ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా జోడీ
సాక్షి, బెంగళూర్ : క్షేత్రస్ధాయిలో బీజేపీ చీఫ్ అమిత్ షా కసరత్తు..ప్రచార ర్యాలీల్లో ప్రధాని మోదీ ఉద్వేగపూరిత ప్రసంగాలు..కన్నడసీమలో కమలవికాసానికి బీజేపీ అనుసరించిన వ్యూహం ఫలించింది. గత ఐదేళ్లుగా ఎన్నికల్లో మోదీ-షా అనుసరిస్తున్న వ్యూహమే కర్ణాటక ఉత్కంఠ పోరులో ఆ పార్టీ విజయానికి ఉపకరించింది. రెండంచెల వ్యూహంలో భాగంగా తొలి దశలో ఎన్నికలకు ఏడాది ముందుగా దీర్ఘకాల సన్నాహాలు చేపట్టడం, క్షేత్రస్ధాయిలో కార్యకర్తలను, పార్టీ శ్రేణులను ఎన్నికలకు కార్యోన్ముఖులను చేయడం చేపట్టారు. బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచే సామాజిక వర్గాలను అక్కున చేర్చుకోవడంతో పాటు విపక్ష ఓటు బ్యాంకులను భగ్నం చేసేందుకు వ్యూహాలు రచించేందుకు ఈ దశలో పదునుపెట్టడం బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంలో భాగం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌లను ఏకతాటిపైకి నడిపించడంలో బీజేపీ వ్యూహాత్మకంగా బీఎస్ యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా అగ్రభాగాన నిలిపింది. అదేతరహాలో కాంగ్రెస్‌కు అండగా నిలిచే దళితులను ఆకట్టుకునేందుకు దళిత నేత శ్రీరాములుకు ప్రాధాన్యత కల్పించడం, పరివర్తన యాత్రలో భాగంగా దళితుల ఇళ్లలో యడ్యూరప్ప విందు ఆరగించడం వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అధికారంలో చురుకుగా పాలుపంచుకుంటున్న ప్రాబల్యవర్గాల పట్ల అసంతృప్తితో ఉన్న అత్యంత వెనుకబడిన కులాలను ఆకట్టుకోవడం కూడా మోదీ-షా వ్యూహంలో భాగమే.
ఇక రెండో దశ బీజేపీ ప్రచారం గత ఎన్నికల తరహాలోనే మోదీ ఉద్వేగపూరిత ప్రసంగాలు, భారీ ర్యాలీలు, రోడ్ షోలతో హోరెత్తించడం ద్వారా ప్రచార పర్వంలో పైచేయి సాధించడం. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ సీప్లేన్‌ను ఉపయోగించడం ఈ తరహా ప్రచారార్భాటాలకు పరాకాష్టగా చెబుతారు. బీజేపీ ప్రచార పర్వం స్థూలంగా అమిత్ షా క్షేత్రస్ధాయి కసరత్తు, ప్రధాని ప్రచార ర్యాలీల సమ్మిళితంగా ఉంటుంది. ఇదే వ్యూహం ఆ పార్టీకి పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలను అందించింది. అయితే 2015లో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరి వ్యూహం బెడిసికొట్టింది. అసెంబ్లీ ఎన్నికలు స్ధానిక అవసరాలను నెరవేర్చే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకే జరుగుతాయని, దేశ ప్రధానికి వీటితో సంబంధం లేదని ఈ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్, నితీష్ కుమార్‌లు ఓటర్లకు వివరించడంలో సఫలీకృతులయ్యారు.
లింగాయత్‌లను ప్రత్యేక మతంగా పరిగణిస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీసుకున్న నిర్ణయం సైతం కాంగ్రెస్‌కు కలిసిరాలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ముఖ్యమంత్రి వర్సెస్ ప్రధానమంత్రిగా బీజేపీ మార్చేందుకు ప్రయత్నించినా సిద్ధరామయ్య ఆ ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోవడంకాంగ్రెస్కు శరాఘాతమైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌కు రానున్న సార్వత్రిక ఎన్నికలకు గట్టి సందేశాన్నే పంపాయి. ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు సరైన నాయకత్వం ఎంత అవసరమో ఈ ఫలితాలు విస్పష్టంగా వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment