లక్నో : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ సోన్‌భద్ర పర్యటనపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ విమర్శలు ఎక్కుపెట్టారు. సోన్‌భద్ర ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని, రాజకీయాలు చేయడానికే ప్రియాంక అక్కడకు వెళుతున్నారని ఆయన విమర్శించారు. సున్నితమైన అంశాలపై రాజకీయాలు చేయడం సరికాదని దినేశ్ శర్మ సూచించారు. శాంతి భద్రతలకే తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ విమర్శలను దినేశ్ శర్మ తీవ్రంగా ఖండించారు.
కాగా ఈ నెల 17న ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర జిల్లా గోరేవాల్ ప్రాంతంలో ఓ భూవివాదం విషయమై కాల్పులు చోటుచేసుకొని గోండీ తెగకు చెందిన 10మంది మరణించగా, బాధిత కుటుంబాల పరామర్శకు బయల్దేరిన ప్రియాంక గాంధీని పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అరెస్ట్ చేసి మీర్జాపూర్‌లోని చునార్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. అయితే ప్రియాంక అరెస్ట్‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మరోవైపు చునార్ గెస్ట్‌హౌస్ ప్రియాంకా గాంధీ ధర్నా కొనసాగుతోంది. సోన్‌భద్ర బాధితుల్ని పరామర్శించేంతవరకూ తాను ఇక్కడ నుంచి కదిలేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఇక ప్రియాంకా గాంధీని కలిసేందుకు వచ్చిన బాధిత కుటుంబ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే సోన్‌భద్రకు వెళ్లేందుకు వచ్చిన టీఎంసీ ప్రతినిధులను వారణాసి విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment