జైపూర్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఉత్త డొల్ల అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. మోదీ పాలనలో సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించే నాథుడే లేకుండాపోయాడని అన్నారు. కేవలం కొద్దిమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ లేదని, ఉపాధి అవకాశాలను కల్పించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఆమె బుధవారం రాజస్తాన్‌లోని ఝన్‌ఝున్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కుల గణనపై బీజేపీ నాయకులు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.
‘ఖాళీ లిఫాఫా'
మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా మోదీ ఖాళీ లిఫాఫా (కవరు) అంటూ మోదీని ఎద్దేశా చేశారు. 10 ఏళ్ల తరువాత మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందంటూ మండిపడ్డారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. .
ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికి బీజేపీ మతాలు, కులాల గురించి మాట్లాడుతోందని ఆక్షేపించారు. అధికారం కాపాడుకోవడానికి ప్రజలను అణచివేసే చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి సొంత లాభం కోసం పాకులాడే నాయకులను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లకు ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార సభలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మాట్లాడారు.
రాష్ట్రంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రెండు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500కు వంట గ్యాస్ సిలిండర్ అంద జేస్తామని చెప్పారు. అలాగే అర్హులైన మహిళలకు సంవత్సరానికి రూ.10,000 చొప్పున గౌరవ భృతి ఇస్తామని వెల్లడించారు. ఇంటి పెద్ద అయిన మహిళలకు ఈ గౌరవ భృతి అందుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment