
ప్రియాంక, రాహుల్ గాంధీ (ఫైల్)
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం.. భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) గొంతునొక్కిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎలక్టోరల్ బాండ్ల మాటున నల్లధనంతో బీజేపీ ఖజానా నింపుకుంటోందని, వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ‘కొత్త భారత దేశంలో లంచాలు, చట్టవిరుద్ధ కమిషన్లను ఎలక్టోరల్ బాండ్లగా పిలుస్తార’ని రాహుల్ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఎలక్టోరల్ బాండ్లపై ‘హఫింగ్టన్‌పోస్ట్’లో వచ్చిన కథనం లింక్‌ను షేర్ చేశారు.
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఆర్బీఐను, జాతీయ భద్రతను బీజేపీ ప్రభుత్వం పక్కనబెట్టిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దుయ్యబట్టారు. నల్లధనాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. తన ఖజానాను ఆ నల్లధనంతోనే నింపుకుంటోందని ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఇది క్విడ్ ప్రొ కో కదా?
మనీ ల్యాండరింగ్‌ను ప్రోత్సహించేలా ఈ విధానం ఉందని, ఈ బాండ్లను కొనుగోలు చేసిన వారి వివరాలను బహిరంగ పరచాలని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. మోదీ సర్కారు జవాబు చెప్పాలంటూ పలు ప్రశ్నలు సంధించారు. ఎన్ని వేల కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారు? బీజేపీ ఎన్ని వేల కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో తీసుకుంది? ఇది క్విడ్ ప్రొ కో కదా? అంటూ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment