ఆ విషయం ప్రధాని మోదీ అర్థం చేసుకోవడం లేదు
రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు సాగించారు
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా ధ్వజం
బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించే ధైర్యం ఉందా?
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం అంటే సంఘ్ విధానం కాదన్న సంగతి ప్రధాని నరేంద్ర మోదీ అర్థం చేసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా అన్నారు. భారత్ కా సంవిధాన్ సంఘ్ కా విధాన్ కాదని తేల్చిచెప్పారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆమె శుక్రవారం లోక్‌సభలో 32 నిమిషాలపాటు హిందీ భాషలో మాట్లాడారు. రాజ్యాంగంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. న్యాయం, ఐక్యత, భావప్రకటనా స్వేచ్చకు రాజ్యాంగం ఒక రక్షణ కవచమని ఉద్ఘాటించారు. అలాంటి మహోన్నత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రియాంక ఇంకా ఏం మాట్లాడారంటే...
నెహ్రూ పాత్రను ఎవరూ చెరిపేయలేరు
‘‘ఆర్థిక న్యాయానికి, రైతులకు, పేదలకు భూములు పంపిణీకి చేయడానికి మన రాజ్యాంగమే పునాది వేసింది. బీజేపీ నేతలు తరచుగా జవహర్‌లాల్ నెహ్రూను వేలెత్తి చూపుతున్నారు. వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నెహ్రూపై నిందలు వేస్తున్నారు. దేశం కోసం మీరేం చేస్తున్నారో చెప్పకుండా నెహ్రూను విమర్శిస్తే లాభం లేదు. గతంలో అది జరిగింది, ఇది జరిగింది అని బీజేపీ సభ్యుల విమర్శలు చేస్తున్నారు. రాజకీయ న్యాయం గురించి మాట్లాడుతున్నారు. డబ్బు బలంతో ప్రభుత్వాలను పడగొట్టింది మీరు కాదా? మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యాంగం అమలు కాలేదు. బీజేపీకి నిజంగా ధైర్యం ఉంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడు అసలు నిజం ఏమిటో బయటపడుతుంది.
మోదీకి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు
గతంలో రాజులు మారువేషాల్లో ప్రజల్లోకి వెళ్లేవారని చదువుకున్నాం. తమ పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో రాజులు స్వయంగా తెలుసుకొనేవారట. తమపై ప్రజల ఆరోపణలు ఏమిటో గ్రహించేవారట. ఇప్పటి రాజు(నరేంద్ర మోదీ) వేషాలు మార్చేయడంలో ఆరితేరిపోయారు. కానీ, ప్రజల్లో వెళ్లే ధైర్యం గానీ, ఆరోపణలు వినే ధైర్యం గానీ ఆయనకు లేదు. మన ప్రధానమంత్రి రాజ్యాంగం ఎదుట తలవంచి నమస్కరించారు. రాజ్యాంగానికి నుదురు తాకించారు. సంభాల్, హథ్రాస్, మణిపూర్‌లో న్యాయం కోసం ఆక్రోశించినప్పుడు ఆయన మనసు చలించలేదు. ఆయన నుదుటిపై చిన్న ముడత కూడా పడలేదు. రాజ్యాంగాన్ని మోదీ అర్థం చేసుకోలేదు.
భయాన్ని వ్యాప్తి చేసినవారు భయంతో బతుకుతున్నారు
దేశంలో కుల గణన జరగాలన్నదే ప్రజల అభిమతం. అందుకోసం వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభించాలి. కేవలం ఒక్క బిలియనీర్(గౌతమ్ అదానీ) కోసం దేశ ప్రజలంతా కష్టాలు అనుభవించాలా? దేశంలో అసమానతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. బ్రిటిష్ పాలనలో ఉన్నట్లుగానే నేడు భయం అంతటా ఆవహించింది. స్వాతంత్య్రం కోసం పోరాడిన గాం«దీజీ భావజాలం కలిగిన వ్యక్తులు ఒకవైపు, బ్రిటిషర్లతో అంటకాగిన భావజాలం కలిగిన వ్యక్తులు మరోవైపు ఉన్నారు. భయానికి ఒక లక్షణ ఉంది. భయాన్ని వ్యాప్తి చేసేవారే ఆదే భయానికి బాధితులవుతారు. ఇది సహజ న్యాయం. నేడు దేశంలో భయాన్ని వ్యాప్తి చేసినవారు అదే భయంతో బతుకున్నారు. చర్చకు, విమర్శకు భయపడుతున్నారు’’ అని ప్రియాంక అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment