పతన ఆర్థిక వ్యవస్థ పట్టదా? | Nation Face Financial Problem | Sakshi
Sakshi News home page

పతన ఆర్థిక వ్యవస్థ పట్టదా?

Published Sat, Feb 8 2020 4:13 AM | Last Updated on Sat, Feb 8 2020 4:13 AM

Nation Face Financial Problem - Sakshi

2020 బడ్జెట్‌ ఏమంత పెద్దగా కానీ, అసాధారణంగా గానీ లేదన్న సాధారణ భావమే మెల్లమెల్లగా ఏర్పడుతోంది. ఈ బడ్జెట్‌లోనూ కీలకమైన నిర్ణయాలేవీ తీసుకోలేదు. అదొక షరా మామూలు బడ్జెట్‌గానే మిగిలింది. నిర్మలా సీతారామన్‌ సమర్థతలను అంచనా వేయడానికి ఇది సమయం కాదు. అరుణ్‌ జైట్లీ తొలి అయిదేళ్లు ఆర్థికమంత్రిగా ఉండేవారు. కాని తనకు పేరు తెచ్చిపెట్టే గొప్ప అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నారు. కానీ డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ వంటి గొప్ప వ్యక్తి సరసన నిలబడేందుకు, అలాంటి పేరు తెచ్చుకునేందుకు ఆర్థికమంత్రి ముందు ఇప్పుడు మంచి అవకాశం ఉంది. పైగా అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. ఈ కోణంలో చూస్తే 2020 బడ్జెట్‌ కూడా అలాంటి అవకాశాన్ని పోగొట్టుకున్న బడ్జెట్‌ అనే చెప్పాల్సి ఉంటుంది.

సుప్రసిద్ధ బ్రిటన్‌ ప్రధానమంత్రి హెరాల్డ్‌ విల్సన్‌ 50 ఏళ్ల క్రితం.. రాజకీయాల్లో ఒక వారం రోజులు అంటే చాలా ఎక్కువ కాలం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో వారం రోజులే అధికం అనుకుంటే బడ్జెట్‌ విషయంలో వారం రోజులంటే మరీ ఎక్కువ కాలం అనే చెప్పాలి. ఫిబ్రవరి1న కేంద్ర బడ్జెట్‌ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించినప్పుడు చాలామంది తక్షణ స్పందనలు వ్యక్తీకరించారు. కానీ ఫిబ్రవరి 1న మనం చేసిన చాలా సరళ నిర్ధారణల విషయంలో వారం రోజుల తర్వాత, అనిశ్చితి నెలకొంది. దీంతో బడ్జెట్‌పై రెండో అభిప్రాయం ప్రకటిం చడం మొదలెడుతున్నాం. ఒకవిషయం మాత్రం మారలేదు. బడ్జెట్‌ ప్రసంగాలకు సంబంధించిన పాత రికార్డులన్నింటినీ నిర్మల బద్దలు గొట్టేశారు. ఆర్థిక మంత్రి 2 గంటల 45 నిమిషాల పాటు  బడ్జెట్‌ ప్రసంగం చేస్తున్న ప్పుడు కొంతమంది మంత్రులు నిద్రపోయారు కూడా. ఇప్పుడు సమస్య ఏమిటంటే అంత సుదీర్ఘ ప్రయత్నంలో విషయ గాఢత ఏమైనా ఉందా అన్నదే.

అంత సుదీర్ఘ ప్రసంగం తర్వాత ఏర్పడిన ఉల్లాస స్థితిలో మనం ప్రతి విషయంలోనూ ముఖవిలువను మాత్రమే తీసుకుంటాం. కానీ కొంత సమయం తర్వాత వాస్తవంగా బడ్జెట్‌ పూర్తి భిన్నంగా ఉందని గ్రహిస్తాం. 2020 బడ్జెట్‌లో ఏమంత పెద్దగా కానీ, అసాధారణంగా గానీ లేదన్న సాధారణ భావమే మెల్లమెల్లగా ఏర్పడుతోంది. కీలకమైన నిర్ణయాలేవీ తీసుకోలేదు. అదొక షరా మామూలు బడ్జెట్‌గానే మిగిలింది. ఆర్థికమంత్రిని కాస్త సంప్రదాయకంగానే ఉండాలని, ఆర్థికవ్యవస్థ కుంగుబాటు సహజంగానే దాని ముగింపును చేరుకునేంతవరకు (అంటే మళ్లీ పుంజుకోవడం ప్రారంభమయ్యేంతవరకు) వేచి చూడాలని ఎవరో ఆమెకు సలహా ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ పతనబాట పట్టాక కొంతకాలం శిక్షను అనుభవించాక, సహజంగానే అది కోలుకుంటుందని ఆర్థిక శాస్త్రం మనకు పాఠం చెబుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ తన అత్యంత పతనస్థాయికి చేరుకుంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధిబాటను చేపడుతుందనే భావన ఉంటోంది. మోదీ ప్రభుత్వ ఆశ కూడా అదేననిపిస్తోంది. 2019 అక్టోబర్‌ నుంచే మీడియా, విభిన్న భావాలు కలిగిన ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా 2020 బడ్జెట్‌ బిగ్‌ బ్యాంగ్‌ బడ్జెట్‌గా ఉంటుం దని, ఆర్థిక వ్యవస్థకు అధిక ద్రవ్యం వచ్చి చేరుతుందని, భారీ సంక్షేమ పథకాలు మొదలై ప్రజల చేతుల్లో పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని కలలు కన్నారు. కానీ వీటిలో ఏ ఒక్కటీ తాజా బడ్జెట్‌లో కనిపించలేదు.

ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పుడు దాంట్లోకి భారీగా డబ్బును పంపించడం ద్వారా లేక డబ్బును అధికంగా ముద్రించడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలని ఆర్థిక సిద్ధాంతం తెలుపుతోంది. ఇది వినియోగదారుల్లో డిమాండును సృష్టించి ఆర్థిక వ్యవస్థను ముందుకు నడుపుతుంది. కానీ 2016 నవంబర్‌ 8న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుతో ప్రజల చేతుల్లోని డబ్బు, సహజసిద్ధమైన వారి  డిమాండ్‌ శక్తి మటుమాయమైపోయింది. లక్షలాదిమంది తమ ఉద్యోగాలు కోల్పోయారు, చిన్నచిన్న వ్యాపారాలు మూసివేతకు గురయ్యాయి. రైతులు పండించిన పంటకు తగిన డబ్బులు రాలేదు. దేశవ్యాప్తంగా ఆర్థిక కల్లోలం చెలరేగింది, ఆరోజు చమురు ధరలు తగ్గిన కారణంగానే ఆర్థిక వ్యవస్థ తనకు తానుగా కోలుకుని తీవ్ర కుంగుబాటు బారినుంచి తప్పించుకుంది. కానీ ఆనాటి పెద్దనోట్ల రద్దు దుష్ఫలితాలు ఇప్పటికీ దేశం అనుభవిస్తూనే ఉంది. పైగా జీడీపీ సాధారణ వృద్ధిరేటు 10 శాతంగా ఉంటుందని ఆర్థికమంత్రి సెలవిచ్చారు. అంటే జీడీపీ వృద్ధి ప్లస్‌ ద్రవ్యోల్బణ రేటు అనీ ఆమె ప్రకటన అర్థం తప్ప జీడీపీ వాస్తవ వృద్ధి కాదని అర్థం. 2016 నవంబర్‌ 8 నాటి పెద్దనోట్ల రద్దు ఫలితాలు దీర్ఘకాలం ఉంటాయి. చాలామంది ప్రజల, ఆర్థిక వేత్తల అంచనాలను ఈ బడ్జెట్‌ అందుకోనప్పటికీ బడ్జెట్‌లోని కొన్ని సానుకూల అంశాలను ఎత్తిపట్టాల్సి ఉంటుంది.

1. పన్ను వివాదాల కేసులు: దేశంలో 4.86 లక్షల పన్ను వివాదాలపై కేసులు కొనసాగుతున్నాయని ఆర్థికమంత్రి చెప్పారు. అంటే ఈ వివాదాల్లో దాదాపు రూ. 15 లక్షల కోట్లు ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇలా కేసుల రూపంలో స్తంభనకు గురైన భారీ సంపదను తప్పకుండా వెలికి తీసుకురావాలని ఆమె చెప్పారు. పన్ను కేసులు పరిష్కారమైతే ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వం ఆమేరకు లాభపడతారు. భారీగా  ఇరుక్కుపోయిన ఈ ఆదాయాన్ని వెలికి తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆర్థిక అవార్డులు, వివాదాలతో కూడిన కేసును పరిష్కరించాలనుకుంటే మరిన్ని ఆరోపణలు, న్యాయమూర్తుల పేర్లకు మరకలంటించడం చేస్తారని దానికి బదులుగా ప్రభుత్వం ఇలాంటి కేసుల్లో 50 శాతం రాయితీని కల్పించే విషయం ఆలోచిస్తోందని ఆర్థికమంత్రి చెప్పారు.

2. భారతీయ విద్యాసంస్థల్లో విదేశీ మదుపులను అనుమతించడం చాలా సానుకూలతను కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ విశ్వవిద్యాలయాల నాణ్యతను ఇది పెంచుతుంది. దీనివల్ల భారతదేశంలో విదేశీ విద్యార్థులు కూడా చదువుకునే అవకాశాలను పెంచుతుంది. ఈరోజు అమెరికాలో 10 లక్షల మంది, చైనాలో 5 లక్షలమంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ రంగంలో భారత్‌ కూడా పోటీపడాల్సిన అవసరముంది.

3. ప్రభుత్వ ఆసుపత్రులతో వైద్య కళాశాలలను అనుసంధానిం చడం. ప్రస్తుతం ప్రతి వైద్య కళాశాలకు కనీసం 750 పడకల పెద్ద ఆసుపత్రి అనుసంధానమై ఉండాలి. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులతో అనుసంధానం కావాలని తాజా బడ్జెట్‌ పేర్కొంది. దీనికి ఆర్థిక సహాయం కూడా అవసరం. దేశంలో మరిన్ని వైద్య కళాశాలల అవసరం ఉంది కాబట్టి ఈ చర్య తప్పక దోహదం చేస్తుంది.

4. ఆరోగ్యరంగానికి గరిష్టంగా నిధులు పెంచారు. గత సంవత్సరం ఈ రంగానికి రూ. 65,000 కోట్లు కేటాయించగా ఈ ఏడాది దాన్ని రూ. 67,500 కోట్లకు పెంచారు. ప్రజల వినియోగ డిమాండును ఇది తప్పకుండా పెంచుతుంది.

5. భారతదేశంలో బహిరంగ మలవిసర్జన ప్రపంచంలోనే అత్యధికం కాబట్టి పారిశుధ్య కల్పన అనేది దేశంలో అత్యంత ప్రధానమైన సంక్షేమ చర్య, ఆరోగ్య పథకంగా ఉంటోంది. ఈ రంగానికి తాజా బడ్జెట్‌లో గణనీయంగా నిధులు పెంచారు. గతేడాది పారిశుధ్యానికి రూ. 9,600 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ. 12,300 కోట్లకు పెంచారు. అంటే 28 శాతం పెరుగుదల అన్నమాట. ఈ పథకాన్ని మరింత మెరుగ్గా అమలుచేసి పబ్లిక్‌ టాయ్‌లెట్లను అధికంగా నిర్మించాల్సిన అవసరముంది.

గత ఆరు బడ్జెట్ల ద్వారా నరేంద్రమోదీ చాలా ఆశాభంగం కలిగించారు. మోదీ విదేశీ వ్యవహారాలు, రక్షణ, అంతర్గత భద్రత, స్వచ్ఛభారత్‌ వంటి అనేక పథకాలను సమర్థవంతంగా నిర్వహించారు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నందున మరింత మంచి బడ్జెట్‌ను దేశం కోరుకుంటోంది. కాని తాజా బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే జరుగుతున్న పరిణామాలను అలాగే కొనసాగనిద్దాం అనే ధోరణే కనబడుతోంది కానీ నది మధ్యలో ఉన్న బోటును షేక్‌ చేసే దృక్పథాన్ని ఇది ప్రదర్శించడం లేదు. ప్రస్తుత బడ్జెట్‌ పరిస్థితి నాకు ఫ్రెంచ్‌ రచయిత జీన్‌ అల్ఫాన్స్‌ కార్‌ 130 ఏళ్ల క్రితం చెప్పిన మాటలను గుర్తుకు తెస్తోంది. పరిస్థితులు ఎంత అధికంగా మారితే, అంత ఎక్కువగా అవి అలాగే కొనసాగుతుంటాయి అని తన వ్యాఖ్య. దీనికనుగుణంగానే గత ఆరు బడ్జెట్లు యధావిధిగా కొనసాగుతూ వచ్చాయి. మార్పు అన్నదే కనిపించలేదు. ఈ ఆరేళ్లలో ఏమీ జరగని నేపథ్యంలో.. త్వరలోగానీ, తర్వాత కానీ అలాంటి అద్భుతమైన బడ్జెట్‌ ఏనాటికైనా వస్తుందా అనే సమస్య తలెత్తక మానదు.

అరుణ్‌ జైట్లీ తొలి అయిదేళ్లు ఆర్థికమంత్రిగా ఉండేవారు. కాని తనకు పేరు తెచ్చిపెట్టే గొప్ప అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నారు. నిర్మలా సీతారామన్‌ సమర్థతలను అంచనా వేయడానికి ఇది సమయం కాదు. కానీ డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ వంటి గొప్ప వ్యక్తి సరసన నిలబడేందుకు, అలాంటి పేరు తెచ్చుకునేందుకు ఆమెముందు ఇప్పుడు మంచి అవకాశం ఉంది. పైగా అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. ఈ కోణంలో చూస్తే 2020 బడ్జెట్‌ కూడా అలాంటి అవకాశాన్ని పోగొట్టుకున్న బడ్జెట్‌ అని కూడా చెప్పాల్సి ఉంటుంది.

వ్యాసకర్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు
పెంటపాటి పుల్లారావువిశ్లేషణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement