rural development programs
-
పల్లెటూరును చదివేద్దాం
సాక్షి, అమరావతి: ఐఐటీ ప్రవేశ పరీక్షలో టాప్ 50 ర్యాంకులు సాధించిన వారిలో నవీన్ ఒకడు. ప్రముఖ ఐఐటీలో సీటు కూడా వచ్చింది. రెండో సంవత్సరంలో తాను చదవాల్సిన కోర్సుల్లో ‘అండర్ స్టాండింగ్ రూరల్ అండ్ లోకల్ ఎకానమీ, లైవ్లీహుడ్’ అనేది ఒక సబ్జెక్ట్. ఈ కోర్సులో ప్రత్యేక అసైన్మెంట్గా అతడు ఏదో ఒక గ్రామాన్ని సందర్శించి, స్థానికంగా అందరితో చర్చించి.. గ్రామంలో ప్రస్తుతం పంచాయతీ పాలన ఎలా కొనసాగుతోంది? ఏం చేస్తే మరింత సమర్థవంతంగా పాలన సాగుతుంది? తదితర విషయాలపై వీడియో ప్రజెంటేషన్ లేదా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్న పరిష్కార మార్గాలు సూచిస్తే.. గ్రామీణాభివృద్ధిలో ఇటు ప్రభుత్వాలు, అటు స్వచ్ఛంద సంస్థలు వాటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా పల్లె ప్రాంతాలకు వేగంగా అభివృద్ధి ఫలాలను అందివ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. సమగ్ర పరిశీలనే లక్ష్యం కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా డిగ్రీ, పీజీ స్థాయిలో గ్రామాల్లో స్థానిక పరిస్థితులపై అధ్యయానికి సంబంధించి పలు కోర్సులను ప్రవేశపెట్టబోతుంది. ఐఐటీలతో సహా ప్రముఖ యూనివర్సిటీల విద్యార్థులు ఆయా కోర్సుల్లో భాగంగా గ్రామాలను స్వయంగా సందర్శిస్తారు. స్థానికంగా ఉండే స్వయం సహాయక సంఘాల మహిళలతో, ఉపాధి హామీ పథకం కూలీలతో భేటీ అవుతారు. స్థానిక పరిస్థితులపై సర్వే చేసి, గ్రామ అభివృద్ధి ప్రణాళికల తయారీలో భాగస్వామ్యులవుతారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి కొన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. గ్రామంలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల గుర్తింపు.. వాటికి నిధుల సమీకరణ గురించి పరిశీలిస్తారు. గ్రామంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వాటి నిర్వహణలో ఉన్న లోపాలు, పరిష్కారాల గురించి అధ్యయనం చేస్తారు. మొత్తంగా విద్యార్థులు తాము నేర్చుకున్న పాఠాలు, పరిశీలన ఆధారంగా గ్రామీణ పేదలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ నివేదిక అందజేయాల్సి ఉంటుంది. సీసీసీ కోర్సులు ఇలా.. గ్రామీణ ప్రజల జీవనశైలి, గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆధ్యయనానికి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) ప్రధానంగా నాలుగు రకాల (ఇవి కాకుండా ఇంకా ఉంటాయి) కోర్సులను రూపొందించింది. వాటి వివరాలను అన్ని ఉన్నత విద్యా సంస్థలకు అందజేసింది. యూనివర్సిటీ, ఉన్నత విద్యా సంస్థల్లో ఏ కోర్సు చదివే విద్యార్థులైనా కామన్‌గా ‘కంపల్సరీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కోర్సు (సీసీసీ)’ పేరుతో ఉన్న ఈ కోర్సుల్లో కొన్నింటిని తప్పనిసరిగా చదవాల్సిందే. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు మొత్తం కోర్సులో సగం సమయం గ్రామాల్లోనే గడపాల్సి ఉంటుంది. వేగంగా అభివృద్ధికి బాటలు పట్టణ ప్రాంతాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ–ప్రైవేట్ సేవలు అందుబాటులోకి తీసుకు రావడం కోసం ఈ విధానం బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు, సామాజిక సేవా సంస్థలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల నుంచి వచ్చే సూచనలు కీలకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. తద్వారా భవిష్యత్‌లో ప్రభుత్వాలు మరింత వేగంగా గ్రామీణ ప్రాంతాల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని విద్య, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. అప్రిసియేషన్ ఆఫ్ రూరల్ సొసైటీ: గ్రామీణ ప్రజల జీవనశైలి – కొన్నిరకాల కట్టుబాట్లకు ప్రజలు ఇచ్చే విలువ – గ్రామాల్లో అందుబాటులో ప్రత్యేక వనరులు తదితర అంశాలపై ఈ కోర్సు ఉంటుంది. అండర్ స్టాండింగ్ రూరల్ అండ్ లోకల్ ఎకానమీ, లైవ్లీహుడ్: గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం,ఇతర వృత్తులతో పాటు ఉపాధి కోసం వలసలు తదితర అంశాలుంటాయి. రూరల్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగామ్స్: గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ఉంటుంది. రూరల్ అండ్ లోకల్ ఇనిస్టిట్యూషన్స్: గ్రామాల్లో పంచాయతీ పాలన సాగుతున్న తీరు, గ్రామ సభ ఏర్పాటు, గ్రామ స్థాయిలో అధికార వ్యవస్థ తదితర అంశాలుంటాయి. కొత్త ఐడియాలకు ఆహ్వానం పలకడమే ప్రజా ప్రతినిధులు, అధికారుల వ్యవస్థ ఎంత శ్రద్ధ పెట్టినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలు దశాబ్దాల తరబడి అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటిపై మరింత ఫోకస్ అవసరం. విద్యార్థులనూ భాగస్వామ్యం చేయడం ద్వారా ఆ సమస్యల మూలాలను అన్వేషించడాకి అవకాశం ఉంటుంది. మన విద్యా విధానంలో ఇప్పటికే కొంత మేర గ్రామీణ అంశాలు ఉన్నప్పటికీ అది నామమాత్రమే. ఇప్పుడు ఉన్నత విద్యలో క్రెడిట్ బేస్డ్ సిస్టమ్‌లో డిజైన్ చేసిన కోర్సుల వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి కొత్త ఐడియాల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. నేటి ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఈ రకమైన ఒరవడి విద్యార్థి దశలోనే కల్పించడం ద్వారా భారతదేశ గ్రామీణ వ్యవస్థలో పెను మార్పులు రావడానికి దోహదపడుతుంది. – ఎం.ప్రసాదరావు,రిటైర్డు ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ -
దళిత సేవలో నాలుగో సింహం
వృత్తిలో ఒత్తిడి ఉన్నా సేవభావంలో ఆదర్శంగా నిలిచే వారు అరుదుగా ఉంటారు. సరిగ్గా అలాంటి ‘రియల్ పోలీస్’ అర్బన్ ఎస్పీ అన్బురాజన్. దళితుల అభ్యున్నతే లక్ష్యంగా ఆపన్న హస్తం అందిస్తున్నారు. పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. 19 దళిత గ్రామాల్లో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చారు. పలు పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించడంతోపాటు నీటి సౌకర్యం కల్పించారు. పచ్చదనం పరిరక్షణలో భాగంగా 20వేల మొక్కలను నాటించారు. దళిత గ్రామాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ ఫ్రెండ్లీ పోలీసును మనమూ పలుకరిద్దాం.. –తిరుపతి, క్రైం. సాక్షి, తిరుపతి: దళితుల అభ్యున్నతికి తిరుపతి అర్బన్ ఎస్పీ అన్భురాజన్ తన వంతు సహకారం అందిస్తున్నారు. తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా పరిధిలోని మారుమూల దళిత గ్రామాల్లో మౌలి క వసతుల కల్పనతోపాటు అన్ని రంగాల్లో వారు రాణించేలా కృషి చేస్తున్నారు. ఇందు కోసం పోలీసు సహాయ నిధి నుంచి నిధులను సైతం తెస్తున్నారు. గుక్కెడు నీటికోసం అల్లాడుతున్న గ్రామాలకు నీరందించాలనే ఆయన ప్రయత్నంలో తొలి విజయం సాధించారు. అర్బన్ జిల్లా పరిధిలోని గ్రామాల్లో 19 వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. మారుమూల గ్రామాల్లోని పాఠశాలలను అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తున్నారు. పోలీసు స్టేషన్ పరిధిలోని పాఠశాలలను అధికారులు పరిశీలించి లోటుపాట్లను ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపుతున్నారు. అనంతరం ఆయా పాఠశాల్లో మరుగుదొడ్లు, నీటి సౌకర్యంతో పాటు విద్యార్థులకు క్రీడా సామాగ్రిని సైతం అందజేస్తున్నారు. పచ్చదనం పరిమళించేలా గ్రామల్లో పచ్చదనం పరిమళించాలనే సంకల్పంతో పోలీసుల శాఖ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 20వేల మొక్కలు నాటారు. మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. సంరక్షకుడిని నియమించారు. నిత్యం మొక్కల సంరక్షణపై కింద స్థాయి సిబ్బంది నుంచి నివేదికలను తెప్పించుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసుకు సరికొత్త నిర్వచనం ప్రజలతో పోలీసులు సఖ్యతగా ఉండేలా అర్బన్ ఎస్పీ చర్యలు తీసుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసు అనే పదానికి సరికొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చారు. దళిత గ్రామాల్లోని యువకులు, క్రీడాకారులతో కలసి ప్రతి శనివారం పోలీసులు క్రీడా టోర్నమెంట్లను నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రాచుర్యం పొందిన వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ క్రీడల్లో పోటీలను నిర్వహించడం, ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి బహుమతులను ప్రదానం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా క్రీడా సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు వారికి క్రీడా పరికరాలను విరాళంగా అందజేస్తూ ప్రసంశలు అందుకుం టున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి దళిత గ్రామాల్లో వసతుల కల్పనకు పోలీసు శాఖ విశేషంగా కృషి చేస్తోంది. దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే అసమానతలు తొలగిపోతాయి. సమాజ అభివృద్ధితో పాటు దళితులు ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా పరిధిలో దళిత గ్రామాల అభివృద్ధికి శాఖాపరంగా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా యువతను ప్రోత్సహిస్తున్నాం. వారికి క్రీడాపోటీలు నిర్వహిస్తూ స్నేహభావాన్ని పెంపొందింపజేస్తున్నాం. ప్రధానంగా దళితవాడల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశాం. -
‘పంచాయతీ కార్యదర్శి’ ఫైనల్ కీ విడుదల
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష తుది కీని ఏపీపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. ఇందులో పేపరు-1 జనరల్ స్టడీస్ ‘ఎ’ సిరీస్‌లో 39వ ప్రశ్నకు రెండు జవాబులను(3 లేదా 4వ జవాబు) ఆప్షన్లుగా పేర్కొంది. రెండో పేపరు గ్రామీణాభివృద్ధి ‘ఎ’ సిరీస్‌లో 129వ ప్రశ్నను రద్దు చేసింది. 2,677 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి గత నెల 23న నిర్వహించిన పరీక్షకు 71 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షల ప్రాథమిక కీని గత నెలలోనే విడుదల చేసి, దానిపై ఈ నెల 4 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. అభ్యంతరాలపై నిఫుణుల కమిటీ సూచనల మేరకు రెండు పేపర్లలో సవరణలు చేసి ఫైనల్ కీని విడుదల చేసింది. వారంలో కలెక్టర్లకు జిల్లాల వారీగా మెరిట్ జాబితాలను పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
తూతూమంత్రంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రజా సమస్యల పరిష్కారం.. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి కరువైంది. కేంద్ర ప్రభుత్వ నిధులను అడ్డగోలుగా వ్యయం చేస్తుండటంతో లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్రమాలు.. లొసుగులపై చర్చించి తగిన చర్యలు తీసుకునేందుకు ఆరు నెలలకోసారి నిర్వహించే జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం అభాసుపాలవుతోంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన సమావేశం సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశానికి కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, కమిటీ సభ్యులైన జిల్లా మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి.. ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉంది. అయితే వీరంతా గైర్హాజరయ్యారు. ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలపై లోతైన చర్చ జరగాల్సిందిపోయి నామమాత్రంగా ముగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిలు మాత్రమే హాజరవగా.. నిధుల వినియోగంలో అక్రమాలను ఎండగట్టారు. ఇదిలాఉండగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంతో పాటు డీఆర్డీఏ పాలక వర్గ సమావేశం కూడా సోమవారమే నిర్వహించాల్సి ఉంది. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు పట్టకపోవటంతో రెండింటినీ కలిపి ఒకే సమావేశంలో కానిచ్చేశారు. అతి ముఖ్యమైన తొమ్మిది ప్రభుత్వ శాఖలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఇందులో డీఆర్డీఏ, డ్వామా, ఐఏవై గృహా లు, ఆర్‌డబ్ల్యుఎస్, ఐసీడీఎస్, పీఎంజీఎస్‌వై రోడ్ల నాణ్యత, అటవీశాఖ కార్యక్రమాలు, భూమి హక్కులు, ల్యాండ్ సర్వే అమలు, 13వ ఆర్థిక ప్రణాళిక నిధుల వినియోగంపై ప్రముఖంగా చర్చ చేపట్టాలి. మంత్రులెవరూ హాజరు కాకపోవడంతో అక్రమాలపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ దృష్టి సారించలేకపోయింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మాత్రమే కీలకమైన అంశాలను లేవనెత్తారు. మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధిహామీ పథకంలో అవినీతి, అక్రమాలు.. డీఆర్డీఏ, డ్వామా, గృహ నిర్మాణాలు, నీటి సరఫరా తదితర అంశాలపై అధికారులను నిలదీశారు. అదే విధంగా కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సైతం ప్రభుత్వ నిధుల వినియోగంపై చర్చ లేవనెత్తారు. ఏదేమైనా 14 నియోజక వర్గాల పరిధిలో పేరుకుపోయిన సమస్యలు, వాటి పరిష్కారానికి డిమాండ్ చేయాల్సిన అమాత్యులు, శాసనసభ్యులకు చర్చలో పాల్గొనే తీరిక లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజా సమస్యల కంటే ముఖ్యమైన పనేమిటని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి ఫిర్యాదు చేయటానికి వచ్చిన పలు గ్రామాల ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. ఇదే విషయమై శోభా నాగిరెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.