kotla jayasurya prakash reddy
-
టీడీపీలో ‘కోట్ల’ కలకలం.. డిప్యూటీ సీఎం అలక
సాక్షి, కర్నూలు: టీడీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబం రాకపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలక వహించారు. కేఈ కృష్ణమూర్తికి సమాచారం లేకుండానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి అపాయింమెంట్ ఇచ్చారు. టీడీపీలో కోట్ల కుటుంబం రాకను చాలా కాలంగా వ్యతిరేకిస్తు వస్తున్న కేఈ కృష్ణమూర్తికి ఈ పరిణామాలు మింగుడు పడటం లేదని సమాచారం. ఇప్పటికే కేఈ కృష్ణమూర్తి అధికారాలను కత్తిరించి అవమానించిన చంద్రబాబు.. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని టీడీపీలో చేర్చుకోవాలని యోచిస్తున్నారు. మరోవైపు, టీడీపీలోకి కోట్ల రాకపై కేఈ కృష్ణమూర్తి సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీడీపీలో కోట్ల కుటుంబం చేరికపై తనకెలాంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తనపై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు. రాజకీయంగా తొలి నుంచి కోట్ల కుటుంబంతో పోరాడుతున్న కేఈ కృష్ణమూర్తి వర్గం.. చంద్రబాబు తాజా నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. -
టీడీపీలో ‘కోట్ల’ కలకలం.. డిప్యూటీ సీఎం అలక
-
టీడీపీ వచ్చాకే పెరిగిన ఫాక్షన్
టీజీ వెంకటేష్.. కాంగ్రెస్ జోలికొస్తే ఖబడ్దార్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టాక కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ఎక్కువైందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లాలో ఎంత మందిని చంపించావో తెలియదా? అని కేఈ కృష్ణమూర్తిని బహిరంగంగానే ప్రశ్నించారు. కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, అతనికి ఏదైనా జరిగితే అందుకు బాధ్యులు కేఈ సోదరులేనన్నారు. అదే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి భయపెడుతున్నారని, అందుకు భయపడేది లేదన్నారు. ఫ్యాక్షన్‌ను రెచ్చగొడుతున్నా తాము భయపడే సమస్యే లేదన్నారు. కేడీసీసీబీ చైర్మన్ పదవి కోసం సిగ్గులేకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన డెరైక్టర్లకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చి కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కేడీసీసీబీ చైర్మన్ పదవిని వదులుకోబోమని పేర్కొన్నారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌పైనా ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ జోలికొస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఎవరైనా సరే ఊరుకునేది లేదని టీజీ, కేఈలనుద్దేశించి అన్నారు. ఇసుక, గనులను దోచుకుంటున్నారు.. జిల్లాలో ఉన్న ఇసుక, గనులను కేఈ సోదరులు దోచుకుంటున్నారని కోట్ల ధ్వజమెత్తారు. ప్రభుత్వం నుంచి లెసైన్సులు ఉన్నా.. దౌర్జన్యంగా వాటిని లాక్కుంటున్నారని విమర్శించారు. అధికారులను బెదిరిస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం జిల్లా ప్రజల చెవిలో పువ్వు పెట్టిందని ఎద్దేవా చేశారు. గుండ్రేవుల, వేదావతి, పలు ఎత్తిపోతల పథకాలన్నీ కాంగ్రెస్ ప్రారంభించినవేనని గుర్తు చేశారు. టీడీపీ ఉంటే జిల్లా నాశనమై పోతుందని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు టీడీపీపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, చెరుకులపాడు నారాయణరెడ్డి, అహ్మద్ అలీఖాన్, శ్రీశైలం నియోజక వర్గ ఇన్చార్జ్ షబానా తదితరులు పాల్గొన్నారు. -
తూతూమంత్రంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రజా సమస్యల పరిష్కారం.. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి కరువైంది. కేంద్ర ప్రభుత్వ నిధులను అడ్డగోలుగా వ్యయం చేస్తుండటంతో లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్రమాలు.. లొసుగులపై చర్చించి తగిన చర్యలు తీసుకునేందుకు ఆరు నెలలకోసారి నిర్వహించే జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం అభాసుపాలవుతోంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన సమావేశం సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశానికి కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, కమిటీ సభ్యులైన జిల్లా మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి.. ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉంది. అయితే వీరంతా గైర్హాజరయ్యారు. ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలపై లోతైన చర్చ జరగాల్సిందిపోయి నామమాత్రంగా ముగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిలు మాత్రమే హాజరవగా.. నిధుల వినియోగంలో అక్రమాలను ఎండగట్టారు. ఇదిలాఉండగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంతో పాటు డీఆర్డీఏ పాలక వర్గ సమావేశం కూడా సోమవారమే నిర్వహించాల్సి ఉంది. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు పట్టకపోవటంతో రెండింటినీ కలిపి ఒకే సమావేశంలో కానిచ్చేశారు. అతి ముఖ్యమైన తొమ్మిది ప్రభుత్వ శాఖలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఇందులో డీఆర్డీఏ, డ్వామా, ఐఏవై గృహా లు, ఆర్‌డబ్ల్యుఎస్, ఐసీడీఎస్, పీఎంజీఎస్‌వై రోడ్ల నాణ్యత, అటవీశాఖ కార్యక్రమాలు, భూమి హక్కులు, ల్యాండ్ సర్వే అమలు, 13వ ఆర్థిక ప్రణాళిక నిధుల వినియోగంపై ప్రముఖంగా చర్చ చేపట్టాలి. మంత్రులెవరూ హాజరు కాకపోవడంతో అక్రమాలపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ దృష్టి సారించలేకపోయింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మాత్రమే కీలకమైన అంశాలను లేవనెత్తారు. మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధిహామీ పథకంలో అవినీతి, అక్రమాలు.. డీఆర్డీఏ, డ్వామా, గృహ నిర్మాణాలు, నీటి సరఫరా తదితర అంశాలపై అధికారులను నిలదీశారు. అదే విధంగా కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సైతం ప్రభుత్వ నిధుల వినియోగంపై చర్చ లేవనెత్తారు. ఏదేమైనా 14 నియోజక వర్గాల పరిధిలో పేరుకుపోయిన సమస్యలు, వాటి పరిష్కారానికి డిమాండ్ చేయాల్సిన అమాత్యులు, శాసనసభ్యులకు చర్చలో పాల్గొనే తీరిక లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజా సమస్యల కంటే ముఖ్యమైన పనేమిటని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి ఫిర్యాదు చేయటానికి వచ్చిన పలు గ్రామాల ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. ఇదే విషయమై శోభా నాగిరెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.