గాడిలో పడిన మోడీ సర్కార్
కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందన్న భరోసాను, సమస్యలకు పరిష్కారాలు కనుగొంటుందన్న విశ్వాసాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు కలిగించగలిగారు. అయితే ఏ ప్రభుత్వమూ అన్ని సమస్యలనూ పరిష్కరించలేదు. ప్రజలు ఆర్థిక విషయాలపై పెట్టుకున్న అంచనాలను తీర్చలేకపోవచ్చు.
ప్రధానిగా నరేంద్ర మోడీ పరిపాలనలో మొదటి నెల పూర్తి చేసుకున్నారు. అమెరికాతో సహా అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ ఆయన ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. ఈ దేశానికి మోడీ ప్రధాని కాకపోవచ్చన్న అంచనాతో కాబోలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వీసా మంజూరు చేసేందుకు అమెరికా నిరాకరించింది కూడా! ఒక నెల అన్నది చాలా తక్కువ వ్యవధే అయినప్పటికీ ఒక ప్రభుత్వాధినేత పాలనాశైలిని అధ్యయనం చేయడానికి ఈ సమయం తగిన సంకేతాలు అందిస్తుంది. 2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తిరుగులేని విధంగా ఒక పార్టీకి అఖండ మెజారిటీని కట్టబెడతారని ఎవరూ ఊహించలేదు. త్రిశంకుసభ ఏర్పడుతుందనీ, ప్రాంతీయ పార్టీలు ప్రధానపాత్ర పోషిస్తాయనీ రాజకీయ పండితులు వేసిన అంచనాలన్నీ తప్పాయి. జయలలిత, మమతా బెన ర్జీ బ్రహ్మాండమైన విజయాలు సాధించినా కేంద్రంలో ఎలాంటి పాత్ర పోషించేందుకు అవకాశం లేకుండా పోయింది.
అధికారంలోకి వస్తూనే తొలి వంద రోజుల్లోనే తమ సత్తాను చాటేందుకు మోడీ సర్కార్ కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ఫలితాల కోసం ప్రజలు ఐదేళ్లపాటు నిరీక్షించేందుకు సిద్ధంగా లేరని ప్రభుత్వం గ్రహించింది. తన ప్రమాణస్వీకారోత్సవానికి సార్క్ దేశాల ప్రభుత్వాధినేతలను ఆహ్వానించడం ద్వారా నరేంద్ర మోడీ అందర్నీ ఆశ్చర్యపరిచారు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా దీన్ని ప్రశంసించారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించడంపై తమిళ పార్టీలు రాద్ధాంతం సృష్టించినా మోడీ వెనుకడుగు వేయలేదు. విదేశీ వ్యవహారాలలో స్థానిక రాజకీయాలకు ఎలాంటి పాత్ర ఉండదని తన చేతల ద్వారా రుజువు చేశారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువస్తామని ప్రభుత్వం పదేపదే చెపుతోంది. ఇరాక్‌లో ప్రారంభమైన అంతర్యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నాయి. రైల్వే, ఇతర ధరలు పెంపుదల బట్టి ఈ సర్కారు ధరలను నియంత్రించలేకపోతోందని అనిపిస్తోంది. ఒకవేళ ప్రధాని తప్పుడు సలహాలు స్వీకరిస్తే ఆయన ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. ఇప్పుడు చమురు ధరలు దిగివస్తే ఆర్థిక మంత్రి ద్రవ్యలోటుకు కోతపెడతారు. అప్పుడు ప్రధానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్నా దానికి తగ్గ ప్రయోజనాలు కనిపించాలి. రైల్వే ప్రయాణ చార్జీలు పెంచితే ప్రయాణికులకు భద్రత, ఇతరత్రా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. కానీ అది జరగడం లేదు.
హేమాహేమీలు అవసరమే
ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి కురువృద్ధులను పక్కన పెట్టడం మంచి నిర్ణయమే. అయితే ప్రభుత్వంలో రాజకీయంగా హేమాహేమీలు అనదగ్గ నాయకులు ఉండాలి. ఇపుడు ప్రభుత్వ భారమంతా మోడీపైనే ఆధారపడి ఉంది. పీవీ నరసింహారావు కేబినెట్‌లో ఏకంగా 12 మంది మాజీ సీఎంలు ఉండేవారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కూడా 8 మందిదాకా మాజీ సీఎంలు ఉండేవారు. మోడీ టీమ్‌లో ఆయన తప్ప అలాంటి వారు ఎవ్వరూ లేరు. ప్రభుత్వానికి హుందాతనం రావాలంటే అలాంటి హేమాహేమీల అవసరం ఎంతైనా ఉంది. మీడియా అధికార ప్రతినిధులందర్నీ కేబినెట్‌లో చేర్చుకోవడం వల్ల లాభం లేదు. యూపీఏ సర్కారులో పెద్దగా నోరుపారేసుకుని మాట్లాడే జైరామ్ రమేశ్ లాంటి ఒక మంత్రి ఉంటే చాలు.
రాజ్యాంగ పదవుల్లో ఉన్న గవర్నర్లను, ఇతరులను తొలగించే విషయంలో ఎన్‌డీఏ సర్కారు కొంత సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎన్నికల ముందు... మార్చిలోగా కాంగ్రెస్ పార్టీ అనేక పోస్టులలో తమకిష్టులైన వారిని బాహాటంగా నియమించింది. అలాంటి వారిని తొలగించాల్సిందే. కొంతమంది ‘మంచి’ గవర్నర్లతో ప్రభుత్వం నేరుగా మాట్లాడి వారిని పదవుల్లో కొనసాగనివ్వాలి. అదేవిధంగా వివిధ కమిషన్ల అధ్యక్ష, సభ్యుల తొలగింపు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనర్హులైన వారిని తొలగించడంలో తప్పులేదు. అయితే ప్రభుత్వం చేసే నిర్ణయం కీలకమైనది. ఈ కమిషన్లలో కొనసాగుతున్న వారంతా చెడ్డవారని భావించనక్కర్లేదు.
భజనపరులతో జాగ్రత్త
నరేంద్ర మోడీకి పారిశ్రామిక వర్గంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ప్రచారం చేశాయి. కాని దానిలో తప్పేముంది? అయితే పరిశ్రమ వర్గాల బెదిరింపులకు తాను లొంగిపోతున్నట్టుగా అభిప్రాయం కలగకుండా ప్రధాని జాగ్రత్తపడాలి. అంతేకాదు భజనపరులను చేరదీయరాదు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి... దివంగత బీజేపీ సీనియర్ నేత ప్రమోద్ మహాజన్, ఇతర నాయకుల మాటలు విని 2004 ఎన్నికలలో దెబ్బతిన్నారు. వారి మాటలు విని ఏజీపీ, డీఎంకేలను దూరం చేసుకున్నారు. ఎప్పుడైతే అధికారం వచ్చిందో భజనపరులు చుట్టూ చేరతారు. వారిని ఒక కంట కనిపెట్టాలి. లేకపోతే మోడీ కష్టాల్లో ఇరుక్కుంటారు.
లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఒక పార్టీగా అద్భుతమైన విజయం సాధించినా, మోడీ లేకుండా అది అసాధ్యమని చెప్పాలి. ఒకవేళ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ లేదా రాజ్‌నాథ్‌లను ప్రకటించి ఉంటే ఎంతమంది ప్రజలు బీజేపీకి ఓటు వేసి ఉండేవారు? ప్రజలను పట్టించుకోకుండా బీజేపీ క్యాడర్‌కు మరీ అధిక ప్రాధాన్యమివ్వడం మోడీ ఇక మానుకోవాలి. బీజేపీ వల్లే విజయం సిద్ధించిందని చెపితే 2004, 2009 ఎన్నికలలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి పట్టిన గతే పడుతుంది. పార్టీ క్యాడర్‌కు తప్పకుండా ప్రాధాన్యమివ్వాల్సిందే. అయితే పార్టీ క్యాడర్ మరీ అంత పటిష్టంగా ఉంటే 2004, 2009 ఎన్నికలలో టీడీపీ ఎందుకు ఓడిపోయింది? అప్పటి క్యాడరే ఇప్పుడూ ఆ పార్టీకి ఉంది కదా.
పాదుకున్న విశ్వాసం
కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడం ప్రారంభిస్తుందన్న భరోసాను, సమస్యలకు పరిష్కారాలు కనుగొంటుందన్న విశ్వాసాన్ని మోడీ ప్రజలకు కలిగించారు. అయితే ఏ ప్రభుత్వమూ అన్ని సమస్యలనూ పరిష్కరించలేదు. ప్రజలు ఆర్థిక విషయాలపై పెట్టుకున్న అంచనాలను తీర్చలేకపోవచ్చు. గల్ఫ్ దేశాలలో ఉన్న సహజ వనరులు భారత్‌కు లేవు. సమస్యల పరిష్కారం దిశగా అడుగుపడితే, అవినీతిని పెకిలించివేసేందుకు చర్యలు ప్రారంభమైతే, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం ప్రారంభిస్తే ప్రజలు కొంతవరకు సంతృప్తి చెందుతారు. దేశీయంగా, అంతర్జాతీయంగా అనూహ్యంగా తలెత్తే పరిణామాలకు, వాటి సవాళ్లను ఎదుర్కొనేందుకు మోడీ అప్రమత్తంగా ఉండాలి. అది యుద్ధం, విపత్తు, రాజకీయ తప్పిదం... ఏదైనా కావచ్చు. చిన్న సమస్య భారీ సంక్షోభానికి దారి తీస్తుంది. ఈ సవాళ్లే నిత్యకృత్యమవుతాయి. ప్రధానిగా మోడీ ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నారు. ఒక్క నెలలోనే కచ్చితంగా పలువురిని ఆశ్చర్యపరిచారు!
(వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)
పెంటపాటి పుల్లారావు