
యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమితో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. పెద్ద రాష్ట్రంలో అధికారం కోల్పోవడం కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. దేశంలోని 22వ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా మెజారిటీ సాధించడంతో కాంగ్రెస్ విస్తుపోయింది. ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కర్ణాటకలో విస్తృతంగా ప్రచారం చేపట్టి ఇక నుంచి పార్టీకి ఓటమి ఉండదని భరోసా ఇచ్చినా, పార్టీ తుదివరకూ పోరాడినా దిగ్భ్రాంతికర ఫలితాలు ఎదురవడం మింగుడుపడటం లేదు. రాహుల్ నాయకత్వంపై తమకు ఇప్పటికీ విశ్వాసం ఉన్నా ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు పార్టీలో తక్షణం ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పార్టీ శ్రేణులు కోరతున్నాయి.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు ప్రియాంక గాంధీ అవసరం ఉందని కొందరు నేతలు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. రాహుల్ నాయకత్వంలో పలు రాష్ట్రాల్లో పార్టీ ఓటమి పాలవుతుండటంతో ఆయన నాయకత్వంపై పలువురు నేతల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని అభిమానించే కార్యకర్తలు వరుస ఓటములతో డీలాపడుతున్నారు. పార్టీలో ప్రియాంకకు సముచిత స్ధానం ఇవ్వాలని గత కొన్నేళ్లుగా గట్టి డిమాండ్ వినిపిస్తున్నా కర్ణాటకలో పార్టీ ఓటమితో ఈ డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రియాంక ఇప్పటివరకూ తన రాజకీయ కార్యకలాపాలను గాంధీ కుటుంబం బరిలో నిలిచే అమేథి, రాయ్‌బరేలి నియోజకవర్గాలకే పరిమితం చేస్తున్న విషయం తెలిసిందే.