న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయుల క్షేమం కంటే రాజకీయాలే ముఖ్యమని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. శనివారం ఆమె కరోనా నియంత్రణపై ప్రధాని మోదీని విమర్శిస్తూ తన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్టు చేశారు. ‘బాధ్యులెవరు’ అనే నినాదంతో ఆమె కొంతకాలంగా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.
పిరికివాడిలా వ్యవహరించారు..
కోవిడ్ నియంత్రణ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ పిరికివాడిలా వ్యవహరించారని ప్రియాంక విమర్శించారు. పరిస్థితి చేజారే వరకూ చూసి, దేశాన్ని తలదించుకునేలా చేశారన్నారు. మోదీకి భారతీయులకంటే రాజకీయాలు ముఖ్యమని, సత్యం కంటే ప్రచారమే ముఖ్యమని మండిపడ్డారు. వాస్తవాల్ని దాచి బాధ్యత నుంచి తప్పుకున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఊహించని స్థాయిలో కరోనా రెండో వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసిందన్నారు. మొదటి వేవ్ తర్వాత ఏ చర్యలూ తీసుకోకపోవడంతో మరింత దారుణ పరిస్థితి ఎదురైందన్నారు. భారత్ సహా పలు దేశాల నిపుణులుగానీ, పార్లమెంట్ ఆరోగ్య కమిటీగానీ ఇచ్చిన సూచనలు పాటించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. వారి ఆలోచనలు విని ఉంటే దేశానికి అవసరమైన బెడ్లు, ఆక్సిజన్ వంటివి ముందుగానే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేదన్నారు. ప్రధాని సొంత ఇమేజ్ కోసం పాకులాడకపోయి ఉంటే ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత ఉండేదని కాదన్నారు. మోదీ తన గురించి చానెళ్లలో ప్రచారం చేయించుకునే బదులు కోవిడ్ గురించి ప్రచారం చేసి ఉంటే ఎంతోమంది ప్రాణాలు పోయేవి కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment