న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన ఈ సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాయకత్వ, పాలనా బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని, ప్రజలను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. ఈ క్లిష్ట సమయంలో తోటి వారికి సాయపడుతూ, తోడుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆమె ‘మనం అధిగమించగలం’ శీర్షికతో ఫేస్‌బుక్‌లో భావోద్వేగంతో పోస్ట్ చేశారు.
‘చాలా భారమైన హృదయంతో మీకు రాయాల్సి వస్తోంది. మీలో చాలా మంది కొద్ది వారాల్లో తమ ఆత్మీయులను కోల్పోయారని నాకు తెలుసు. చాలా మంది కుటుంబసభ్యులు కోవిడ్‌తో పోరాడుతున్నారు. కొందరు కోవిడ్ భయంతో ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ మహమ్మారితో ప్రభావితం కానీ వారెవరూ లేరు. దేశవ్యాప్తంగా ప్రజలు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సాయం కోసమో, టీకా తదుపరి డోస్ కోసమో ఎదురుచూపులు చూస్తున్నారు’ అని పేర్కొన్నారు.
‘ఈ నిరాశా సమయంలో మనం బలాన్ని కూడదీసుకుందాం. ఇతరులకు చేతనైనంత మేర సాయ పడదాం. అలుపెరగక, అన్ని ఇబ్బందులను దాటుకుంటూ సంకల్పంతో సాగడం ద్వారా మనం అధిగమించగలం’ అని తెలిపారు. ‘ఈ ప్రభుత్వం మనల్ని గాలికొదిలేసింది. ఇంతటి విధ్వంసకర సమయంలో ప్రభుత్వం నాయకత్వ, అధికార బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకోవడం ఎవరూ ఊహించలేనిది. అయినా ప్రజలు నిరాశ చెందకూడదు. ప్రతి కష్ట కాలంలోనూ సాధారణ ప్రజలు నాలాంటి, మీలాంటి వారు ముందుకు వస్తారు. మానవత్వం ఎన్నటికీ ఓడిపోదు’అని ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment