లక్నో : యూపీలో బీజేపీ ఓటు బ్యాంక్‌కు గండికొట్టి ఎస్పీ-బీఎస్పీ కూటమికి మేలు చేసేందుకు పలు స్ధానాల్లో బలహీన అభ్యర్ధులను బరిలో దింపామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అంగీకరించారు. బీజేపీని ఓడించాలనే ఉమ్మడి లక్ష్యంతో ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి కాంగ్రెస్ లోపాయికారీగా సహకరిస్తుందనే వార్తలను ప్రియాంక నిర్ధారించడం గమనార్హం. యూపీలో ప్రచారం సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ యూపీలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పుకొచ్చారు.
తాము బలంగా ఉన్న స్ధానాల్లో గట్టిపోటీని ఇస్తూ బీజేపీని ఓడిస్తామని, తాము బలహీనంగా ఉన్న స్ధానాల్లో బీజేపీ ఓటు బ్యాంకును చీల్చే అభ్యర్ధులను ఎంపిక చేశామని చెప్పారు. కాగా బీజేపీని ఓడించేందుకు ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. మహాకూటమిలో కలిసేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు రాహుల్, సోనియా పోటీచేస్తున్న అమేథి, రాయ్‌బరేలి స్ధానాల్లో ఎస్పీ-బీఎస్పీ తమ అభ్యర్ధులను బరిలో దింపలేదు. లోక్‌సభ ఎన్నికలు చరమాంకానికి చేరుకోవడంతో ఇక ఎన్నికల అనంతర పొత్తులపైనే ఆయా పార్టీలు దృష్టిసారించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment