ఇరువర్గాలకూ విజయంపై విశ్వాసం!
బీజేపీది అభివృద్ధి మంత్రమైతే.. నితీశ్ పనితీరు సెక్యులర్ ఫ్రంట్ ఆయుధం!
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో విజయం తమదేనని ప్రధాన కూటములు ఎన్డీయే, మహా లౌకిక కూటమి విశ్వాసం వ్యక్తం చేశాయి. వరుసగా మూడోసారి సీఎం పీఠం ఆశిస్తున్న జేడీయూ నేత, సీఎం నితీశ్ కుమార్.. ఎన్నికల పోరుకు సిద్ధంగా ఉన్నామని, సీఎంగా తన పనితీరే తనను మళ్లీ గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేయగా.. ఈసీ ప్రకటన నితీశ్ పాలనకు అంతం పలికే ప్రకటన అని, రానుంది కాషాయ దళ పాలనేనని బీజేపీ చెప్తోంది. ‘సెప్టెంబర్ 6 నుంచే ఎన్నికల నియమావళిని పాటిస్తున్నాం. ప్రస్తుతం ముఖ్యమైన అధికార విధులు తప్ప అన్ని పనులూ ముగించాం. సీఎంగా నా పనితీరే ప్రధాన ప్రచారాస్త్రంగా ప్రజల ముందుకు వెళ్తాం’ అని నితీశ్ తెలిపారు. ఎన్నికలను ఐదు రోజులు కాకుండా, ఒకే రోజులో ముగిస్తే బావుండేదని లాలూ అన్నారు.
ఈ ఎన్నికలతో బీజేపీ పని ముగుస్తుందన్నారు. ‘బీజేపీ ముసుగు మాత్రమే. అసలు ముఖం ఆరెస్సెస్. అది ఈ మధ్యే బీజేపీ చెవులు మెలేసి, ప్రభుత్వ పనితీరును సమీక్షించింది’ అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో మహా లౌకిక కూటమి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తేదీల ప్రకటనతో నితీశ్ శకం ముగిసిందని, అది ఒకరకంగా బీజేపీ అధికారంలోకి వస్తున్నదని తెలిపే ప్రకటన అని బీజేపీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ పేర్కొన్నారు. ‘దీపావళి ముందు ఎన్నికల ఫలితాలు వెలువడటం బావుంది. బీజేపీతో సుపరిపాలన ప్రారంభం కాబోతోందన్న ఆనందంతో ప్రజలు దీపావళి జరుపుకుంటారు’ అని బిహార్ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అభివృద్ధి మంత్రంతో ప్రజల ముందుకు వెళ్తామని మరో నేత సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. 12 ఏళ్ల పాటు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటూ నితీశ్ లౌకికవాదంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై లాలూ, నితీశ్ కుమార్ జాగ్రత్తగా స్పందించారు. ములాయంపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని తన పార్టీ శ్రేణులను ఆదేశించానని లాలూ చెప్పారు. ‘లౌకిక కూటమిలో ఎస్పీ కొనసాగాలని లాలూ, శరద్‌యాదవ్ కృషి చేశారు. దురదృష్టవశాత్తూ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు’ అని నితీశ్ అన్నారు.
సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఎంపిక
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ప్రధాన కూటములు సీట్ల సర్దుబాటు ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీ బుధవారం మిత్రపక్షాలతో భేటీ నిర్వహించింది. రెండు, మూడు రోజుల్లో సీట్ల పంపకం ఒక కొలిక్కి వస్తుందని ఎన్డీయే మిత్రపక్షం ఎల్జేపీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. మహా దళిత్ నేత, మాజీ సీఎం జితన్‌రామ్ మాంఝీ ఇటీవల దళిత నేతగా పాశ్వాన్‌కు ప్రచారం కల్పించడాన్ని ప్రశ్నించడం, తమకు ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేయడంతో కూటమిలో విభేదాల గురించి పలు వార్తలు వెలువడ్డాయి. అయితే, అవన్నీ అన్నదమ్ముల మధ్య అభిప్రాయభేదాలవంటివని బుధవారం బీజేపీ నేత అనంత్ కుమార్‌తో భేటీ అనంతరం మాంఝీ అన్నారు.