సాక్షి, హైదరాబాద్: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ల నిర్ణయానికి వెంకట్ రెడ్డి మద్దతు తెలిపారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
కాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్లు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీలపై సీనియర్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నాశనం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ.. సేవ్ కాంగ్రెస్ నినాదం ఎత్తుకున్నారు. రేవంత్‌కు వ్యతిరేకంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భట్టి నివాసంలో శనివారం అందరూ సమావేశమయ్యారు. ఈ భేటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. వలస వాదులతో అసలు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని విమర్శించారు. ఈ ఎపిసోడ్‌లో తాను మనస్తాపానికి గురయ్యానని తెలిపారు. అసలు కాంగ్రెస్ నాయకులను కోవర్టులుగా ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కాంగ్రెస్ మేమేనని ప్రకటించుకున్న సీనియర్లు.. ఢిల్లీలోనే హైకమాండ్ ముందు తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఉనికి కాపాడమా? దెబ్బతీశామా?: జగ్గారెడ్డి
కాంగ్రెస్ ఉనికిని కాపాడిన తమపై కోవర్టులు అనే ముద్ర వేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదక్, ఖమ్మంలో పోటీలో నిలబెట్టి కాంగ్రెస్‌ను బతికించామని తెలిపారు. ‘ఉనికి కాపాడమా? దెబ్బతీశామా? మేము కోవర్టులమా? మాపై జిల్లాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు.. దీనిని వలస నేతలు ఖండించడం లేదు. రాహుల్ జోడో యాత్ర కోసం కష్టపడ్డం. సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా నిర్మల పేరు పెడితే ఎందుకు ఆపారు. మమ్మల్ని ఎవరో బతికిస్తున్నట్లు మా పరిస్థితి మారింది’ అని జగ్గారెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment