రాజకీయాలకు ‘నితీశ్‌’ కుదుపు | pentapati pulla rao political conter on nitish | Sakshi
Sakshi News home page

రాజకీయాలకు ‘నితీశ్‌’ కుదుపు

Published Fri, Aug 4 2017 1:00 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

రాజకీయాలకు ‘నితీశ్‌’ కుదుపు - Sakshi

రాజకీయాలకు ‘నితీశ్‌’ కుదుపు

విశ్లేషణ
నితీశ్‌ నిష్క్రమణతో బీజేపీ వ్యతిరేక ప్రతిపక్షాలన్నిటి మహాకూటమి అనే తర్కం ఇక పని చేయదు. 2019లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక తప్పదని అనుకున్నాక, ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఓడిపోయే పక్షంలో ఉండాలని ఎందుకు కోరుకుంటుంది? వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మోదీ, షాలు రాజకీయంగా సాధ్యమైన ప్రతిదాన్నీ సాధించారు. కాక పోతే రైతు సమస్యలు, నిరుద్యోగం కలసి 2018 నాటికి ఒక్కసారిగా జాతీయస్థాయిలో బద్దలు కాకుండటానికి  హామీని కల్పించాలి. ముఖ్యంగా సుపరిపాలనపై దృష్టిని కేంద్రీకరించాలి.

చైనా యుద్ధ నిపుణుడు సున్‌ జూ 2,500 ఏళ్ల క్రితం ‘‘శత్రువును మభ్యపెట్టు, తప్పుదారి పట్టించు, ఆశ్చర్యపరచు’’ అని బోధించాడు. నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు సున్‌ జూ, చాణక్యుల రచనలు చదివారో లేదో తెలియదు. కానీ, వారు సున్‌ జూ ఎత్తుగడలను కచ్చితంగా అమలు చేస్తున్నట్టు అని పిస్తోంది. అనూహ్యమైన రీతిలో నితీశ్‌ కుమార్, బీజేపీల కూటమిని ఏర్పాటు చేసి అమిత్‌ షా హఠాత్తుగా భారత రాజకీయ చిత్రాన్నే మార్చి పారేశారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ మహాఘట్‌బంధన్‌గా ఏకతాటిపైకి తేవాలని కాంగ్రెస్‌ పార్టీ గత ఏడాది కాలంగా పథకాలు వేస్తోంది. ఆ మహా కూటమి ఇప్పుడు అదృశ్యమైపోయింది. అమిత్‌ షా, సున్‌ జూ రాసిన ‘యుద్ధ కళ’లోని ఎత్తుగడను తు. చ. తప్పక అనుసరిస్తుండగా, కాంగ్రెస్, రాహుల్‌ గాంధీ అందుకు సరిగ్గా విరుద్ధంగా ప్రవర్తిసున్నారు. ‘‘నితీశ్‌ కుమార్‌ పారిపోతాడని నాకు నాలుగు నెలల క్రితమే తెలుసు’’ అని రాహుల్‌ అన్నారు. మరి దాన్ని ఆపడానికి నాలుగు నెలలుగా ఏం చేశావు? అని అంతా అడుగుతున్నారు.

నీరు గారిన మహాకూటమి ఆశలు
ఉత్తర భారతంలో నేడు కాంగ్రెస్‌ ఉనికిలోనే లేదు. కానీ ప్రాంతీయ నేతలైన ములాయం సింగ్, లాలూ ప్రసాద్‌యాదవ్, నితీశ్‌ కుమార్‌ వంటి వారికి గొప్ప ప్రజా పునాది ఉంది. సాధారణంగా అలాంటి ప్రాంతీయ నేతలకు ఒకరంటే ఒకరికి పడదు. కాబట్టి కాంగ్రెస్‌ అలాంటి నేతలందరినీ ఒక చోటికి చేర్చగలిగితే గొప్ప శక్తి ఆవిర్భవిస్తుంది. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లో గత 25 ఏళ్లుగా ములాయం, మాయావతి ప్రత్యర్థులుగా ఉన్నారు. అలాగే బిహార్‌లో నితీశ్, లాలూ కూడా 25 ఏళ్ల పాటూ ఒకరితో ఒకరు తలపడి, ఒకటయ్యారు. కాంగ్రెస్‌ కూడా కర్ణాటకలో దేవెగౌడతో, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌తో, బెంగాల్‌లో మమతా బెనర్జీ, సీపీఎంతో కలిస్తే మహా కూటమి సిద్ధమవుతుంది. 2015లో బిహార్‌లో నితీశ్, లాలూ చేయి కలపడం బీజేపీని రాజకీయంగా కుదిపేసింది. ఈ మహా కూటమి పథకంలో నితీశ్‌ ఒక ముఖ్య కీలక వ్యక్తి. నితీశ్‌ అందులో లేకపోతే 2019లో బీజేపీ బిహార్‌లో సులువుగా గెలుస్తుంది. నితీశ్‌ కాంగ్రెస్, మహా కూటమితో లేకపోవడంతో, ఇక ఎలాగూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఆ కూటమిలో చేరడంలో అర్థమేముంటుంది? అని ప్రాంతీయ నేతలంతా ఆలోచిస్తారు.. యూపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్య మంత్రి ఒమర్‌ అబ్దుల్లా...  2019 సంగతి పక్కనబెట్టి, 2024 ఎన్నికలకు ప్రణాళికలను రచించడం ఉత్తమమని  చెప్పారు కూడా.

2014 పార్లమెంటు ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయలేమని బీజేపీకి బాగా తెలుసు. అందుకే అది 2019 ఎన్నికలపైనే దృష్టిని కేంద్రీ కరించింది. ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఉన్న 80 పార్లమెంటు స్థానాల్లో 72ను అది తిరిగి గెలుచుకోలేదు. బీజేపీ ఎక్కువ సీట్లను సాధించిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్, మహారాష్ట్ర, హరియాణా, రాజస్థాన్‌లలో బలమైన అధికారపార్టీ వ్యతిరే కత ఉంది. ఆ రాష్ట్రాల్లో వాటిల్లే నష్టాన్ని బీజేపీ కొత్త ప్రాంతాల నుంచి భర్తీ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్‌లో అది ఒక పెద్ద శక్తిగా ఆవిర్భవించడానికి మరో ఏడేళ్లు పడుతుంది. శాసనసభ విజయాల సంగతి ఎలా ఉన్నా, 2004లో అటల్‌ బిహారీ వాజ్‌ పేయి బీజేపీకి 300 స్థానాలు వస్తాయనుకుని ఓటమి పాలైన విషయాన్ని అది ఎన్నటికీ మరిచిపోలేదు. రాజకీయాలలో రెండేళ్లంటే చాలా ఎక్కువ కాలమని మోదీ, షాలకు బాగా తెలుసు. వారు నిరంతరం ఎప్పటికప్పడు పరిస్థితిని గమనిస్తూనే ఉండాల్సి ఉంటుంది. ఏపీ, తమిళనాడు, కేరళ, తెలంగాణ, బెంగాల్, ఒడిశాలలో బీజేపీ ఓట్ల శాతం పెరిగినా ఎంపీ సీట్లు మాత్రం దక్కవని కూడా వారికి తెలుసు. ఇక తెలుగుదేశం, శివసేన, ఏఐఏడీఎంకే, టీఆర్‌ఎస్‌ వంటి మిత్రపక్షాలు గాలివాటం బాపతని వారికి బాగా తెలుసు. బీజేపీకి ఆధిక్యత లభించకపోతే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి గెంతేస్తారు. ప్రాంతీయ నేతలు చాలా తెలివిగా వ్యవహరిస్తారని, వారి ప్రేమ తాత్కాలికం, విడాకులు విద్వేషపూరితం అని కూడా వారికి తెలుసు.

మహారాష్ట్ర, హరియాణా జార్ఖండ్, అస్సాం వంటి పలు రాష్ట్రాల్లో బీజేపీ తొలిసారిగా గెలిచింది. కాబట్టి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే కాబట్టి, ఆ రాష్ట్రాల్లో రెట్టింపు అధికార పార్టీ వ్యతిరేకతను ఎదుర్కో వాల్సి వస్తుందని మోదీ, షాలకు తెలుసు. బీజేపీ వ్యతిరేక ప్రతిపక్షాలన్నీ ఐక్యమైతే ఆ రాష్ట్రాల్లో బీజేపీ పని ఏటికి ఎదురీతే అవుతుంది.

నితీశ్‌ విశిష్ట స్థానం
నితీశ్‌ బిహార్‌లోని ఓ చిన్న పార్టీకి నేత. కానీ బిహార్‌ మహాఘట్‌బంధన్‌లో ఆయనకు స్థానం ఉండటం వల్లనే లాలూ, కాంగ్రెస్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమైంది. నితీశ్, లాలూ విడిగా పోటీ చేసి ఉంటే సునాయసం గానే తాము అక్కడ గెలిచి ఉండేవారమని బీజేపీ భావిస్తోంది. బిహార్‌ కూటమి ప్రాతిపదికపై బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉత్తరప్రదేశ్‌లో మహాఘట్‌      బంధన్‌ను ఏర్పాటుచేయాలని అనుకుంటున్నాయి. బద్ధ శత్రువులైన మాయా వతి బీఎస్‌పీ, అఖిలేశ్‌ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు 2019లో కలసి పోటీచేస్తాయి. కానీ ఇప్పుడు నితీశ్‌ బీజేపీతో కలవడం.. అలాంటి కూట మిని నిరుపయోగంగా మార్చేసింది. ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి కూటము లను ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్‌ తదితర బీజేపీ వ్యతిరేక పార్టీల పథకం. బెంగాల్‌లో మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ కలుస్తాయి. కర్ణాటకలో కాంగ్రెస్, దేవె గౌడకు చేయి చాస్తున్నది. ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌తో కలిసింది. కానీ నితీశ్‌ నిష్క్రమణతో ఆ తర్కం పని చేయదు. బిహార్‌లో మహాఘట్‌బంధన్‌ లేకపోతే 2019లో బీజేపీ సునాయాసంగా ఆధిక్యతను సాధిస్తుంది.  

నితీశ్, కాంగ్రెస్‌ కూటమిని వీడిన వెంటనే బీజేపీ ప్రచారపరంగా గొప్ప విజయాన్ని సాధించింది. నితీశ్‌ తమ కూటమిలో లేనిదే కాంగ్రెస్‌ బిహార్‌లో మంచి ఫలితాలను సాధించలేదు. 2019లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్ప డక తప్పదని అనుకున్నాక ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఓడిపోయే పక్షంలో ఉండాలని ఎందుకు అనుకుంటుంది? భారత రాజకీయాల్లో నితీశ్‌ ఒక విశిష్ట స్థానాన్ని సాధించుకున్నారు. కాంగ్రెస్‌  నాయకులు లేని పార్టీ, నితీశ్‌ పార్టీ లేని నాయకుడు అని సుప్రసిద్ధ చరిత్రకారులు రామచంద్ర గుహ ఇటీవల అన్నారు. కాబట్టి నితీశ్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షుణ్ణి చేసి, రాహుల్‌ స్థానంలో ఆయ నను ప్రధాని అభ్యర్థిగా నిలపాలని సూచించారు. గుహ పరిహాసంగానే అన్నా, దేశవ్యాప్తంగా ఆ మాటలను నిజమైనవిగానే తీసుకోవడంతో నితీశ్‌ ప్రతిష్ట మరింత పెరిగింది.

భావి పర్యవసానాలు
1. నితీశ్‌ నిష్క్రమణ వల్ల ఎక్కువగా నష్టపోయినది కాంగ్రెస్, రాహుల్‌ గాంధీలే. ఇక వారు అధికారంలోకి రాలేనట్టే అనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు దానితో కలవడానికి జంకుతాయి. పెద్ద కూటమికి నేతృత్వం వహించి, పెద్ద నేతగా కనిపించాలని రాహుల్‌ కలలుగంటున్నారు. ఇప్పుడిక ఏం చేయాలో ఆయనకు తెలియదు.

2. లాలూ, బిహార్‌లో తన నియంత్రణలో ఉన్న ప్రభుత్వాన్ని కోల్పో యారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇక ఆయన చెప్పు చేతల్లో ఉండదు. పైగా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ కూడా లాలూ కుటుంబ ఆస్తులపై విచార ణలను మొదలెడుతుంది. ఆయన కుటుంబ సంపదపై ఇప్పటికే సీబీఐ జరుపుతున్న విచారణ ఇక ముమ్మరమవుతుంది. ఎన్‌ఫోర్స్‌ శాఖ ఆయన కుటుంబ బినామీ అస్తులన్నిటినీ స్వాధీనం చేసుకుంటుంది.

3. నితీశ్, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సన్నిహితులుగా ఉండేవారు. కాబట్టి ఆమె కూడా నష్టపోతారు. బీజేపీ అక్కడ బలపడటమే కాదు, పొరుగున ఉన్న బిహార్‌లో అధికారంలోకి వస్తుంది. 2019లో బీజేపీ ఓడిపోతుందని మమతా బెనర్జీ చెబుతూ వస్తున్నారు. కానీ నితీశ్‌ నిష్క్ర మణతో అది అసాధ్యంలా అనిపిస్తోంది.

4. మహాఘట్‌బంధన్‌ ద్వారా వామపక్ష పార్టీలు ఎంతో కొంత లబ్ధి పొందాలని ఆశిస్తున్నాయి. కేవలం 20 మంది ఎంపీలే ఉన్న వామపక్షాలు ఒక బలమైన కూటమిలో భాగమై 2019లో బీజేపీని ఓడించాలని చూస్తున్నాయి. ఇక అది కష్టమనే అనిపిస్తోంది.

5. ఉత్తరప్రదేశ్‌లో మహాఘట్‌బంధన్‌ను ఏర్పాటు చేయాలని అఖిలేష్‌ యాదవ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిక ఆయన తండ్రి ములా యం... ఇక ఒంటరి పోరే మెరుగంటూ, కాంగ్రెస్‌తోగానీ, మాయావతితోగానీ సమాజ్‌వాదీ పార్టీ కలవరాదని అంటారు. కాబట్టి యూపీలో అఖిలేష్‌ తీవ్ర ఇబ్బందుల్లో పడతారు.

6. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే పాత రోజులు తిరిగి రానున్నాయని సంబరపడుతోంది. నితీశ్‌ నిష్క్రమణతో 2019లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువని ఏఐడీఎంకే, తదితరులు భావిస్తున్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న డీఎంకేకు ఇది దుర్వార్తే. బీజేపీ బల హీనపడితే ఏఐడీఎంకే క్రమంగా అంతర్ధానమైపోతుందని స్టాలిన్‌ ఆశిస్తు న్నారు. కానీ దానికి సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతోంది.
7. నితీష్‌ రాకతో బీజేపీ మిత్రపక్షాలైన తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్‌ వంటి పార్టీల బేరసారాలాడే శక్తి తగ్గిపోతుంది.
 
8. ఢిల్లీ  ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు నితీశ్‌ పెద్ద మద్దతుదారు. కాబట్టి ఆయన కూడా నష్టపోతారు.
ఈ పరిణామాల వల్ల ఎక్కువగా లబ్ధిని పొందేది బీజేపీనే. మోదీ, షాల ఖ్యాతి తారస్థాయికి చేరుతుంది. మరీ ముఖ్యంగా అవసరమైతే వారు ఎవరి తోనైనా రాజీ పడటానికి సిద్ధమేనని రుజువవుతుంది. రాజకీయాలలో ఇది గొప్ప సుగుణం. నితీశ్‌ కూడా బాగానే లబ్ధిపొందుతారు. మహా తెలివైన లాలూ యాదవ్‌తో కంటే 15 ఏళ్లు కలసి ఉన్న బీజేపీతో పని చేయడం ఆయ నకు సులువు అవుతుంది. పైగా కేంద్రంలో మిత్ర ప్రభుత్వం ఉండటమనే సానుకూలత కలుగుతుంది.

2019 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మోదీ, షాలు రాజకీ యంగా సాధ్యమైన ప్రతిదాన్నీ సాధించారు. ఒకే ఒక్కటి మిగిలిపోయింది. మోదీ ప్రభుత్వం మంచి పరిపాలనను అందించి, రైతు సమస్యలు, నిరు ద్యోగం కలసి 2018 నాటికి జాతీయస్థాయిలో ఒక్కసారిగా బద్ధలు కాకుం డటానికి హామీని కల్పించాలి. అదే జరిగితే వారి మొత్తం పథకమంతా చెడి పోతుంది. మోదీ, షాలు ఆ పరిస్థితికి తగ్గ పథకాన్ని ఇంకా రూపొందించాల్సి ఉంది. అంతకు మించి సుపరిపాలనపై దృష్టిని కేంద్రీకరించాలి.

వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు‘ ఈ–మెయిల్‌: ppr193@gmail.com
పెంటపాటి పుల్లారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement