సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకుగాను ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా సీఎంవోకు సమాచారం అందజేశారు. కరోనాను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలంటే ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచాలని, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులోకి తీసుకురావాలని ట్వీట్ చేశారు. తాను ఇస్తున్న ఎంపీ ల్యాడ్స్‌ను ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చడంతో పాటు మాస్కులు, శానిటైజర్ల కొనుగోలుకు ఉపయోగించాలని కోరారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వం మరింత దూకుడుతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజలంతా సామాజిక దూరాన్ని విధిగా పాటించి కరోనాను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు.
వారిని ఇళ్లకు చేర్చండి
కాశీ యాత్రకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన తెలుగు ప్రజలను వారి స్వస్థలాలకు చేర్చాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. కాశీలో దాదాపు వెయ్యి మంది తెలుగు ప్రజలు చిక్కుకున్నారని, వారిలో తన నియోజకవర్గ పరిధిలోని బి.పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్ గ్రామానికి చెందిన 35 మంది ఉన్నారని తెలిపారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అక్కడి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వారిని స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు కోమటిరెడ్డి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment