నితీశ్ పగటి కలలు మానుకో
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన 'బీజేపీ రహిత భారత్' వాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ నితీశ్ కుమార్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు.
'బీజేపీ రహిత భారత్' అని అనడానికి నితీష్ కు ఉన్న విశ్వసనీయత ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో 17 ఏళ్లపాటు మిత్రపక్షంగా కొనసాగినప్పుడు 'బీజేపీ ముక్త భారత్' నినాదం గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. 'ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు తెంగించి మాట్లాడిన మాటలు'గా నితీశ్ వాఖ్యలను ఆయన అభివర్ణించారు. నితీశ్ తన పరిధిలో తానుంటే మంచిదని సూచించారు. జేడీయూ ఒక ప్రాంతీయ పార్టీ అని, అది బిహార్లలోని మొత్తం సీట్లలో ఎప్పుడూ పోటీ చేయలేదని అన్నారు. అలాంటి పార్టీ జాతీయస్థాయిలో క్రియాశీలంగా వ్యవహరించాలనుకోవడం అవివేకమే అవుతుందన్నారు.
జనతాదళ్ యునైటెడ్ పార్టీలోనే ఐక్యత లేదని షానవాజ్ ఎద్దేవా చేశారు. నితీశ్ తన ఇంటిని ముందు చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆర్ఎస్ఎస్, బీజేపేతర శక్తులన్నీ ఒక తాటిపైకి రావాలని ఇటీవల నితీశ్ వాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్ భారతదేశ ఆత్మ అని, ఆత్మ లేని ఇండియా ఎలా సాధ్యమని ఆ సంస్థ నాయకుడు రాకేష్ సిన్హా వాఖ్యానించారు.