సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ చేసిందా? తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటిపైనా మరింత దృష్టి పెట్టేందుకు సిద్ధమైందా? ఇందులో భాగంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీకి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను అప్పగించనున్నారా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. పార్టీ కేడర్ బలంగా ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రా ల్లో నేతలను ముందుకు నడిపించే బాధ్యతను ప్రియాంకా గాంధీకి అప్పగించే అవ కాశం ఉందని చెబుతున్నాయి.
ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. ఆమెకు నేరుగా ఇన్‌చార్జి బాధ్యతలు ఇస్తారని కొందరు చెబుతుంటే.. మాణిక్యం ఠాగూర్ స్థానంలో ప్రియాంకకు నమ్మకమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో నేతను ఇన్‌చార్జిగా నియమించి, ఆమె పర్యవేక్షిస్తారని మరికొందరు అంటున్నారు. అవసరమైనప్పుడు ప్రియాంక నేరుగా రంగంలోకి దిగుతారని చెప్తున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాలన్నింటిపైనా ఆమెకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి.
మరింత వేడెక్కుతున్న ‘ఉప ఎన్నిక’!
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తదనంతర పరిణామాలు, మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారాలతో కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న వేడి మరింతగా మండుతోంది. తనపై చేసిన కామెంట్ల విషయంగా క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టుపట్టడంతో టీపీసీసీ చీఫ్ ఓ మెట్టు దిగి వచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ నేతల మధ్య మనస్పర్థలు ఉండొద్దన్న అధిష్టానం సూచన మేరకు.. బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు శనివారం ఓ వీడియో విడుదల చేశారు.
‘‘ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డు ప్రస్తావన, మునుగోడు బహిరంగ సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ పరుష పదజాలాన్ని వాడటంతో వెంకటరెడ్డి ఎంతో మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా క్షమాపణలు చెప్పాలని నన్ను డిమాండ్ చేశారు. బేషరతుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సారీ చెప్తున్నా. ఇలాంటి చర్యలు, ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వెంకటరెడ్డిని అవమానించేలా ఎవరు మాట్లాడినా సరికాదు. ఈ అంశాలను తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేయడం జరుగుతుంది’’ అని రేవంత్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆ వీడియోను ట్విట్టర్‌లోనూ పోస్ట్ చేశారు.
తర్వాత అద్దంకి దయాకర్ కూడా వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్తూ వీడియో పెట్టారు. తాను ఇప్పటికే బహిరంగంగా క్షమాపణలు చెప్పానని, మరోమారు క్షమాపణలు కోరుతున్నానని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానని, వెంకటరెడ్డి సోదర భావంతో క్షమించి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని కోరారు.
సంతోషమే.. కానీ..
రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పినా ఎంపీ వెంకటరెడ్డి తన పట్టు వీడలేదు. ‘‘రేవంత్ క్షమాపణలు చెప్పడం సంతోషమే, కానీ మాట్లాడలేని పదాలు ఉపయోగించిన దయాకర్‌ను శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరించాలి. అప్పుడే ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు..’’ అని వెంకటరెడ్డి పేర్కొన్నారు. కనీసం దయాకర్‌ను సస్పెండ్ చేస్తే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనడంపై ఆలోచిద్దామన్న ధోరణిలో మాట్లాడారు. అయితే.. వెంకటరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో.. తాను హోంగార్డునేనని, 30ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి హోంగార్డుగా పనిచేస్తున్నానని పేర్కొంటూ చేసిన పోస్టు మరోసారి చర్చకు దారితీసింది.
కరోనా వచ్చిందంటూ..!
షెడ్యూల్ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి శనివారం మునుగోడు నియోజకవర్గంలో నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు జరిగిన పార్టీ పాదయాత్రలో పాల్గొనాల్సి ఉంది. కానీ రేవంత్ హాజరుకాలేదు. ఆయనకు జ్వరం, కరోనా లక్షణాలు ఉన్నాయని, అందువల్ల హోం ఐసోలేషన్‌లో ఉన్నారని రేవంత్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొనలేకపోయారని పేర్కొన్నాయి. అయితే రేవంత్ పాదయాత్రకు వెళ్లకపోవడం అటు కాంగ్రెస్ పార్టీలో, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సమన్వయం కోసమే ప్రియాంకకు బాధ్యతలు
ఎన్నికలు సమీపిస్తున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ బలంగా ఉందని, కేడర్ క్రియాశీలకంగా పనిచేస్తోందని.. కానీ పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం ఉందనే ఆలోచనలో అధిష్టానం పెద్దలున్నట్టు సమాచారం. తెలంగాణలో రేవంత్ వర్సెస్ సీనియర్లు అనే కోణంలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుండగా.. కర్ణాటకలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గాల మధ్య కూడా విభేదాలు పెరుగుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల పర్యవేక్షణ బాధ్యతలను నేరుగా ప్రియాంకకు అప్పజెప్తారనే చర్చ జరుగుతోంది.
చదవండి: తెలంగాణపై పూర్తి పేటెంట్ టీఆర్‌ఎస్‌దే..
Comments
Please login to add a commentAdd a comment