న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 4వ తేదీన రాహుల్, ప్రియాంక కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే రోజు ఆమె తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం సోదరుడు రాహుల్‌తో కలిసి లక్నోలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఒకవేళ ఫిబ్రవరి 4వ తేదీన వీలుకాకుంటే 10వ తేదీన వసంత పంచమి రోజు కుంభమేళాకు వెళతారని సమాచారం.
తోబుట్టువులిద్దరూ గంగ, యమున, అంతర్వాహిని సరస్వతీ సంగమంలో పవిత్ర స్నానాలు చేయనుండటం ఇదే ప్రథమం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కీలకంగా వ్యవహరించేందుకు ఇటీవల సోదరి ప్రియాంకకు రాహుల్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హిందుత్వ భావనపై కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి ఆవలంబిస్తోందనే అపవాదును తొలగించుకునేందుకే రాహుల్, ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, 2001లో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి, రాహుల్ తల్లి సోనియా గాంధీ కుంభమేళాలో పాల్గొన్నారు.
గోవాలో రాహుల్, సోనియా
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం శనివారం గోవాకు చేరుకున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. రాబోయే మూడు రోజులు వీరు గోవాలోనే ఉంటారన్నారు. వీరు దక్షిణగోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బసచేస్తున్నారన్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమనీ, రాహుల్, సోనియా పార్టీ నేతలను కలుసుకోబోరని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment