సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రజా సమస్యల పరిష్కారం.. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి కరువైంది. కేంద్ర ప్రభుత్వ నిధులను అడ్డగోలుగా వ్యయం చేస్తుండటంతో లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్రమాలు.. లొసుగులపై చర్చించి తగిన చర్యలు తీసుకునేందుకు ఆరు నెలలకోసారి నిర్వహించే జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం అభాసుపాలవుతోంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన సమావేశం సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశానికి కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, కమిటీ సభ్యులైన జిల్లా మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి.. ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉంది. అయితే వీరంతా గైర్హాజరయ్యారు.
ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలపై లోతైన చర్చ జరగాల్సిందిపోయి నామమాత్రంగా ముగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిలు మాత్రమే హాజరవగా.. నిధుల వినియోగంలో అక్రమాలను ఎండగట్టారు. ఇదిలాఉండగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంతో పాటు డీఆర్‌డీఏ పాలక వర్గ సమావేశం కూడా సోమవారమే నిర్వహించాల్సి ఉంది. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు పట్టకపోవటంతో రెండింటినీ కలిపి ఒకే సమావేశంలో కానిచ్చేశారు. అతి ముఖ్యమైన తొమ్మిది ప్రభుత్వ శాఖలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఇందులో డీఆర్‌డీఏ, డ్వామా, ఐఏవై గృహా లు, ఆర్‌డబ్ల్యుఎస్, ఐసీడీఎస్, పీఎంజీఎస్‌వై రోడ్ల నాణ్యత, అటవీశాఖ కార్యక్రమాలు, భూమి హక్కులు, ల్యాండ్ సర్వే అమలు, 13వ ఆర్థిక ప్రణాళిక నిధుల వినియోగంపై ప్రముఖంగా చర్చ చేపట్టాలి.
మంత్రులెవరూ హాజరు కాకపోవడంతో అక్రమాలపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ దృష్టి సారించలేకపోయింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మాత్రమే కీలకమైన అంశాలను లేవనెత్తారు. మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధిహామీ పథకంలో అవినీతి, అక్రమాలు.. డీఆర్‌డీఏ, డ్వామా, గృహ నిర్మాణాలు, నీటి సరఫరా తదితర అంశాలపై అధికారులను నిలదీశారు. అదే విధంగా కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సైతం ప్రభుత్వ నిధుల వినియోగంపై చర్చ లేవనెత్తారు. ఏదేమైనా 14 నియోజక వర్గాల పరిధిలో పేరుకుపోయిన సమస్యలు, వాటి పరిష్కారానికి డిమాండ్ చేయాల్సిన అమాత్యులు, శాసనసభ్యులకు చర్చలో పాల్గొనే తీరిక లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజా సమస్యల కంటే ముఖ్యమైన పనేమిటని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి ఫిర్యాదు చేయటానికి వచ్చిన పలు గ్రామాల ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. ఇదే విషయమై శోభా నాగిరెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
తూతూమంత్రంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం
Published Tue, Dec 24 2013 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement
Advertisement