
న్యూఢిల్లీ/లక్నో: కరోనా మహమ్మారిపై ఒక్కొక్కరు ఒక్కో రీతితో యుద్ధం చేస్తున్నారు.. రామకృష్ణ అనే యువకుడు కూడా అదే కోవలోకి చెందుతారు.. కరోనాపై పోరాడేందుకు రావాల్సిందిగా పిలుపు రాగానే వెంటనే అన్నీ వదిలేసి వెంటనే 1,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇందుకోసం హైదరాబాద్ వెళతానని తల్లిదండ్రులకు కూడా అబద్ధం చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన రామకృష్ణ లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో మైక్రోబయాలజీలో ఆరు నెలల కిందే పీహెచ్‌డీ పూర్తి చేశారు. కరోనా పాజిటివ్ కేసులను టెస్ట్ చేయాల్సిందిగా తన డిపార్ట్ మెంట్ హెడ్ అమితా జైన్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులకు పొలం పనుల్లో సహాయం చేస్తున్నారు. ఆ వెంటనే తన బ్యాగ్ సర్దుకుని లక్నోకు బయల్దేరారు.
ఈ విషయం చెబితే తల్లిదండ్రులు భయపడతారేమోనని.. హైదరాబాద్ లోని తన స్నేహితుల రూంలో ఉండి థీసిస్ రాసుకుంటానని చెప్పాడు. అయితే కరోనా భయంతో హైదరాబాద్ కూడా వెళ్లేందుకు నిరాకరించారు. కానీ ఎలాగోలా వారిని ఒప్పించి మార్చి 21న బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ రోజున లక్నోకు వెళ్లాల్సిన అన్ని దారులు మూసుకుపోవడంతో మరుసటి రోజున ఎయిర్ పోర్టుకు వెళ్లాడు. అయితే పోలీసులు మార్గమధ్యలో ఆపి ప్రశ్నించగా.. ఈ విషయం చెప్పడంతో వారు కూడా ఆయనకు సహకరించారు. దీంతో విమానంలో లక్నోకు వెళ్లి కరోనా పాజిటివ్ కేసులను టెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కరోనాపై యుద్ధానికి రామకృష్ణ చేస్తున్న కృషి గురించి కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ట్విట్టర్ లో పోస్టు చేయడంతో ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది.