న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆస్ట్రేలియా కంపెనీలకు అపార అవకాశాలున్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా కంపెనీలకు ఆసక్తి అధికంగా ఉండే మైనింగ్, రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళీకరించామని, అందుకే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆయన ఆస్ట్రేలియా కంపెనీలను ఆహ్వానించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (సమగ్రమైన ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా) కోసం సంప్రదింపులు మరింత ముమ్మరం కాగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాకు మన ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవని, వీటిని మరింతగా పెంచుకోవలసి ఉందని వివరించారు. కాగా సెపా విషయమై పురోగతిని ఆకాంక్షిస్తున్నట్లు వెబినార్ ద్వారా ఆస్ట్రేలియా సెనేటర్ సైమన్ బ్రిమ్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రేలియాకు 290 కోట్ల డాలర్ల ఎగుమతులు, ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు 980 కోట్ల డాలర్ల దిగుమతులు జరిగాయని గోయల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment