Best FD Rates: దేశంలో చాలా మంది అధిక రాబడుల కోసం ఇప్పుడు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. సాంప్రదాయ పెట్టుబడి మార్గాలను వదిలి కొత్త ఎంపికల కోసం చూస్తున్నారు. అయితే, మొత్తం పెట్టుబడిని మార్కెట్‌లో పెట్టే బదులు కొంత భాగాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి వాటిలో మదుపు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరి ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో వడ్డీ తక్కువ వస్తుంది కదా అని అపోహ పడవద్దు. ఫిక్స్‌డ్ డిపాజిట్ సురక్షితమైన పెట్టుబడి ఎంపిక మాత్రమే కాకుండా వడ్డీ కూడా బాగానే వస్తుంది. కొన్ని బ్యాంకులు ఇప్పటికీ ఎఫ్‌డీపై 9.5 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ఎఫ్‌డీపై ఎక్కువ వడ్డీ ఇస్తాయి.
ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులతో పోలిస్తే చిన్న బ్యాంకులు కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీపై 9.5 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. ఎఫ్‌డీపై ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తున్నాయో ఇక్కడ తెలియజేస్తున్నాం.
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం ఎఫ్‌డీపై దేశంలోనే అత్యధిక వడ్డీని ఇస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ ఈ బ్యాంకులో 3 సంవత్సరాల కాలానికి ఎఫ్‌డీ ఖాతాను తెరిస్తే సంవత్సరానికి 9.5 శాతం వడ్డీని ఇస్తుంది.
సూర్య స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీ ఇచ్చే విషయంలో రెండవ స్థానంలో ఉంది. ఈ బ్యాంకు 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 9.1 శాతం వడ్డీని ఇస్తోంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 3 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 9.1 శాతం వడ్డీని అందిస్తోంది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 3 సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్‌లకు సంవత్సరానికి 8.75 శాతం వడ్డీ లభిస్తుంది.
సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీని అందించే బ్యాంకుల జాబితాలో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఉన్నాయి. ఈ రెండు బ్యాంకులు మూడేళ్ల ఎఫ్‌డీలపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఆఫర్ 3 సంవత్సరాల వ్యవధిలో చేసిన బ్యాంక్ ఎఫ్‌డీలకు కూడా వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment