దేశంలో లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరాయి. ఈ నేపధ్యంలో యూపీలో రసవత్తర రాజకీయాలు నడుస్తున్నాయి. వారణాసి నుంచి ప్రధాని మోదీపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొన్నారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ లోక్‌సభ తొలి దశ ఎన్నికల్లోనే బీజేపీకి గట్టి సందేశం అందిందన్నారు. అటల్ హయాంలో పార్టీ కేడర్‌కు గౌరవం ఉండేదని, ఇప్పుడు అలా లేదని ఆరోపించారు. బీజేపీ వాగ్దానాలకు ప్రజలు విసిగిపోయారని, వారంతా మార్పు కోసం ఎదురు చూస్తున్నారని , ఈసారి తాను గెలుస్తానని రాయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ గంగామాత కుమారునిగా వచ్చానని చెప్పారని, ఇప్పుడు గంగ మురికిమయంగా మారిందన్నారు. బీజేపీ నేతలు కాశీని ప్రయోగశాలగా తీర్చిదిద్దారని, రోజుకో కొత్త ప్రయోగంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
బీజేపీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అజయ్ రాయ్ 2009లో బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. తిరిగి 2012లో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 2009 నుంచి వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గడచిన మూడు ఎన్నికల్లోనూ మూడో స్థానంలో నిలిచారు. 2024లో మరోసారి ప్రధాని మోదీతో తలపడుతున్నారు. ఈసారి ఆయన ఎస్పీ కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment