సాక్షి, అమరావతి: ఐఐటీ ప్రవేశ పరీక్షలో టాప్ 50 ర్యాంకులు సాధించిన వారిలో నవీన్ ఒకడు. ప్రముఖ ఐఐటీలో సీటు కూడా వచ్చింది. రెండో సంవత్సరంలో తాను చదవాల్సిన కోర్సుల్లో ‘అండర్ స్టాండింగ్ రూరల్ అండ్ లోకల్ ఎకానమీ, లైవ్‌లీహుడ్’ అనేది ఒక సబ్జెక్ట్. ఈ కోర్సులో ప్రత్యేక అసైన్‌మెంట్‌గా అతడు ఏదో ఒక గ్రామాన్ని సందర్శించి, స్థానికంగా అందరితో చర్చించి.. గ్రామంలో ప్రస్తుతం పంచాయతీ పాలన ఎలా కొనసాగుతోంది? ఏం చేస్తే మరింత సమర్థవంతంగా పాలన సాగుతుంది? తదితర విషయాలపై వీడియో ప్రజెంటేషన్ లేదా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్న పరిష్కార మార్గాలు సూచిస్తే.. గ్రామీణాభివృద్ధిలో ఇటు ప్రభుత్వాలు, అటు స్వచ్ఛంద సంస్థలు వాటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా పల్లె ప్రాంతాలకు వేగంగా అభివృద్ధి ఫలాలను అందివ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.
సమగ్ర పరిశీలనే లక్ష్యం
కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా డిగ్రీ, పీజీ స్థాయిలో గ్రామాల్లో స్థానిక పరిస్థితులపై అధ్యయానికి సంబంధించి పలు కోర్సులను ప్రవేశపెట్టబోతుంది. ఐఐటీలతో సహా ప్రముఖ యూనివర్సిటీల విద్యార్థులు ఆయా కోర్సుల్లో భాగంగా గ్రామాలను స్వయంగా సందర్శిస్తారు. స్థానికంగా ఉండే స్వయం సహాయక సంఘాల మహిళలతో, ఉపాధి హామీ పథకం కూలీలతో భేటీ అవుతారు. స్థానిక పరిస్థితులపై సర్వే చేసి, గ్రామ అభివృద్ధి ప్రణాళికల తయారీలో భాగస్వామ్యులవుతారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి కొన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. గ్రామంలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల గుర్తింపు.. వాటికి నిధుల సమీకరణ గురించి పరిశీలిస్తారు. గ్రామంలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి వాటి నిర్వహణలో ఉన్న లోపాలు, పరిష్కారాల గురించి అధ్యయనం చేస్తారు. మొత్తంగా విద్యార్థులు తాము నేర్చుకున్న పాఠాలు, పరిశీలన ఆధారంగా గ్రామీణ పేదలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ నివేదిక అందజేయాల్సి ఉంటుంది.
సీసీసీ కోర్సులు ఇలా..
గ్రామీణ ప్రజల జీవనశైలి, గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆధ్యయనానికి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) ప్రధానంగా నాలుగు రకాల (ఇవి కాకుండా ఇంకా ఉంటాయి) కోర్సులను రూపొందించింది. వాటి వివరాలను అన్ని ఉన్నత విద్యా సంస్థలకు అందజేసింది. యూనివర్సిటీ, ఉన్నత విద్యా సంస్థల్లో ఏ కోర్సు చదివే విద్యార్థులైనా కామన్‌గా ‘కంపల్సరీ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కోర్సు (సీసీసీ)’ పేరుతో ఉన్న ఈ కోర్సుల్లో కొన్నింటిని తప్పనిసరిగా చదవాల్సిందే. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు మొత్తం కోర్సులో సగం సమయం గ్రామాల్లోనే గడపాల్సి ఉంటుంది.
వేగంగా అభివృద్ధికి బాటలు
పట్టణ ప్రాంతాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ–ప్రైవేట్ సేవలు అందుబాటులోకి తీసుకు రావడం కోసం ఈ విధానం బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు, సామాజిక సేవా సంస్థలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల నుంచి వచ్చే సూచనలు కీలకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. తద్వారా భవిష్యత్‌లో ప్రభుత్వాలు మరింత వేగంగా గ్రామీణ ప్రాంతాల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని విద్య, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
అప్రిసియేషన్ ఆఫ్ రూరల్ సొసైటీ: గ్రామీణ ప్రజల జీవనశైలి – కొన్నిరకాల కట్టుబాట్లకు ప్రజలు ఇచ్చే విలువ – గ్రామాల్లో అందుబాటులో ప్రత్యేక వనరులు తదితర అంశాలపై ఈ కోర్సు ఉంటుంది.
అండర్ స్టాండింగ్ రూరల్ అండ్ లోకల్ ఎకానమీ, లైవ్‌లీహుడ్:
గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం,ఇతర వృత్తులతో పాటు ఉపాధి కోసం వలసలు తదితర అంశాలుంటాయి. రూరల్ అండ్ నేషనల్ డెవలప్‌మెంట్ ప్రోగామ్స్: గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ఉంటుంది.
రూరల్ అండ్ లోకల్ ఇనిస్టిట్యూషన్స్: గ్రామాల్లో పంచాయతీ పాలన సాగుతున్న తీరు, గ్రామ సభ ఏర్పాటు, గ్రామ స్థాయిలో అధికార వ్యవస్థ తదితర అంశాలుంటాయి.
కొత్త ఐడియాలకు ఆహ్వానం పలకడమే
ప్రజా ప్రతినిధులు, అధికారుల వ్యవస్థ ఎంత శ్రద్ధ పెట్టినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలు దశాబ్దాల తరబడి అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటిపై మరింత ఫోకస్ అవసరం. విద్యార్థులనూ భాగస్వామ్యం చేయడం ద్వారా ఆ సమస్యల మూలాలను అన్వేషించడాకి అవకాశం ఉంటుంది. మన విద్యా విధానంలో ఇప్పటికే కొంత మేర గ్రామీణ అంశాలు ఉన్నప్పటికీ అది నామమాత్రమే. ఇప్పుడు ఉన్నత విద్యలో క్రెడిట్ బేస్డ్ సిస్టమ్‌లో డిజైన్ చేసిన కోర్సుల వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి కొత్త ఐడియాల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. నేటి ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఈ రకమైన ఒరవడి విద్యార్థి దశలోనే కల్పించడం ద్వారా భారతదేశ గ్రామీణ వ్యవస్థలో పెను మార్పులు రావడానికి దోహదపడుతుంది. – ఎం.ప్రసాదరావు,రిటైర్డు ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment