న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పార్టిసిపేటరీ(పీ) నోట్ల పెట్టుబడులు గత నెల(ఏప్రిల్)లో రూ. 95,911 కోట్లను తాకాయి. ఇది నాలుగు నెలల గరిష్టంకాగా.. గత రెండు నెలలుగా పీనోట్ల పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయి. ఇంతక్రితం 2022 నవంబర్‌లో పీనోట్ పెట్టుబడులు రూ. 96,292 కోట్లకు చేరాయి. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుండటం తాజా పెట్టుబడులకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(పీఎఫ్‌ఐలు) వీటిని జారీ చేస్తుంటారు. ప్రత్యక్షంగా రిజిస్టర్‌కాకుండానే దేశీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపే విదేశీ ఇన్వెస్టర్లకు వీటిని ఎఫ్‌పీఐలు జారీ చేసే సంగతి తెలిసిందే.
అయితే ఇందుకు తగిన పరిశీలన చేపట్టాక మాత్రమే వీటిని జారీ చేస్తారు. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం దేశీయంగా ఈక్విటీ, రుణ, హైబ్రిడ్ సెక్యూరిటీలలో పీనోట్ పెట్టుబడుల విలువ ఏప్రిల్ చివరికల్లా రూ. 95,911 కోట్లను తాకింది. మార్చి నెలాఖరుకు ఈ విలువ రూ. 88,600 కోట్లుగా నమోదైంది. ఇక ఫిబ్రవరికల్లా ఇవి రూ. 88,398 కోట్లుకాగా.. జనవరి చివరిలో రూ. 91,469 కోట్లకు చేరాయి. వెరసి మార్చిలో స్వల్పంగా పుంజుకోగా.. ఏప్రిల్‌లో భారీ వృద్ధి నమోదైంది. తాజాగా నమోదైన పెట్టుబడుల్లో రూ. 86,226 కోట్లు ఈక్విటీలలోకి ప్రవేశించాయి. ఈ బాటలో రూ. 9,586 కోట్లను రుణ పత్రాలలో ఇన్వెస్ట్ చేయగా, మరో రూ. 100 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీల కొనుగోలుకి విదేశీ ఇన్వెస్టర్లు వెచ్చించారు.
Comments
Please login to add a commentAdd a comment