విదేశీ ఇన్వెస్టర్ల ‘బీమా’ మోజు! | 6780 cr into insurance stocks | Sakshi
Sakshi News home page

విదేశీ ఇన్వెస్టర్ల ‘బీమా’ మోజు!

Published Thu, Apr 4 2019 5:43 AM | Last Updated on Thu, Apr 4 2019 5:43 AM

6780 cr into insurance stocks - Sakshi

న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు లిస్టెడ్‌ బీమా సంస్థల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రీమియం వసూళ్లలో బలమైన వృద్ధి చూపిస్తుండడం, అదే సమయంలో ఈ కంపెనీల షేర్ల విలువలు భవిష్యత్తు వృద్ధి అవకాశాల కోణంలో ఆకర్షణీయంగా కనిపిస్తుండడంతో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) బీమా కంపెనీల్లో మార్చి నెలలో ఏకంగా రూ.6,780 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేశారు. అందుబాటులో ఉన్న తాజా గణాంకాలను పరిశీలించినట్టయితే మార్చి నెలలో రంగాల వారీగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో బీమా రంగమే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. 2018 మార్చి తర్వాత ఒక నెలలో బీమా రంగంలోకి అధిక పెట్టుబడులు రావడం కూడా గత నెలలోనే.  

ప్రైమరీ, సెకండరీ మార్కెట్లలో డీల్స్‌
‘‘ఎఫ్‌పీఐల పెట్టుబడులను కంపెనీల మూలాలు, ధరల పనితీరు, మొత్తం మార్కెట్‌ పెట్టుబడుల కోణంలో చూడాల్సి ఉంటుంది. ఫండమెంటల్స్‌ పరంగా చూస్తే జీవిత బీమా, సాధారణ బీమా కంపెనీలు ఫిబ్రవరి నెల ప్రీమియం వసూళ్లలో బలమైన వృద్ధిని నమోదు చేశాయి’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో శిల్పా కుమార్‌ పేర్కొన్నారు. ఒకవైపు అధిక ఎఫ్‌పీఐల పెట్టుబడులకు తోడు బీమా రంగంలో ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో ఒప్పందాలు కూడా చోటు చేసుకోవడం గమనార్హం.

బ్రిటన్‌కు చెందిన ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్‌ తనకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉన్న వాటాల్లో 3.7 శాతాన్ని ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో విక్రయించింది. ఈ డీల్‌ విలువ రూ. 200 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,400 కోట్లు). అలాగే, దీనికి ముందు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో స్టాండర్డ్‌ లైఫ్‌ 4.93 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలోనే తగ్గించుకుంది. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో ఒకానొక భాగస్వామి బీఎన్‌పీ పారిబాస్‌ కార్డిఫ్‌ సైతం 5 శాతం మేర వాటాలను బ్లాక్‌ డీల్‌ ద్వారా రూ.3,000 కోట్లకు మార్చి నెలలో విక్రయించింది.  

వృద్ధి అవకాశాలు...
ఆర్థిక రంగంలో బీమా కూడా అధిక వృద్ధితో కూడిన రంగమని శిల్పా కుమార్‌ పేర్కొన్నారు. ‘‘ప్రైవేటు బీమా సంస్థలు వార్షికంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం పరంగా 20 శాతానికి పైగా వృద్ధిని సాధించాయి. అదే సాధారణబీమా సంస్థలు వార్షికంగా మొత్తం మీద 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి. వైద్య బీమా వ్యాపారం అయితే 40 శాతం మేర వృద్ధి చెందింది’’ అని ఆమె వివరించారు. బీమా రంగం పట్ల ఆసక్తి తిరిగి పుంజుకుందని, భౌగోళికంగా భిన్న ప్రాంతాల నుంచి... ఎఫ్‌పీఐలు, సావరీన్‌ వెల్త్‌ ఫండ్స్, ఆల్టర్నేటివ్‌ అస్సెట్‌ మేనేజర్స్, మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి భాగస్వామ్యం ఉన్నట్టు చెప్పారు.

నిజానికి దేశీ ఈక్విటీ మార్కెట్లలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ భాగం ఎఫ్‌పీఐలు అమ్మకాలు వైపు ఉండగా... ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈక్విటీల్లో నికరంగా రూ.51,200 కోట్లు, బాండ్ల మార్కెట్లలో నికరంగా రూ.5,964 కోట్ల పెట్టుబడులతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించడం విశేషం. అంతర్జాతీయంగా లిక్విడిటీ మెరుగుపడడం, స్థిరమైన వడ్డీ రేట్లు, అధికార పార్టీయే తిరిగి మళ్లీ విజయం సాధిస్తుందన్న అంచనాలు విదేశీ ఇన్వెస్టర్లలో భారత మార్కెట్ల పట్ల ఆశావహ పరిస్థితి కారణమని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ నవీన్‌ కులకర్ణి తెలిపారు. ‘‘అంతర్జాతీయ వృద్ధి నిదానించడం, అంతర్జాతీయంగా సెంట్రల్‌ బ్యాంకుల విధానాల్లో మార్పు రావడంతోపాటు అమెరికాలో రేట్ల పెంపు అవకాశాలు లేకపోవడమే... ఎఫ్‌పీఐలకు భారత్‌  ఏడారిలో ఒయాసిస్‌లా మారింది’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పీసీజీ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ స్ట్రాటజీ హెడ్‌ వీకే శర్మ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement