అదిగదిగో..! డిసెంబర్‌ 30 | Pentapati Pulla rao writes one demonetisation | Sakshi
Sakshi News home page

అదిగదిగో..! డిసెంబర్‌ 30

Published Wed, Dec 21 2016 2:18 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

అదిగదిగో..! డిసెంబర్‌ 30

అదిగదిగో..! డిసెంబర్‌ 30

విశ్లేషణ
మోదీ చెప్పినట్టు డిసెంబర్‌ 30 నాటికి పరిస్థితులు మెరుగుపడకుంటే స్వపక్షం నుంచే ఆయన బెడదను ఎదుర్కొనక తప్పదు. దీని కోసమే సీనియర్‌లు కొందరు ఎదురుచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోకుంటే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో పార్టీకి ఎదురుదెబ్బ తప్పదు. దీనితో మోదీ వ్యతిరేక ప్రచారం ఊపందుకుంటుంది. నోట్ల రద్దు విఫలమైతే, నెపాన్ని ఇతరుల మీదకి నెట్టే అవకాశం కూడా మోదీకి లేదు. ఇదంతా తన స్వకపోల కల్పితమనీ, రహస్యంగా జరిగిందనీ ఇప్పటికే చెప్పారు.

అంతా సజావుగా, సంతోషంగా ఉన్నప్పుడే రాజకీయ జీవులంతా పదవుల నుంచి పక్కకి తప్పుకోకపోతే చివరికి మిగిలేది వైఫల్యమే. రాజకీయాల లక్షణమే కాదు, మనుషుల తత్వమే అంత అంటాడు ప్రఖ్యాత ఇంగ్లిష్‌ రాజకీయవేత్త ఇనాక్‌ పోవెల్‌. ప్రపంచంలో చాలామంది ప్రముఖ రాజకీయ వేత్తల మాదిరిగానే తన రాజకీయ జీవితానికి కూడా అదే రాసి పెట్టి ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీకి అర్థమయ్యే రోజు వస్తుంది. ఈ డిసెంబర్‌ 30 తేదీని మోదీ నిర్ణయాత్మక దినంగా నిర్దేశించారు. 15 లక్షల కోట్ల విలువ మేరకు ఉన్న రూ. 100, రూ. 1,000 నోట్లలో ఎన్ని బ్యాంకులకు చేరతాయో ఆరోజునే వెల్ల డవుతుందని మోదీ ఊహ.

అయితే అందులో చాలావరకు, రూ. 14 లక్షల కోట్లు ఇప్పటికే జమ అయినాయి. ఈ నెలాఖరుకు ఇంకొంత జమ అవు తుంది. అంటే లక్ష్యసాధనలో మోదీ విఫలమయ్యారు. ఇదిగో నల్లధనం అంటూ చెప్పడానికి ఏమీలేదు. మోదీ అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. నోట్ల రద్దు అనే కొరివితో తలగోక్కుని స్వయంకృతాపరాధానికి పాల్పడ్డారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాజకీయ జీవితం ఎంత విషాదాం తమైందో మోదీ గుర్తు చేసుకోవాలి. లేదంటే బ్రిటిష్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ రాజకీయ జీవితం బ్రిగ్జిట్‌తో ఎలా పతనమైందో తలుచుకోవాలి. ఐదేళ్ల కాల పరిమితి కోసం కామెరాన్‌ను ఆ దేశ ప్రజలు 2015లో ఎన్నుకున్నారు. కానీ యూరోపియన్‌ యూనియన్‌లో ఉండాలా వద్దా అనే అంశం మీద  మొన్న జూన్‌లో ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించి భంగపడ్డారు. రాజీనామా చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. నీ ప్రభ సమున్నతంగా వెలుగుతున్నప్పుడు పదవి నుంచి తప్పుకోవాలన్న పావెల్‌ మాటను ఆచరించేదెవరు?

అత్యాశ ఫలితం కాదా?
మోదీ మంచి పథకాలను ఆరంభించారు. స్వచ్ఛ భారత్, భారత సంతతి, భారతీయులు ఎక్కువగా ఉద్యోగాలు చేసుకుంటున్న దేశాలకు వెళ్లిరావడం, చైనాతో నిష్కర్షగా వ్యవహరించడం, జన్‌ధన్‌ ఖాతాలు, మరింత మెరుగైన పంటల బీమా అందులో కొన్ని. కానీ మోదీ అత్యాశకు పోయారు. ఏదో ఒకటి చేసి ప్రతిపక్షాన్ని వెనక్కినెట్టి, 2019 ఎన్నికలలో మళ్లీ తానే గెలవాలని ఆయన కోరిక. పైగా పార్లమెంట్‌కు బొత్తిగా కొత్త. అందుకే మన గొప్ప రాజకీయ వేత్తలు పీవీ, వాజ్‌పేయి, శరద్‌పవార్‌ల మాదిరిగా విమర్శను తట్టుకునే తత్వం లేదు. ఇది కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. చూడబోతే ఇందిరాగాంధీ లక్షణాలు మోదీలో చాలా ఉన్నట్టనిపిస్తుంది. నోట్ల రద్దు పథకం మొదటి దశ కూడా ముగిసింది. రద్దు అమలులోకి వచ్చిన తొలిరోజు నుంచి ప్రజలు పడిన పాట్లు వర్ణనాతీతం. ఆయన అనుకున్నదొకటి, అయినదొకటి అయింది. దీనితో ఆయన మండిపడుతున్నారు.

మోదీ మధ్య తరగతి, స్వయం ఉపాధి వృత్తి నిపుణులు, విద్యావం తులైన యువత ఓట్లతో పదవిలోకి వచ్చారు. ఆర్థిక అవకాశాలు మెరుగు పడతాయని ఈ ఓటర్లందరి ఆశ. కానీ ఇప్పుడు మోదీ సరిగ్గా ఈ వర్గాల వారినే వేధిస్తున్నారు. డిసెంబర్‌ 30 వరకు ఆయన మౌనం పాటించడం మంచిది. అలాగే మేధావుల నుంచి లభిస్తున్న గట్టి మద్దతు కూడా కోల్పోతు న్నారు. ఇలాంటివారు మోదీ నుంచి పెద్దగా ఆశించిందేమీ లేదు గానీ, కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ రాజకీయాలు అంతమైతే చాలునని భావించినవారే. మోదీ మద్దతుదారులుగా ముద్ర పడిన మధు కిష్వార్, తవ్లీన్‌సింగ్‌ వంటి వారు కూడా గడచిన కొన్ని వారాల నుంచి సోషల్‌ మీడియాలో ఆందోళన వ్యక్తం చేయడం కనిపిస్తున్నది. వీరు కూడా డిసెంబర్‌ 30 కోసం వేచి చూస్తు్తన్నారు.

ఇందిరను మరిపిస్తున్న మోదీ
బంగారం మీద నియంత్రణ పెట్టాలని గతంలో కూడా పలువురు ఆర్థిక మంత్రులు ప్రయత్నించిన సంగతిని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ విస్మరి స్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో పైకి కనిపిస్తున్న బంగారం 20,000 టన్నులు. ఇక రహస్యంగా ఉన్న పసిడి ఎన్ని టన్నులో తెలియదు. దీని గురించి ఎవరూ ఏమీ చేయలేరు. బంగారం గురించి ప్రభుత్వం ప్రజలను హెచ్చరించడం మానేస్తే మంచిది. నవంబర్‌ 8తో తానొక హీరోగా అవత రించానని మోదీ భావన. కానీ ఇప్పుడు ఆయన డిసెంబర్‌ 30 నాటి పతాక సన్నివేశం ఎలా ఉంటుందో అర్థంకాక మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికి తోడు ఇప్పటికీ సరిహద్దులలో భారత సైనికులను ఉగ్రవాదులు చంపుతూనే ఉన్నందున సర్జికల్‌ దాడులు విఫలమైనాయని చాలామంది భావన. వీటన్నిటితో మోదీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నోట్ల రద్దు తరువాత నల్లధనానికి కొమ్ము కాస్తున్నారంటూ మోదీ బీజేపీయేతర నాయకులను పార్లమెంట్‌ బయట దుమ్మెత్తి పోసి వ్యూహాత్మక తప్పిదం చేశారు.

ఇలా విపక్షాల మీద ధ్వజమెత్తిన ప్రధాని ఒక్క ఇందిర మాత్రమేనని చెప్పుకోవచ్చు. మోదీకి అధికారులు తప్పుడు సలహా ఇచ్చారు. ఒక్క వారంలోనే సమస్యకు సమాధానం చెప్పడానికి కావలసిన సొమ్ము ఉందని తప్పుతోవ పట్టించారు. కానీ మోదీ ప్రభుత్వం చేసిన తప్పు ఎంత పెద్దదో  దేశమంతా ఇప్పటికే గమనించింది. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన బీజేపీ నేతలు ప్రభుత్వ విధానాలతో ఏకీభవించనివారిని తూర్పార పడు తున్నారు. ఇది బీజేపీ ప్రతిష్టకీ, రాజకీయాలకీ మంచిది కాదు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రఖ్యాత ఆర్థికవేత్తలు నోట్ల రద్దు వ్యవహారం మీద పెదవి విరుస్తున్నారు. కానీ పరిస్థితులను చక్కబరచడానికి బదులు మోదీ మండిపాటును ప్రదర్శిస్తున్నారు. ప్రజలలో అంతగా పట్టులేని పీయూష్‌ గోయెల్‌ వంటివారే వెన్నుదన్నుగా ఉన్నారు. బీజేపీ సీనియర్లలో ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు. వీరు కూడా డిసెంబర్‌ 30 పరిణామాల కోసమే వేచి చూస్తున్నారు. అంటే మోదీ విపక్షంతో బాహాటంగాను, స్వపక్షంతో గుంభనం గాను పోరాడుతున్నారు. రద్దు నిర్ణయం ఆర్థికమంత్రి జైట్లీకి కూడా నవంబర్‌ 8 మధ్యాహ్నం రెండు గంటలకు మాత్రమే చెప్పారు. ఇదంతా చూస్తే  అతి విశ్వాసంతో, ఆఖరికి తండ్రికి కూడా తెలియకుండా శత్రు సమూహాల మధ్యకు చొచ్చుకుపోయిన అభిమన్యుడి చర్యను గుర్తుకు తెస్తున్నది.

నవ భారతం ఆవిష్కృతమయ్యేనా?
డిసెంబర్‌ 30 నాటికి బ్యాంకులలో పూర్తిస్థాయిలో ధనం జమ కాదని మోదీ తలిచారు. అది తప్పని తేలడంతో నగదు రహితం పాట అందుకున్నారు. డిసెంబర్‌ 30 నాటికి నవ భారతం ఆవిష్కృతమవుతుందని ఆర్భాటంగా ప్రక టించారు. కానీ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులలోకి ప్రయాణిస్తున్నది. కోట్లాది ఉద్యోగాలు పోయాయి. వ్యవసాయం, రిటైల్‌ రంగాలలో ఉద్యోగావకాశాలు హరించుకుపోయాయి. వర్తక వాణిజ్యాలు తగ్గుముఖం పట్టాయి. జన్‌ధన్‌ ఖాతాలలో పెద్ద ఎత్తున ధనం జమ చేస్తారని అంతా భావించారు. ఆ చర్యతో పేదలను తృప్తి పరచగలనని మోదీ కూడా భావించారు. ఈ విష యంలో ఆయన అచ్చం ఇందిరాగాంధీలాగే మాట్లాడారు. అయితే జన్‌ధన్‌ ఖాతాలలో ఏమీ జమ చేయలేరన్న విషయం ఇప్పుడు ఆ ఆశ పెట్టు కున్నవారిని తీవ్ర నిస్పృహకు గురి చేస్తున్నది. నల్లధనంపై ఇతర మార్గాల ద్వారా కూడా వేట సాగిస్తామని మోదీ చెప్పారు.

అంటే రియల్‌ ఎస్టేట్, అవినీతి ఉద్యోగుల భరతం పడతారని అంతా ఆశించారు. కొందరు నిజా యితీ కలిగిన అధికారులు ఉన్నమాట కాదనలేం. కానీ అవినీతి పరుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బు పోగుపడింది. ఇప్పుడు వీరిని కూడా ఏమీ చేయలేని పరి స్థితి. ఎందుకంటే వీరి నల్లధనం ఏనాడో ఇతర రూపాలలోకి మారిపోయింది. మోదీ చెప్పినట్టు డిసెంబర్‌ 30 నాటికి పరిస్థితులు మెరుగు పడకుంటే స్వపక్షం నుంచే ఆయన బెడదను ఎదుర్కొనకతప్పదు. దీని కోసమే సీని యర్‌లు కొందరు ఎదురుచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోకుంటే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో పార్టీకి ఎదురుదెబ్బ తప్పదు. దీనితో మోదీ వ్యతిరేక ప్రచారం ఊపందుకుంటుంది. నోట్ల రద్దు విఫలమైతే, నెపాన్ని ఇతరుల మీదకి నెట్టే అవకాశం కూడా మోదీకి లేదు. ఇదంతా తన స్వకపోల కల్పితమనీ, రహస్యంగా జరిగిందనీ ఇప్పటికే చెప్పారు. అదే ఆయన మెడకు గుదిబండగా పరిణమించింది. మోదీ ఆత్మ స్థయిర్యం కోల్పోయిన సంగతి హావభావాలలో, కదలికలలో స్పష్టమవుతున్నది కూడా.

సంపూర్ణాధికారం కాదు
ప్రజలు ఒక ప్రధానిని లేదా ముఖ్యమంత్రిని ఐదేళ్ల కోసం ఎన్నుకున్నారంటే దానర్థం, ఆ కాలంలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరించవచ్చునని కాదు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతిపక్షాలు వ్యతిరేకించి ఉండవచ్చు. అయితే విపక్షం కూడా మౌనం దాల్చింది. ఒకవేళ నోట్ల రద్దును విమర్శిస్తే ప్రజలు నల్లధనానికి మద్దతు ఇస్తున్నవారిగా భావిస్తారేమోనని వారి బెంగ. హాస్యాస్పదమైన మరో సంగతి–ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ఎదుట ఆనం దంగానే నిలబడుతున్నారనీ, ఈ చర్య పట్ల ఆగ్రహంగా లేరని ప్రభుత్వం చెబుతోంది. ఒకటి వాస్తవం–తాము ఆగ్రహిస్తే పోలీసులు వచ్చి లాక్కుపోతా రనీ, అంతకంటే డబ్బు చేతికి వచ్చేదాకా సహనంతో ఉండడమే మంచిదని ప్రజలు భావిస్తున్నారు. మోదీ ప్రహసనం గురించి ఎంతైనా రాయవచ్చు. కానీ ఆరోగ్యకరమైన ఒక దేశాన్ని, ఎలాంటి రోగ లక్షణం లేకుండా హఠాత్తుగా ఐసీయూ పాల్జేశారు. దేవుడా; రక్షించు నాదేశాన్ని.

- పెంటపాటి పుల్లారావు
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
ఈ–మెయిల్‌ : drppullarao@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement