ఎఫ్‌పీఐల డార్లింగ్‌.. బీమా! | FPIs are bullish on the Indian insurance sector | Sakshi
Sakshi News home page

ఎఫ్‌పీఐల డార్లింగ్‌.. బీమా!

Nov 22 2019 4:58 AM | Updated on Nov 22 2019 5:58 AM

FPIs are bullish on the Indian insurance sector - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగంలో ఉన్న అపార అవకాశాలు విదేశీ ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐలు) బాగా ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది కాలంగా వారు ఈ రంగంలోని లిస్టెడ్‌ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో... అంటే ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య బీమా కంపెనీల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) నుంచి రికార్డు స్థాయిలో రూ.16,976 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.1,331 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే 13 రెట్లు అధికం. సాధారణంగా ఎఫ్‌పీఐలు దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేస్తుంటారు.

వీరు బీమా రంగ కంపెనీల్లో అదే పనిగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారంటే.. ఈ రంగంలోని వృద్ధి అవకాశాల పట్ల వారు ఎంతో బుల్లిష్‌గా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఈ ఏడాది ఏప్రిల్‌– ఆగస్ట్‌ మధ్య కాలంలో మన ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఈ కాలంలో వారు రూ.30,011 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. అయినా, ఇదే కాలంలో బీమా రంగ కంపెనీల్లో నికరంగా రూ.5,203 కోట్లను వారు ఇన్వెస్ట్‌ చేశారు. జీవిత, సాధారణ బీమా విభాగంలో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్‌ లిస్టయిన ప్రముఖ కంపెనీలు. వీటిల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్‌ ప్రభుత్వరంగ సంస్థ.

సెబీ నిబంధనలు అనుకూలం...  
‘‘గత 4–6 త్రైమాసికాలుగా ఎఫ్‌పీఐలు, దేశీయ ఇన్‌స్టిట్యూషన్లు బీమా కంపెనీల షేర్లను భారీగా కొంటున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ ముందస్తు కమీషన్ల చెల్లింపులను నిషేధిస్తూ సెబీ తెచ్చిన నిబంధనలు బీమా రంగ కంపెనీలకు అనుకూలంగా మారాయి’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ పరిశోధన విభాగం అధిపతి దీపక్‌ జసాని విశ్లేషించారు. అంటే బీమా కంపెనీల కమీషన్ల చెల్లింపులపై ఇటువంటి ఆంక్షలేమీ లేకపోవడం సానుకూలంగా మారింది. ముఖ్యంగా ఈ ఏడాది 10 నెలల కాలంలో ఎఫ్‌పీఐల ఈక్విటీ పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించినది బీమా రంగమే.

2019 జనవరి నుంచి అక్టోబర్‌ వరకు ఎఫ్‌పీఐలు రూ.24,714 కోట్లను వీటిల్లో ఇన్వెస్ట్‌ చేశారు. ఫలితంగా స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన ప్రైవేటు బీమా రంగ కంపెనీల్లో ఎఫ్‌ఫీఐల వాటా ఏడాది క్రితం ఉన్న 3 శాతం నుంచి అక్టోబర్‌ చివరికి 12 శాతానికి చేరుకుంది. ఎఫ్‌పీఐల పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించినది ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌. అందుకే ఏడాది క్రితం ఈ కంపెనీలో 4.45 శాతంగా ఉన్న ఎఫ్‌పీఐల వాటా ఏకంగా 23.72 శాతానికి పెరిగిపోయింది.

దీర్ఘకాలంలో భారీ అవకాశాలు
‘‘మారుతున్న జీవనశైలి పరిస్థితులు, అధిక రక్షణ అవసరమన్న అవగాహన విస్తృతం అవుతుండడం (ముఖ్యంగా యువతరంలో) బీమా కంపెనీలకు వ్యాపార అవకాశాలను పెంచుతోంది. ఫలితంగా వాటి మార్జిన్లు మెరుగుపడుతున్నాయి. బీమా రక్షణ అంతరం అత్యధికంగా మన దేశంలో 92 శాతంగా ఉంది. బీమా అన్నది దీర్ఘకాలానికి సంబంధించినది. ఈ రంగం వృద్ధి అవకాశాలు ఎఫ్‌పీఐలను ఆకర్షించాయి’’ అని ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేర్కొంది. మరోవైపు బీమా రంగ కంపెనీల రెండో త్రైమాసిక వ్యాపారంలో వృద్ధి స్వల్పంగానే నమోదైంది. ఏప్రిల్‌– సెప్టెంబర్‌ మధ్య ఆరునెలల కాలానికి చూస్తే మాత్రం నూతన వ్యాపార ప్రీమియంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఎస్‌బీఐ లైఫ్‌ నూతన వ్యాపార విలువలో 33 శాతం వృద్ధిని ఏప్రిల్‌ – సెప్టెంబర్‌ కాలంలో చూపించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ నూతన వ్యాపార విలువ ఇదే కాలంలో 20 శాతం పెరిగినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement