కమలానికి ‘చేతి’ చలువ!
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కొత్త శత్రువులను సృష్టించుకుంది. ఇప్పుడు ఆ పార్టీ టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, బీజేపీలతోపాటు టీఆర్‌ఎస్‌తో కూడా పోరాడాల్సి ఉంటుంది. ఇది బీజేపీకి వరంగా మారుతుంది. కోస్తాలో కూడా ప్రజలు బీజేపీ కన్నా కాంగ్రెస్‌నే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని ద్వారా కాంగ్రెస్ బీజేపీకి ఊహించని రాజకీయ బహుమతి ఇచ్చింది.
బీజేపీకి 2014 సార్వత్రిక ఎన్నికలలో కనీసం 225 సీట్లు వస్తాయని ఏడాది క్రితం ఎవరైనా అంచనా వేసి ఉంటే వారిని చూసి నవ్వుకునేవారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ఆ పార్టీ వచ్చే ఎన్నికలలో 225 స్థానాలు గెలుచుకునే స్థాయికి చేరుకుందని అనిపిస్తోంది. లోక్‌సభలో మొత్తం 543 సీట్లకుగాను బీజేపీ సొంతంగా 200 స్థానాలలో విజయం సాధిస్తేగానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని విశ్లేషకులు చెపుతుండేవారు. అంతేకాదు, బీజేపీకి మిత్రపక్షాలు దొరకడం కూడా చాలా కష్టమని అనేవారు. కమలనాథులు ఈ అవరోధాన్ని కూడా అధిగమించారు.
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును పార్టీలో కొంతమంది ప్రతిపాదించినప్పుడు అంతర్గతంగా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా తమకన్నా జూనియర్ తమను దాటిపోవడం ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్ వంటి అగ్రనేతలు ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోయారు. మోడీ సభలకు జనాలు విరగబడి వస్తుంటే అద్వానీ, సుష్మాస్వరాజ్ మీటింగ్‌లు వెలవెలబోయేవి. వీరిద్దరూ పాతతరానికి ప్రతినిధులుగా మిగిలారు. ఈ సవాళ్లను మోడీ ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు. ఇప్పుడు పార్టీలో ఆయన కత్తికి ఎదురేలేదు.
రాహుల్‌ది ‘సైడ్‌రోల్’
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ఆయన ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా భారీ పబ్లిసిటీ సరంజామాతో ఏఐసీసీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారానికి కాంగ్రెస్ ఎంతో ఖర్చు చేసింది. దీనిలో రాహుల్ అనేక ‘అవతారాలలో’ ఓటర్లకు దర్శనమిస్తారు. మోడీ బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థి కాబట్టి ఆయన రాహుల్ శక్తియుక్తుల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రాహుల్ ఎక్కడా పత్తా లేకుండా పోయారు. నిజానికి ఈ ఎన్నికల్లో ఆయన ప్రధాన పాత్ర కాకుండా ‘సైడ్‌రోల్’ను పోషిస్తున్నారు. రాహుల్ టీవీలో మాత్రమే కనిపిస్తున్నారు. జనాలు రావడం లేదు కాబట్టి ఆయన కోసం బహిరంగ సభలు ఏర్పాటు చేయడం లేదు. వాస్తవానికి మోడీని ఎదుర్కొనలేక రాహుల్ చతికిలబడ్డారు.
మోడీపై కాంగ్రెస్ చేసిన దుర్మార్గపూరిత ఆరోపణలలో నిజం ఎంత ఉందో తెలియదు కాని వాటి నుంచి ఆయన బయటపడ్డారు. హస్తినలో అధికారాన్ని కైవసం చేసుకునే రేసులో బీజేపీ... కాంగ్రెస్ కన్నా ముందంజలో ఉంది. యుద్ధంలో విజయం సాధించాలంటే కాలం కలిసొచ్చే సైన్యాధికారులు ఉండాలని నెపోలియన్ చెప్పాడు. బీజేపీలో కూడా ఇపుడు అనేకమంది అదృష్టవంతులైన ‘జనరల్స్’ ఉన్నారు. వారి వల్లనే ఆ పార్టీ ఎన్నికల సంగ్రామంలో ముందుకు దూసుకుపోతోంది.
గత నాలుగేళ్లుగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోని అనేక స్కామ్‌లను మీడియా ఎండగట్టింది. మోడీపై వచ్చిన ఆరోపణలు ప్రజల దృష్టిలో చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కాని యూపీఏ హయాంలో ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన అవినీతి స్కామ్‌లలో కొన్ని వేలకోట్ల రూపాయల దాకా అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. వీటితో ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత మరింత తీవ్రతరమై అది బీజేపీకి అయాచిత వరమవుతుంది.
కొత్త ‘సెక్యులర్’ శక్తులతో పొత్తులు
గుజరాత్ అల్లర్లకు నిరసనగా గతంలో ఎన్‌డీఏకు గుడ్‌బై చెప్పిన ఎల్‌జేపీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ మళ్లీ ఆగూటికే చేరారు. మోడీ ‘అమాయకుడని’ కోర్టులు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించాయని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు పనిలోపనిగా మోడీని ప్రధానిని చేసేదాకా నిద్రపోనని కూడా శపథం చేశారు. ప్రస్తుత బీహార్ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పాశ్వాన్ రాజకీయ అవసరాలు అలాంటివి. ఏదిఏమైనా ఇది మోడీకి ఊహించని వరమే. ధరల పెరుగుదలను ప్రజలు ఎంతమాత్రం ఇష్టపడరు. ఎందుకంటే అది వారి జేబుకు చిల్లుపెడుతుంది. కానీ గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ విషయంలో ఎంతమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. ఎన్నికల వేళ తాయిలాలు ఇస్తే అవినీతి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి విషయాలను ప్రజలు పెద్దగా పట్టించుకోరన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం కాబోలు.
ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే తెలంగాణలో 16 ఎంపీ సీట్లు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేసింది. సీట్లు మాట దేవుడెరుగు, కొత్త శత్రువులను సృష్టించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లతో పాటు టీఆర్‌ఎస్‌తో కూడా పోరాడాల్సి ఉంటుంది. ఈ విభజన ఒకరకంగా బీజేపీకి వరంగా మారింది. అదేవిధంగా కోస్తాలో కూడా ప్రజలు బీజేపీ కన్నా కాంగ్రెస్‌పట్ల తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నారు. విభజన ద్వారా కాంగ్రెస్‌పార్టీ బీజేపీకి ఊహించని రాజకీయ బహుమతి ఇచ్చింది. కాంగ్రెస్ స్వయంకృతాపరాధాలకుతోడు, బీజేపీకి కలిసివచ్చిన అదృష్టంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కమలనాథులు మరింత చేరువకాగలిగారు. ప్రస్తుతం వెలువడిన పోల్స్ అంచనాలు పూర్తిగా వాస్తవం కాకపోవచ్చుగానీ, ఎన్నికలు జరగడానికి ఇంకా 60 రోజుల వ్యవధి ఉంది. ఈలోగా అనేక మార్పులు జరగవచ్చు కూడా.
‘ఆప్’ నుంచి ముప్పు
బీజేపీకి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో గట్టి పట్టు ఉంది. కాని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ఈ వర్గాల ఓట్లపైనే ఆశలు పెట్టుకుంది. ఒకవేళ ఆప్ రంగంలో లేకుంటే ఈ ఓట్లన్నీ బీజేపీకే పడతాయి. కొత్తగా ఆప్ రావడం వల్ల బీజేపీ ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. ఇటీ వలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయాన్ని అడ్డుకున్నది ఆప్ అన్నది మర్చిపోకూడదు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి 15 కన్నా అధికంగా ఎంపీ సీట్లు వస్తాయని ఎవరూ భావించడం లేదు. కాని ‘ఆప్’ బీజేపీకి రావల్సిన సీట్లకే గండికొడుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.
సార్వత్రిక ఎన్నికలలో ముస్లింలు వ్యూహాత్మకంగా ఓట్లు వేస్తారు. మతతత్వ శక్తులను ఓడించే పార్టీలనే వారు బలపరుస్తారు. బీజేపీని ఆప్ గట్టిగా వ్యతిరేకిస్తోంది కాబట్టి ‘ఆప్’ వారికి అస్త్రంగా ఉపయోగపడనున్నది. బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్న కేజ్రీవాల్‌నూ, కాంగ్రెస్‌తో సమానంగా బీజేపీ కూడా అవినీతి పార్టీయేనని పేర్కొంటున్న ఆప్‌ను ముస్లింలు బాగా ఇష్టపడతారు. మోడీని ఎదుర్కొనే సత్తా కేజ్రీవాల్‌కు ఉందని వారు విశ్వసిస్తున్నారు.
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆశలను కాంగ్రెస్ దాదాపుగా వదులుకుంది. అయితే అదే సమయంలో తన ఆగర్భశత్రువు మోడీ ప్రధాని కాకుండా చూసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతుంది. జయలలిత నుంచి ములాయం వరకు, మమత నుంచి శరద్ పవార్ వరకు ఎవరు ప్రధాని అయినా కాంగ్రెస్‌కు పెద్ద ఇబ్బంది లేదు. ప్రాంతీయ పార్టీల నుంచి తగిన సంఖ్యలో ఎంపీలు గెలిస్తే బీజేపీకి మెజారిటీ దక్కదని కాంగ్రెస్ నాయకత్వం ఆశాభావంతో ఉంది. చరిత్ర పునరావృతమవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కాంగ్రెస్ అభ్యంతరం పెట్టదు. గతంలో మాదిరిగా అస్థిర ప్రభుత్వాలు ఏర్పడి గందరగోళ పరిస్థితులు తలెత్తేదాకా ఓపిగ్గా వేచి ఉండి తర్వాత అవి కుప్పకూలినప్పుడు తమ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆ సమయంలో మళ్లీ ప్రజల వద్దకు వెళ్లాలన్న ఆలోచన కాంగ్రెస్ నేతల మనసులో ఉంది. ప్రస్తుతానికి బీజేపీకి అనుకూల గాలి వీస్తోంది. ఇంతవరకు మోడీకి అదృష్టం కలిసి వచ్చింది. కాని అదృష్టంపై మరీ ఎక్కువ ఆధారపడకూడదు.
(వ్యాసరచయిత రాజకీయ విశ్లేషకులు)
పెంటపాటి పుల్లారావు