విద్యా విధానం.. ముసాయిదానే!
ఆమోదించక ముందే విమర్శలా?
* అందరి అభిప్రాయాలతోనే తుది రూపు
* సరైన దిశలోనే రాష్ట్ర విద్యారంగం
* కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్
సాక్షి, హైదరాబాద్: నూతన జాతీయ విద్యా విధానంపై ప్రకటించిన ముసాయిదాను కేంద్రం ఇంకా ఆమోదించలేదని, ఇది కేవలం వివిధ వర్గాల నుంచి సేకరించిన సలహాలు, సూచనల సంకలనం మాత్రమేనని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ఇంకా ఆమోదించని విధానా న్ని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని పేర్కొన్నారు.
నూతన విద్యా విధానంపై విస్తృత చర్చ కోసమే ముసాయిదాను బహిర్గతపరిచామని చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నూతన విధ్యా విధానానికి తుదిరూపు ఇస్తామన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, 30 కల్పిస్తున్న మైనారిటీ విద్యా సంస్థల స్థాపన,నిర్వహణ హక్కులను కేంద్రం హరించబోతోందన్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. నూతన విద్యా విధానంపై సెప్టెంబర్ 15 వరకు సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. నూతన విద్యా విధానంపై రాష్ట్రాల అభిప్రాయ సేకరణలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించారు.
అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు చేయాలని కడియం కోరారని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ పరిశీలిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ఆదర్శ, కస్తూర్బా గాంధీ, సంక్షేమ వసతి గృహాల పాఠశాలల విజయాలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యారంగం పరంగా రాష్ట్రం సరైన దిశలో వెళుతోందని ప్రశంసించారు.
రాష్ట్రానికి ఐదు వరాలివ్వండి: కడియం
ప్రతి రాష్ట్రంలో ఓ ఐఐఎం ఉండాలని కేంద్రం విధానమని, రాష్ట్రానికి కూడా ఐఐఎం మంజూరు చేయాలని ప్రకాశ్ జవదేకర్‌ను కోరినట్లు కడియం తెలిపారు. దీన్ని 2017-18 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని పేర్కొన్నారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ నినాదాన్ని ప్రధాని మోదీ ప్రకటించగానే బాలికల కోసం కేంద్రం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోందని ఆశించామని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవన్నారు.
దేశ వ్యాప్తంగా బాలికల కోసం జిల్లాకో ప్రత్యేక విద్యా సంస్థ ఏర్పాటు చేసి 1వ తరగతి నుంచి పీజీ వరకు విద్యను అందించాలని ప్రతిపాదించామని, దీనిపై పరిశీలన జరుపుతామని జవదేకర్ ఇచ్చారని తెలిపారు. కేంద్రం సహకారంతో దేశవ్యాప్తంగా మధ్నాహ్న భోజన పథకాన్ని 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకే అందిస్తున్నరని, ఇకపై 12వ తరగతి విద్యార్థులకు కూడా వర్తింపచేసేందుకు కేంద్ర సహకరించాలని కోరినట్లు వివరించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే బోధిస్తున్నారని, ఆ తర్వాత సమీపంలో జూనియర్ కాలేజీలు లేక విద్యార్థినులు చదువు మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 12వ తరగతి వరకు విద్యను అందించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు.
సరైన శిక్షణ లేకనే..
దేశ వ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పడిపోవడానికి కారణం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకపోవడమేనని, ఉపాధ్యాయుల శిక్షణకు అవసరమైన నిధులు, సదుపాయాలను కేంద్రం కల్పించాలని కోరినట్లు కడియం వివరించారు. ఈ ఐదు ప్రతిపాదనల పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. కేంద్ర సంస్థలైన ఎన్‌సీఈఆర్‌టీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈలు ఇష్టారాజ్యంగా ఇంజనీరింగ్, బీఈడీ, డీఈడీ కాలేజీలను మంజూరు చేస్తున్నాయని, రాష్ట్రాల అవసరాల మేరకే కొత్త విద్యా సంస్థలను మంజూరు చేసేలా ఈ సంస్థల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తామని జవదేకర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.