లోక్‌సభ ఎన్నికల ముంగిట ప్రియాంక గాంధీ ఎట్టకేలకు రాజకీయ అరంగేట్రం చేశారు. ఉత్తరప్రదేశ్ (తూర్పు) పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమించడం ద్వారా కాంగ్రెస్ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తూర్పు యూపీలోని 30 లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత ఇప్పుడు ప్రియాంకపై ఉంది. ఈ ప్రాంతంలోనే ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసి, సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇంతకుమునుపు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్ ఉన్నాయి.
తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌ల నియోజకవర్గాలు రాయ్‌బరేలీ, అమేథీల్లో ఆమె 1999 నుంచి అడపాదడపా ప్రచారం చేస్తున్నారు. ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలను కలుస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. 2007, 2012, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రియాంక ఈ రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు.
ఇలా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయకుండా పూర్తి స్థాయిలో ప్రియాంకను రాజకీయాల్లోకి దింపి బాధ్యతలు అప్పగిస్తే నాయనమ్మ ఇందిరాగాంధీలా తిరుగులేని విజయాలు సాధిస్తారనే నమ్మకం పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉంది. ముఖకవళికలు, నడక, వేష భాషల్లో ఇందిర పోలికలు ప్రియాంకలో ఎక్కువనే భావన సర్వత్రా ఉంది. 20 ఏళ్ల క్రితమే ప్రియాంకకు కాంగ్రెస్‌లో క్రియాశీల బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వచ్చినా, తన పిల్లలు ఎదిగే వరకూ ఎదురుచూడాలనే ఇంతకాలం ఆగారని పరిశీలకులు భావిస్తున్నారు. అనుకున్నట్లే కొడుకు రేహాన్(18), కూతురు మిరాయా(16)కు టీనేజ్ వయసు వచ్చాకే ఆమె క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు.
► 1999లో సోనియా తరఫున ప్రచారం..
కాంగ్రెస్ కష్టకాలంలో ఉండగా జరిగిన 1999 లోక్‌సభ ఎన్నికల్లో తల్లి, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మొదటిసారి రాజీవ్ గాంధీ నియోజకవర్గమైన అమేథీ నుంచి పోటీచేసినప్పుడు ప్రియాంక ఎన్నికల ప్రచారంలో తొలిసారి పాల్గొన్నారు. ఇక, రాయ్‌బరేలీలో సమీప బంధువు అరుణ్‌నెహ్రూ బీజేపీ తరఫున పోటీచేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన తన తండ్రి సన్నిహిత మిత్రుడు కెప్టెన్ సతీశ్‌శర్మ తరఫున ప్రచారం చేసి గెలిపించారు. అరుణ్ నెహ్రూ పేరెత్తకుండా, ‘ఇందిరాజీ కుటుంబానికి ద్రోహం చేసి, నా తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తే ఇక్కడ బీజేపీ అభ్యర్థి’ అంటూ ప్రియాంక నిప్పులు చెరిగారు.
ఈ ఎన్నికల్లో సోనియా భారీ మెజారిటీతో విజయం సాధించగా, అరుణ్‌నెహ్రూను సతీశ్‌శర్మ ఓడించారు. ఇలా ప్రియాంక రాజకీయాల మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. 2004 లోక్‌సభ ఎన్నికల తరువాత సోనియా ప్రధాని పదవిని తిరస్కరించడం వెనక రాహుల్‌తో పాటు ప్రియాంక కూడా ఉన్నట్లు చెబుతారు. 2014 ఎన్నికల్లో అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీతో తలపడిన రాహుల్‌గాంధీ స్వల్ప మెజారిటీతోనైనా గెలవడానికి ప్రియాంక ప్రచారమే తోడ్పడిందని చాలామంది అభిప్రాయపడ్డారు.
► భర్త వ్యాపారాలతో చెడ్డపేరు!
యూపీఏ హయాంలో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రారంభించి రాజస్థాన్, హరియాణా, ఢిల్లీలో అక్రమంగా భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయాక వాద్రా భూ కుంభకోణాలపై విచారణ కొనసాగుతోంది. ప్రియాంక క్రియాశీల రాజకీయ రంగ ప్రవేశానికి భర్త వ్యాపార లావాదేవీలపై వచ్చిన ఆరోపణలు అడ్డంకిగా మారాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.
తూర్పు యూపీ బాధ్యతలే ఎందుకు?
పశ్చిమ యూపీతో పోల్చితే ఆర్థికంగా వెనుకబడిన తూర్పు ప్రాంతం రాజకీయంగా కీలకం కావడంతో నరేంద్రమోదీ వారణాసి నుంచి పోటీచేశారు. బీజేపీ, ఎస్పీ–బీఎస్పీ కూటమికి గట్టి పునాదులున్న తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తేనే ఈ పార్టీ కనీసం 20–25 సీట్ల గెలుచుకునే అవకాశం ఉంది. ఈ కారణంగానే ప్రియాంకను 30 లోక్‌సభ సీట్లున్న తూర్పు యూపీ ఇన్‌చార్జిగా నియమించారని భావిస్తున్నారు. అనారోగ్యం వల్ల తల్లి సోనియా వచ్చే ఎన్నికల్లో పోటీచేయకపోతే రాయ్‌బరేలీలో ప్రియాంక రంగంలోకి దిగుతారని అంచనా వేస్తున్నారు. అమేథీ, రాయ్‌బరేలీకి ఆనుకుని ఉన్న సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, ఉన్నావ్ స్థానాల్లో ప్రియాంక ప్రచారం చేస్తే కాంగ్రెస్ విజయావకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
ఇందిరకు అసలైన వారసురాలు!
ఆహార్యంలోనే కాకుండా మాటతీరు, నడవడికలోనూ నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పోలి ఉండే ప్రియాంకనే ఆమెకు నిజమైన వారసురాలని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గ కార్యకర్తలతో ఎంతో సులువుగా మమేకమై, వారిని ఒక్కతాటిపైకి తేవడంలో ఆమె విజయవంతమయ్యారు. ప్రియాంకకు ఇందిరా గాంధీ పోలికలు ఉండటం పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. 1972, జనవరి 12న జన్మించిన ప్రియాంక గాంధీ ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీలో పాఠశాల విద్యను పూర్తిచేశారు. జీసస్ అండ్ మేరీ కాలేజీలో సైకాలజీలో డిగ్రీ పట్టా పొందారు. బౌద్ధధర్మంలో ఎంఏ పాసైన ఆమె బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది. 1997లో రాబర్ట్ వాద్రాను వివాహమాడారు. వారికి కొడుకు రేహాన్, కూతురు మిరాయా ఉన్నారు.
రాహుల్ వైఫల్యాన్ని అంగీకరించారు: బీజేపీ
ప్రియాంక గాంధీని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వ లోపాన్ని అంగీకరించిందని బీజేపీ వ్యాఖ్యానించింది. విపక్ష కూటమిలో పలు పార్టీల చేతిలో తిరస్కరణకు గురవడంతో రాహుల్ గాంధీ ‘కుటుంబ కూటమి’ని ఎంచుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబం నుంచే కాంగ్రెస్ మరొకరికి పట్టాభిషేకం చేయడం సహజమేనని, కాంగ్రెస్‌లో కుటుంబమే పార్టీ అని, కానీ బీజేపీలో పార్టీనే కుటుంబమని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర బూత్‌స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముచ్చటిస్తూ ప్రధాని మోదీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక కుటుంబం, వ్యక్తి కోరికల ఆధారంగా బీజేపీలో నిర్ణయాలు తీసుకోమని చెప్పారు.
మరింత పెద్ద బాధ్యతకు అర్హురాలు
ప్రియాంక స్థాయికి తూర్పు యూపీ ప్రధాన కార్య దర్శి పదవి తక్కువేనని కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఆమె మరింత విస్తృతమైన పాత్రకు అర్హురాలని పేర్కొన్నారు. ఈ నియామకం కాంగ్రెస్ దృక్కోణాన్ని తెలియజేస్తోందని, ఇది ఒక సోదరుడు(రాహుల్) సోదరిని పార్టీ పదవికి నియమించిన సందర్భమని వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ.. 2019 ఎన్నికల్లో ప్రియాంక గాంధీనే ప్రత్యేక ఆకర్షణ అవుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment