
ప్రియాంక గాంధీ ( ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రియాంక గాంధీ ఇక్కడనుంచి పోటీచేయనున్నారనే వార్తలు హల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ అంచనాలకు తెరదించుతూ అజయ్ రాయ్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుపుతూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఈసీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి ముకుల్ వాస్నిక్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2014లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అజయ్ రాయ్‌నే పోటీకి నిలిపిన కాంగ్రెస్ ఈసారి కూడా ఆయననే ఎంచుకోవడం గమానార్హం.
మరోవైపు వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని రెండోసారి కూడా వారణాసినుంచే పోటీ చేయనున్నారు. ఈ నెల 26న నామినేషన్ వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ వారణాసిలో గురువారం రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం గంగా హారతిలో పాల్గోనున్నారు.
కాగా ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గాంధీ మోదీపై పోటీ చేస్తారన్న ఊహాగానాలు భారీగా వినిపించాయి. ప్రస్తుతం ఈస్ట్ యూపీ ఇంచార్జ్‌గా బాధ్యతలను చేపట్టిన ప్రియాంక ప్రచారంలో దూసుకుపోతున్నారు. మే 19న ఏడవ విడత ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment