రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతుండడం పట్ల కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా సబ్ కా వికాస్ అనేది ఎక్కడా లేదని, సబ్ కా వినాశ్ మాత్రమే కొనసాగుతోందని, దేశంలో కాదు, కేవలం పెట్రో ఉత్పత్తుల ధరల్లోనే అభివృద్ధి కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఆదివారం హిందీలో ట్వీట్ చేశారు. ప్రజల నుంచి ప్రభుత్వం బలవంతంగా పన్నులు లాక్కుంటోందని ఆరోపించారు. పన్నుల బెడద లేకపోతే ఇండియాలో లీటర్ పెట్రోల్ రూ.66కు, డీజిల్ రూ.55కే లభిస్తుందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని రాహుల్ గాంధీ తన ట్వీట్‌కు జతచేశారు.
మోదీ మిత్రులే సంపన్నులవుతున్నారు: ప్రియాంక
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా పెంచుకుంటూ పోతోందని, ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు కష్టాల పాలవుతున్నారని పేర్కొంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఆదివారం ట్వీట్ చేశారు. కేంద్రం ఎరువుల ధరలను సైతం భారీగా పెంచిందని చెప్పారు. బీజేపీ పాలనలో ధరల మంటతో రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతుండగా, ప్రధాని నరేంద్ర మోదీ మిత్రులు మాత్రం నానాటికీ ధనవంతులవుతున్నారని ప్రియాంక నిప్పులు చెరిగారు.
వరుసగా నాలుగో రోజు ధరల వాత
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు సైతం పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు 35 పైసల చొప్పున పెంచినట్లు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. (చదవండి: పంజాబ్‌కు 13 పాయింట్ల ఎజెండా)
Comments
Please login to add a commentAdd a comment