'పాత నోట్లుంటే జైలు'పై కేంద్రం కొత్త మాట
న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్లపై కేంద్ర ప్రభుత్వం మరో కుప్పిగంతు వేసింది. 'శుక్రవారం(డిసెంబర్ 30) తర్వాత పాత నోట్లు కలిగి ఉన్నవారికి కనీసం రూ.10వేల జరిమానా విధిస్తాం. జైలు శిక్షలు ఉండవు'అని ఆర్థిక శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, పాతనోట్ల డిపాజిట్‌కు మార్చి 31 వరకూ గడువు పొడిగించిన దరిమిలా నేటి ప్రకటన(డిసెంబర్ 30 తర్వాత జరిమానాలు) అసంబద్ధంగా ఉండటం గమనార్హం.
బుధవారం నాటి కేబినేట్ భేటీలో.. మార్చి 31 తర్వాత రద్దయిన నోట్లు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రూపొందించిన ఆర్డినెన్స్ కు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్లను కలిగి ఉండటం నేరంగా పరిగణించడం డిసెంబర్ 30 తర్వాతా లేదా మార్చి 31 తర్వాతా అనే దానిపై బుధవారం నాటి కేబినెట్ భేటీలో స్పష్టత రాకపోవడంతో ఇవ్వాళ ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేశారు. (చదవండి: పాత నోట్లుంటే జైలే!)
ఆ ఆర్డినెన్స్ ప్రకారం రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్ష విధించదగ్గ నేరంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారు. మార్చి 31 తర్వాత రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లు పెద్ద మొత్తంలో కలిగి ఉండటాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అలాగే జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య పాత నోట్లను డిపాజిట్ చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని సమర్పించిన వారికి రూ.5 వేలు లేదా సంబంధిత మొత్తానికి ఐదు రెట్లు జరిమానా విధిస్తారు.