సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు, బలమైన శక్తిగా ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాలకు పదునుపెడుతోంది. పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరగబోయే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిజ్ఞా యాత్రల పేరుతో శనివారం నుంచి ప్రజల్లోకి వెళ్లనుంది.
మొదటి దశలో జరిగే మూడు ప్రతిజ్ఞా యాత్రలు వారణాసి, బారాబంకీ, శహరాన్‌పూర్ నుంచి ప్రారంభమవుతాయి. శనివారం బారాబంకీలో బహిరంగ సభ తర్వాత ప్రియాంక గాంధీ ప్రతిజ్ఞా యాత్రలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ యాత్రలు నవంబర్ 1న ముగుస్తాయి. నాలుగో యాత్ర దీపావళి తర్వాత ప్రారంభం కానుందని కాంగ్రెస్ నేత పీఎల్ పునియా తెలిపారు. ఈ యాత్రల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇవ్వనున్న హామీలను ప్రియాంక ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు తాము 40 శాతం టిక్కెట్లు ఇస్తానని ప్రియాంక ఇప్పటికే మొదటి హామీని
ప్రకటించారు.
31న గోరఖ్‌పూర్‌లో భారీ ర్యాలీ
నవరాత్రుల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో భారీ ర్యాలీ నిర్వహించిన ప్రియాంకా గాంధీ ఇప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా అక్టోబర్ 31న గోరఖ్‌పూర్‌లో రెండు లక్షల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. మహిళా శక్తితో ఉత్తరప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాలనుకుంటున్న ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకున్నారు. యూపీలోని పూర్వాంచల్‌లో 125 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందుకే ఈ ప్రాంతంపై ప్రియాంకా గాంధీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment