీ చెప్పారు.
బంగారంపై దిగుమతి సుంకాన్ని మూడురెట్లు పెంచడం, దిగుమతుల్లో 20 శాతాన్ని ఎగుమతి చేయాలన్న నిబంధన విధించడంతో కరెంట్ అకౌంట్ లోటు అదుపులోకి వచ్చిందని తెలిపారు. 2013-14లో క్యాడ్ 3,240 కోట్ల డాలర్లకు తగ్గిందన్నారు. విదేశీ మారక నిల్వలు కూడా ఈ నెల 4వ తేదీకి 31,640 కోట్ల డాలర్లకు పెరిగాయని తెలిపారు.