జైపూర్: రాజస్తాన్‌లో బీజేపీ చెల్లాచెదురయిందని, అందుకే ఆ పార్టీకి సీఎం అభ్యర్థే లేకుండాపోయారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. దుంగార్‌పూర్ జిల్లా సగ్వారాలో శుక్రవారం ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. బీజేపీకి సీఎం అభ్యర్థి దొరక్క ప్రధాని మోదీ చేసేది లేక తన పేరుతోనే ఓట్లభ్యర్థిస్తున్నారన్నారు. మతం, మనోభావాలను వాడుకుంటూ ఓట్లడిగే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం కారణంగా రైతులతోపాటు ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు.
‘దేశంలో రైతుల సరాసరి ఆదాయం రోజుకు కేవలం రూ.27 మాత్రమే కాగా, ప్రధాని మోదీ ప్రత్యేక మిత్రుడు అదానీ మాత్రం రోజుకు రూ.16 వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం వద్ద రైతు రుణాలు రద్దు చేసేందుకు మాత్రం డబ్బుల్లేవు’అని ధ్వజమెత్తారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వెన్నుచూపుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల కోసం ద్రవ్యోల్బణ సహాయక శిబిరాలను నిర్వహిస్తుందని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ నిలిపివేస్తుందని ప్రియాంకా గాంధీ ప్రజలను హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment