సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అనేక రాజకీయ పార్టీలకు ‘ఫ్యామిలీ ఈజ్ ది పార్టీ’ కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం ‘పార్టీ ఈజ్ ది ఫ్యామిలీ’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తనదైన శైలిలో ప్రతిపక్ష పార్టీల వారసత్వ రాజకీయాలను ఘాటుగా విమర్శించారు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ఎండగుడుతున్న ఆయన, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాగానే తన దాడిని ముమ్మరం చేశారు. అయితే ఈ వారసత్వ రాజకీయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాలేదు. నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సహా అనేక పార్టీల్లో ఈ వారసత్వ రాజకీయాలు నేటికి కొనసాగుతున్నాయి. అలా అని ఈ రాజకీయాలు ఒక్క భారత దేశాన్ని మాత్రమే వేధిస్తోన్న సమస్య కాదు.
జపాన్ నుంచి పిలిప్పీన్స్ వరకు ఈ వారసత్వ రాజకీయాల బెడద ఉంది. ఈ దేశాల్లో వారసత్వ రాజకీయాలపై 17వ శతాబ్దం నుంచే పోరాటం చేస్తున్నా ఏ ఒక్క దేశం కూడా ఇంతవరకు విజయం సాధించలేక పోయింది. అందుకు కారణం పలు రాజకీయ పార్టీలు కూడా వారసత్వ రాజకీయాల్లో కూరుకుపోవడమే. ఇంతకు ఎందుకు వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించాలి? అన్న అంశంపై స్పష్టత ఉంటే ఎందుకు వారసత్వ రాజకీయాలను వదులుకోలేక పోతున్నామో సులభంగానే గ్రహించవచ్చు. వారసత్వ రాజకీయాల వల్ల అధికారం కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుంది. అది ప్రజాస్వామిక మౌలిక సూత్రానికే విరుద్ధం. అందుకని వ్యతిరేకించాలి.
మరి ఒక్క వారసత్వ రాజకీయాల వల్లనే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు ఉంటుందా? ఓ వ్యక్తి వద్దనే అధికారం కేంద్రీకతమైనా, ఆ వ్యక్తి ప్రజాస్వామ్య సంస్థల ప్రతిపత్తిని లేదా స్వేచ్ఛను హరించినా, పాలకపక్షంపై రాజ్యాంగేతర శక్తుల ప్రాబల్యం కొనసాగినా ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు వాటిల్లినట్లే. రాజకీయ శాస్త్రవేత్త కాంచన్ ఛంద్రన్ అధ్యయనం ప్రకారం నేడు దేశంలోని 36 రాజకీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. వాటిల్లో 64 శాతం మంది వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారే. 2014లో ముఖ్యమంత్రులైన వారిలో 50 శాతం మంది వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారే. 2014లో 23 శాతం మంది ఎంపీలు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారే.
బీజేపీలోనూ వారసత్వ రాజకీయాలు
2009లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 36 శాతం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వారసత్వ రాజకీయాల కారణంగా వచ్చిన వారే. 39 మంది కేబినెట్ మంత్రులు అలా వచ్చిన వారే. ఇక 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన ఎంపీల శాతం 15. 2009లో అలాంటి వారి శాతం 20 శాతం ఉండింది. నరేంద్ర మోదీ ప్రస్తుత కేబినెట్‌లో 24 శాతం మంది మంత్రులది వారసత్వ రాజకీయ చరిత్రే. ఎంపీలు, ఎమ్మెల్యేలకన్నా వారసత్వ రాజకీయాల కారణంగా ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వారి వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. వారసత్వ రాజకీయాలకన్నా అధికార కేంద్రీకృతం వల్ల ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టం. నాడు వారసత్వ రాజకీయాల కారణంగానే ప్రధాని అయినప్పటికీ ఇందిరాగాంధీ వద్దనే అధికారం కేంద్రీకృతం అవడం ఎమర్జెన్సీకి దారితీసింది.
మోదీ వద్దనే అధికార కేంద్రీకరణ
నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన కొత్తలో జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర మంత్రి హర్షవర్దన్ ఆయన ముందు ఓ స్కూలు విద్యార్థిలా అటెన్షన్‌లో నిలబడడం, ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంట్‌లో జనర ల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ‘మోదీ మోదీ’ అంటూ పాలకపక్ష సభ్యులు ఆయన నామస్మరణతో బల్లలు చర్చడం అధికార కేంద్రం ఆయన్నే అనే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. కేంద్ర కేబినెట్‌తో సంబంధం లేకుండా ఆయన ఏకపక్షంగా ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయం తీసుకోవడం ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తోంది.
రాజ్యాంగేతర శక్తిగా ఆరెస్సెస్
ఇరాన్ ప్రభుత్వంలో ఉలేమాల (ఇస్లాం మతాధికారులు) పెత్తనం లాగా దేశంలోని బీజేపీ పాలకపక్షంపై ఆరెస్సెస్ పెత్తనం కొనసాగుతోంది. కాకపోతే ఇరాన్ ప్రభుత్వంలో ఉలేమాల ప్రస్థావన ఉండగా, మన రాజ్యాంగంలో ఆరెస్సెస్ ప్రస్థావన లేదు. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర మంత్రుల ఎంపిక వరకు, రాష్ట్రపతి నుంచి రాష్ట్ర గవర్నర్ల నియామకం వరకు ఆరెస్సెస్ ప్రభావం కనిపిస్తోంది. 2015లో కేంద్ర మంత్రులు ఆరెస్సెస్ అధిష్టానం ముందు ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’ ద్వారా తమ పనితీరును నిరూపించుకున్న పరిస్థితి ఆరెస్సెస్ పెత్తనానికి పరాకాష్ట. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?
డెమోక్రటిక్ సంస్థల నిర్వీర్యం
బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో అనేక ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. అర్బీఐ అభిప్రాయానికి భిన్నంగా పెద్ద నోట్లను రద్దు చేయడం, ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేక ఆర్బీఐ చైర్మన్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం, ఏకపక్షంగా సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మపై చర్యతీసుకోవడం, సుప్రీం కోర్టు తీర్పులను ఛాలెంజ్ చేయడం, ప్రజా కంఠాలను అణచివేయడం దేన్ని సూచిస్తున్నాయి ? దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు వారసత్వ రాజకీయాల వల్ల ఎక్కువ ముప్పు ఉందా ? నియంతత్వ లేదా అధికార కేంద్రీకత రాజకీయాల వల్ల ఎక్కువ ముప్పు ఉందా!?
Comments
Please login to add a commentAdd a comment