వచ్చే ఎన్నికలలో తెలంగాణలో పోటీ కాంగ్రెస్, టీడీపీ మధ్యకన్నా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్యనే తీవ్రంగా ఉంటుంది. విలీనంపై టీఆర్‌ఎస్ వెనక్కిపోవడం సోనియాకు పెద్ద షాక్! సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కన్నా ఎంతో బలమైన పార్టీలకు నాయకత్వం వహిస్తున్న ములాయం, మాయావతి, లాలూలు కూడా సోనియాకు ఇంత దారుణంగా ద్రోహం చేయలేదు.
కేసీఆర్ అడ్డం తిరగడంతో కాంగ్రెస్ కంగుతింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇపుడు ఏం చేయనున్నారు? తెలంగాణలో దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయన్నది చాలా ఆసక్తికరం. తెలంగాణ ఇస్తే ఆ ప్రాంతంలో రాజకీయంగా లబ్ధిపొందవచ్చనీ, సీమాంధ్రలో పెద్దగా నష్టం ఉండదనీ సోనియా లెక్కలు వేశారు. ఈ దేశంలోని ఏ ప్రాంతంతోనూ, ఏ భాషతోనూ ఆమెకు సెంటిమెంటు లేదు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని రాజకీయంగా బోనులో ఇరికించేందుకు సోనియా తెలంగాణను ఒక తురుఫు ముక్కగా వాడుకున్నారు. తెలంగాణ ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతం నుంచి 17 మంది ఎంపీలను గెలిపించుకోవచ్చనీ, తద్వారా నరేంద్ర మోడీని నిలువరించవచ్చనీ ఆమె భావించారు. 2009 ఎన్నికలలో 206 మంది ఎంపీలు కాంగ్రెస్ టికెట్‌పై గెలిచినప్పటికీ ఈసారి కాంగ్రెస్ నుంచి కనీసం 150 మంది ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీ ఆటకట్టించినట్టవుతుందనీ, తమ కుటుంబపాలనకు ఎదురే ఉండదనీ సోనియా, ఆమె కోటరీ సభ్యుల ఆలోచన. అంతా ముందే రచించుకున్న వ్యూహం ప్రకారం జరిగింది.
గత ఏడాది జూలై 30న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని నిర్ణయించారు. దేశంలో కనీవినీ ఎరుగనిరీతిలో ప్రజావ్యతిరేకత పెల్లుబికినప్పటికీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపించింది. రాజ్యాంగంలోని రెండో అధికరణ ప్రకారం ప్రవేశపెట్టిన ఈ బిల్లును రాష్ట్ర శాసనసభ తిరస్కరించింది. అయినప్పటికీ రాజ్యాంగ నిబంధనలను తుంగలోతొక్కి, సంప్రదాయాలను బేఖాతరు చేసి కేంద్రప్రభుత్వం అత్యంత వివాదాస్పదరీతిలో ఈ బిల్లును పార్లమెంట్ ఉభయసభలలో ఆమోదింప చేసింది. సోనియా ఇంతకు తెగించడానికి ఒక కారణం ఉంది. తెలంగాణ ఇచ్చేస్తే ఒక పునాది ఏర్పరచుకోవచ్చనీ, దానిపై రాజకీయ భవనాన్ని నిర్మించుకోవచ్చనీ కలలుకన్నారు.
పెరుగుతున్న దూరం
తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత టీఆర్‌ఎస్ పాత నిబంధనలను గాలికొదిలింది. గతంలో బిహ రంగంగా ఇచ్చిన మాటను విస్మరించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. బిల్లు ఆమోదం పొందిన రోజునుంచీ నేటివరకూ చూస్తే పరిణామాలు అందరికీ తెలిసిందే. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ శత్రుపక్షాలుగా మారాయి. రెండు పక్షాల నేతలూ కత్తులు దూసుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య విలీనం ఉండదు, పొత్తూ ఉండదని తేలిపోయింది. మాటల తూటాలు పేలుతున్నాయి. రోజులు గడిచేకొద్దీ ఇవి ఇంకా పదును తేలుతాయి. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ మధ్యకన్నా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్యనే తీవ్రపోటీ ఉంటుంది. గత పదే ళ్లుగా అధికారంలో కొనసాగిన సోనియాకు ఇదొక పెద్ద షాక్! నిజానికి సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కన్నా ఎంతో బలమైన పార్టీలకు నాయకత్వం వహిస్తున్న జాతీయ నేతలు ములాయం సింగ్ యాదవ్, మాయావతి, లాలూ ప్రసాద్‌లు సైతం కూడా సోనియాకు ఇంత దారుణంగా ద్రోహం చేయలేదు. సోనియా ఎంతో శక్తిమంతురాలు. ఆమె తలచుకుంటే ఏ బిల్లు అయినా పాస్ కావాల్సిందే. ఉదాహరణకు రూ.1.50 లక్షల కోట్ల వ్యయమయ్యే ఆహార భద్రతా బిల్లును ఆమె పట్టుబట్టి మరీ ఆమోదింప చేసుకున్నారు. కాని తెలంగాణ బిల్లు ఆమోదం పొంది వారం తిరగకుండానే టీఆర్‌ఎస్ శత్రుపక్షంగా మారిపోవడం సోనియాకు చేదు అనుభవం.
ఇప్పుడు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అంచనా వేయాలి. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌కు పెద్దగా ఒరిగేది ఉండదని తెలిసికూడా కాంగ్రెస్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందా అని దేశ మంతా ఇపుడు విస్తుపోతోంది. కాని ఆమె అంచనాలు మరో విధంగా ఉండి ఉండవచ్చు. తెలంగాణ ఇవ్వడం ద్వారా ఆ ప్రాంత ప్రజల ఆదరణను ఓట్లరూపంలోకి మార్చుకోవచ్చని అంచనా వేశారు. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ 2 లేదా 3 సీట్లు మాత్రమే గెలిస్తే.... ఈ స్వల్ప రాజకీయ లబ్ధికే ఆంధ్రప్రదేశ్‌ను విభజించారా అని సీమాంధ్ర ప్రజలు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. సోనియాను ప్రజానాడిని పసిగట్టలేని నాయకురాలిగా జమకడతారు. ఆమె ప్రతిష్ట ఇంకా మసకబారుతుంది. అంతేకాదు తన రాజకీయ లక్ష్యాలను చేరుకునేందుకు ఆమె రాజకీయ వాస్తవాలను కూడా విస్మరిస్తారని కూడా ప్రజలు భావిస్తారు.
బీజేపీకి అవకాశమిచ్చిన కాంగ్రెస్
నరేంద్ర మోడీ దూకుడుకు పగ్గం వేయాలని భావిస్తున్న కాంగ్రెస్ తెలంగాణ నిర్ణయ రూపంలో బీజేపీకి ఒకవిధంగా మంచి అవకాశం ఇచ్చినట్టయ్యింది. కొన్ని నెలల క్రితం దాకా సీమాంధ్ర, తెలంగాణలో ఒక్క ఎంపీ కూడా గెలుస్తాడా అన్న అనుమానంలో ఉన్న కమలనాథులకు కొత్త ఊపిరి వచ్చింది. తెలంగాణలో బీజేపీ ప్రధానశక్తిగా ఆవిర్భవించడానికి కాంగ్రెస్ దారి చూపించింది. తాము ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధమేనని టీఆర్‌ఎస్ ప్రకటించినందున.... తెలంగాణ బిల్లును సమర్థించినందున పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ ముందుకు రావచ్చు. ఆ విధంగా సోనియా తన ప్రధాన ప్రత్యర్థి పార్టీ బీజేపీకి సహాయపడినట్టయ్యింది.
ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్‌కు పరాభవం ఎదురైతే అదంతా సోనియాకు చుట్టుకుంటుంది. ఇప్పటిదాకా తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఓడిపోతే వారి రాజకీయ జీవితానికి తెరపడుతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకునే తన ప్రతిష్టను కాపాడుకునేందుకు ఆమె ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించడం ద్వారా యూపీఏ ప్రభుత్వం స్వీయ తప్పిదానికి పాల్పడింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం వల్ల ఒనగూరే రాజకీయ ప్రయోజనాలను ఆమె చేజార్చుకున్నారు. రాష్ట్రపతి పాలన కన్నా ఎవరో ఒక సీఎం ఉంటే ఎన్నికల వేళ పాలకపక్షానికి కొంత అనుకూలత ఉంటుంది.
కేంద్ర మంత్రులు చిదంబరం, షిండే, కపిల్ సిబల్, జైరాం రమేశ్ వంటివారు పైకి ఎంతో తెలివైనవారుగా కనిపిస్తారు. మంచి వాగ్ధాటి కలవారు. వీరంతా ఏం చేస్తున్నారో ప్రతిపక్షానికి కూడా తెలుసు. కాంగ్రెస్‌కు సంబంధించినంతవరకు తెలంగాణ వైఫల్యం బయటపడ్డాక మన దేశాన్ని పాలిస్తున్న మంత్రులు ఏ పనిలోనూ సిద్ధహస్తులు కారని, మాటలు చెప్పడంలో మాత్రం ఆరితేరిన వారుగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ అసమర్థ మంత్రుల నిర్వాకం వల్ల దేశానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందోనని కూడా ఆందోళన చెందుతారు. ఒకవేళ సోనియాకు సరైన అవగాహన లేకపోతే ఆ రంగంలో తగిన పరిజ్ఞానం ఉన్న మంత్రులనూ, సలహాదారులనూ ఆమె ఎంపిక చేసుకోవాలి కదా. పనికిమాలిన సలహాను పాటించడం వల్లనే సోనియా ఇప్పుడు తెలంగాణ ఉత్పాతాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది! టీఆర్‌ఎస్ ఖాయంగా విలీనం అవుతుందని కాంగ్రెస్ నాయకులు ధీమాగా ఉన్నందున వారు ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా రూపొందించుకోలేదు. టీఆర్‌ఎస్ నేతల్ని కాంగ్రెస్ సాదాసీదా మనుషులుగా జమకట్టింది. ఇప్పటికి తెలిసి వచ్చి ఉంటుంది, ఎవరు సాదాసీదా నేతలో!
బీజేపీ వ్యూహాన్ని పసిగట్టలేని సోనియా
తెలంగాణ వ్యవహారంలో గత ఆర్నెల్లుగా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో సీమాంధ్ర ఉద్యమంలాంటి ఆందోళనను ఎన్నడూ చూడలేదని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ చెప్పడం విశేషం. విభజనను కమలనాథులు అడ్డుకుంటారని సీమాంధ్రులు ఆశలు పెట్టుకున్నారు. అది జరగలేదు. బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్య ఉన్న స్థూల అవగాహనను సోనియా అర్థం చేసుకోలేకపోయారు. కాంగ్రెస్‌లో విలీనాన్ని టీఆర్‌ఎస్ తిరస్కరించడం ద్వారా ఆ పార్టీ మునిగిపోయే పడవ అన్న సంకేతాన్ని దేశవ్యాప్తంగా పంపించింది.
నిజానికి కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుం దన్న నమ్మకం కేసీఆర్‌కు ఉంటే విలీనానికి ఒప్పుకుని ఉండేవారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎదురుతిరిగి రాజీనామా చేయడం కూడా కాంగ్రెస్‌కు చెడ్డపేరు తెచ్చింది. ఈ అస్తవ్యస్త పరిస్థితికి సోనియా ఎవర్ని నిందిస్తారు? మంత్రులు, నాయకులు ఈ నిందను సోనియాపైకే నెట్టేందుకు ప్రయత్నిస్తారు. నెపోలి యన్ చెప్పినట్టు విజయాన్ని పంచుకోడానికి అందరూ ముందుకు వస్తారుగాని అపజయం దగ్గరకు వచ్చేసరికి ముఖం చాటేస్తారు. తనకు తెలంగాణ ఇ వ్వడం వ్యక్తిగతంగా ఇష్టం లేదంటూ కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ ఇప్పటికే తన మనసులోని మాట బయటపెట్టారు. ఈ హడావిడి సద్దుమణిగాక చివరకు దీనికంతకూ సోనియా గాంధీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
- (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)
పెంటపాటి పుల్లారావు