ajay roy
-
ప్రధాని మోదీ గురించి వారణాసి కూటమి అభ్యర్థి ఏమన్నారు?
దేశంలో లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరాయి. ఈ నేపధ్యంలో యూపీలో రసవత్తర రాజకీయాలు నడుస్తున్నాయి. వారణాసి నుంచి ప్రధాని మోదీపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొన్నారు.ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ లోక్‌సభ తొలి దశ ఎన్నికల్లోనే బీజేపీకి గట్టి సందేశం అందిందన్నారు. అటల్ హయాంలో పార్టీ కేడర్‌కు గౌరవం ఉండేదని, ఇప్పుడు అలా లేదని ఆరోపించారు. బీజేపీ వాగ్దానాలకు ప్రజలు విసిగిపోయారని, వారంతా మార్పు కోసం ఎదురు చూస్తున్నారని , ఈసారి తాను గెలుస్తానని రాయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ గంగామాత కుమారునిగా వచ్చానని చెప్పారని, ఇప్పుడు గంగ మురికిమయంగా మారిందన్నారు. బీజేపీ నేతలు కాశీని ప్రయోగశాలగా తీర్చిదిద్దారని, రోజుకో కొత్త ప్రయోగంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.బీజేపీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అజయ్ రాయ్ 2009లో బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. తిరిగి 2012లో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 2009 నుంచి వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గడచిన మూడు ఎన్నికల్లోనూ మూడో స్థానంలో నిలిచారు. 2024లో మరోసారి ప్రధాని మోదీతో తలపడుతున్నారు. ఈసారి ఆయన ఎస్పీ కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. -
భం భం బోలే మెజార్టీ మోగాలే!
ఇప్పుడు అందరి దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బరిలో ఉన్న వారణాసి మీదే. ప్రధాని గెలుస్తారా లేదా అన్నది ప్రశ్న కాదు. ఆయనకు ఎంత మెజార్టీ వస్తుందన్నదే చర్చనీయాంశం. 2014 ఎన్నికల్లో మోదీ పోటీ చేసిన ఈ స్థానంలో ప్రత్యర్థిగా అప్పట్లో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. మోదీని ఓడిస్తానని శపథం చేసి మరీ వారణాసి నుంచి బరిలోకి దిగారు. మోదీ హవా ముందు కేజ్రీవాల్ క్రేజ్ వెలవెలబోయింది. 3 లక్షల 71 వేల 785 ఓట్ల మెజార్టీతో మోదీ విజయదుందుభి మోగించారు. ఈసారి కేజ్రీవాల్ వంటి బలమైన అభ్యర్థులు బరిలో లేరు. ఎస్పీ బీఎస్పీ ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థి శాలిని యాదవ్ రెండేళ్ల క్రితమే వారణాసి మేయర్‌గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ సారి ఆమె మూడో స్థానానికే పరిమితమవుతారని అంచనాలున్నాయి. ఇక కాంగ్రెస్ తరఫు నుంచి అజయ్‌రాయ్ గత ఎన్నికల్లో పోటీకి దిగి కనీసం డిపాజిట్ కూడా సాధించలేకపోయారు. అందుకే బీజేపీ ఈ సారి గత ఎన్నికల కంటే రెట్టింపు మెజార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా పక్కాగా అడుగులు వేస్తోంది. నామినేషన్ నుంచే బలప్రదర్శన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నాదే అన్నట్టుగా నామినేషన్ నుంచే బలప్రదర్శనకు దిగారు. నిత్యం శివనామ స్మరణతో మారుమోగే వారణాసిలో హర హర మోదీ నినాదాలు హోరెత్తేలా ఓపెన్ టాప్ వాహనంలో రోడ్ షో నిర్వహించి తన సత్తా చాటారు. ఆ తర్వాత జరిగిన గంగా హారతి, పడవ విహారం నభూతో నభవిష్యతి అన్నట్టుగా సాగాయి . మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బెంగాల్లో పట్టు బిగించడానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే వారణాసిపైన కూడా అంతే దృష్టి పెట్టారు. మోదీ కూడా ప్రతీ రోజూ ఏదో ఒక సమయంలో వారణాసికి వస్తూ పొలిటికల్ మూడ్ గమనిస్తూనే ఉన్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, సిద్ధార్థనాథ్ సింగ్, శ్రీకాంత్ శర్మ, సుష్మాస్వరాజ్, రాజ్యవర్ధన్ రాథోడ్, వీకే సింగ్ వారణాసిలో ఇల్లిల్లు తిరుగుతూ ప్రచారం చేసి అత్యధిక మెజార్టీ సాధించాలన్న పట్టుదలతో పని చేశారు. గత అయిదేళ్లలో వారణాసిలో జరిగిన అభివృద్ధినే ప్రస్తావించారు. వారణాసిని జపాన్‌లో ఆధ్యాత్మిక నగరం క్యోటోగా మారుస్తానని గత ఎన్నికల్లో మోదీ తాను ఇచ్చిన హామీని పూర్తిగా నిలబెట్టుకోలేకపోయినా ఆ దిశగా పునాదులైతే పడ్డాయి. విద్యుత్ సౌకర్యం, రోడ్ల విస్తరణ, విశ్వనాథుడి ఆలయం నుంచి గంగా ఘాట్ వరకు కారిడార్, ఇంటింటికీ పైపు లైన్ల ద్వారా గ్యాస్ సౌకర్యం వంటి ప్రాజెక్టుల్లో పురోగతి కళ్లకు కనిపిస్తూనే ఉంది. ‘‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అన్ని వర్గాలకు ఇళ్లు కట్టి ఇచ్చాం. ఆయుష్, టాయిలెట్ స్కీమ్‌లు ముస్లింలకు కూడా ప్రయోజనకరంగానే ఉన్నాయి’’ అని కొందరు ముస్లింలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా ప్రియాంకని కాకుండా ఎప్పుడైతే వేరే అభ్యర్థిని రంగంలోకి దింపిందో అప్పుడే చేతులెత్తేసిందని, మోదీకి తిరుగులేని మెజార్టీ ఖాయమన్న అభిప్రాయం అందరిలోనూ వచ్చేసింది. ‘‘మేము ఎన్నుకుంటున్నది ఒక ఎంపీని కాదు. ప్రధానమంత్రిని’’ –శిశిర్ వాజ్‌పేయి, బీజేపీ కార్యకర్త (ఇది కేవలం ఒక కార్యకర్త అభిప్రాయం మాత్రమే కాదు వారణాసి గుండె చప్పుడు కూడా ఇదే) -
మోదీపై పోటీగా అజయ్‌రాయ్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రధాని మోదీతో ప్రియాంక గాంధీ తలపడతారనే ఊహాగానాలకు తెరపడింది. తమ అభ్యర్థిగా వారణాసికి చెందిన అజయ్ రాయ్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. 2014 ఎన్నికల్లో మోదీపై పోటీ చేసిన రాయ్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ తర్వాత మూడో స్థానంలో నిలిచారు. ప్రియాంక వారణాసి నుంచి మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతారనే ఊహాగానాలు గత కొద్ది వారాలుగా కొనసాగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్.. తన సోదరి మోదీతో తలపడటంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ..‘మిమ్మల్ని సస్పెన్స్‌లో పెడుతున్నాను. సస్పెన్స్ అనేది ఎప్పుడూ చెడు విషయమే కానక్కర్లేదు..’అని చెప్పడం ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది. యావత్ దేశానికి ప్రియాంక నాయకత్వం అవసరం వారణాసి నుంచి ప్రియాంకను పోటీకి నిలపకపోవడంపై అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రజనీ నాయక్ సమాధానమిస్తూ.. ‘అభ్యర్థులను బరిలోకి దింపే విషయంలో మాకో ప్రక్రియ, ఓ విధానం అంటూ ఉన్నాయి. మొత్తం ఉత్తరప్రదేశ్‌కు, అలాగే యావత్ దేశానికి ప్రియాంక నాయకత్వం అవసరమని మేము విశ్వసిస్తున్నాం..’అని ఆమె చెప్పారు. కాగా, వారణాసి నుంచి శాలినీ యాదవ్‌ను సమాజ్‌వాదీ పార్టీ బరిలో దింపుతోంది. తమ పార్టీ గోరఖ్‌పూర్ అభ్యర్థిగా మధుసూదన్ తివారీని కాంగ్రెస్ ప్రకటించింది. ఐదు సార్లు ఎమ్మెల్యే మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అజయ్ రాయ్‌కు వారణాసి ప్రాంతంలో మంచి పట్టుంది. బీజేపీ విద్యార్థి విభాగం సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించి.. ఆ పార్టీ తరఫున వరసగా మూడుసార్లు కొలసల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేపీ లోక్‌సభ టిక్కెట్ ఇవ్వకపోవడంతో 2009 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2012 ఎన్నికల సమయంలో ఆయన 16 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. గ్యాంగ్‌స్టర్, గూండా చట్టాల కింద కూడా బుక్ అయ్యారు. -
వారణాసి బరిలో ప్రియాంక గాంధీ ఉన్నారా?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రియాంక గాంధీ ఇక్కడనుంచి పోటీచేయనున్నారనే వార్తలు హల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ అంచనాలకు తెరదించుతూ అజయ్ రాయ్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుపుతూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఈసీ జనరల్ సెక్రటరీ ఇన్చార్జి ముకుల్ వాస్నిక్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2014లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అజయ్ రాయ్‌నే పోటీకి నిలిపిన కాంగ్రెస్ ఈసారి కూడా ఆయననే ఎంచుకోవడం గమానార్హం. మరోవైపు వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని రెండోసారి కూడా వారణాసినుంచే పోటీ చేయనున్నారు. ఈ నెల 26న నామినేషన్ వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ వారణాసిలో గురువారం రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం గంగా హారతిలో పాల్గోనున్నారు. కాగా ఇటీవల క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గాంధీ మోదీపై పోటీ చేస్తారన్న ఊహాగానాలు భారీగా వినిపించాయి. ప్రస్తుతం ఈస్ట్ యూపీ ఇంచార్జ్‌గా బాధ్యతలను చేపట్టిన ప్రియాంక ప్రచారంలో దూసుకుపోతున్నారు. మే 19న ఏడవ విడత ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
దేవుడి పేరుతో ఓట్ల వేట
బీజేపీ, కాంగ్రెస్.. పార్టీ ఏదైనా ఓట్ల వేట సాగించేది మాత్రం దేవుడి పేరుతోనే. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఫైజాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే, ఆయన ప్రసంగించిన సభా వేదికపై వెనకాల భారీ ఎత్తున రాముడి ఫొటోలు, అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామమందిరం ఫొటోలు ఉన్నాయి. రామమందిరం గురించి ఆ సభలో మోడీ నేరుగా ప్రస్తావించకపోయినా.. రాముడిని మాత్రం ప్రస్తావిస్తూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలను ఓడించాలని ఓటర్లను కోరారు. దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే ఆ జిల్లా అధికారులను నివేదిక కోరింది. సభలో ఆయనేం మాట్లాడారు, సభా వేదికపై ఎలాంటి ఫొటోలున్నాయని జిల్లా కలెక్టర్‌ను అడిగినట్లు యూపీ ఎన్నికల ప్రధాన అధికారి ఉమేష్ సిన్హా తెలిపారు. మరోవైపు వారణాసిలో నరేంద్ర మోడీపై పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఏకంగా కాశీ విశ్వనాథుని ఆలయం ఫొటోను తన నేపథ్యంలో పెట్టుకుని భారీ కటౌట్లు వారణాసి నగరంలో ఏర్పాటుచేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు వివాదాన్ని సృష్టిస్తున్నాయి.