బాల్ థాక్రే 1966లో శివసేనను స్థాపించి మహారాష్ట్రలో దాన్ని ఒక గొప్పశక్తిగా మలిచారు. బొంబాయి దేశ ఆర్థిక రాజధానిగా ఉండటంతో ఈ పరిణామం భారత రాజకీయాలపై కూడా ప్రభావితం చూపింది. బాల్‌థాక్రే బలంగా ఒక విషయాన్ని నమ్మేవారు. థాక్రే కుటుంబంలో ఏ ఒక్క సభ్యుడు కూడా ఎన్నికల్లో ఎన్నటికీ పోటీ చేయరు అన్నదే ఆ నమ్మకం. బాల్‌థాక్రే జీవించి ఉన్నంతవరకు శివసేన ఆ నియమాన్ని గౌరవిం చింది. నిజానికి ఆయన పెద్ద కోడలు అప్పట్లోనే బాంబే మేయర్ కావాలని కోరుకున్నారు. కానీ బాల్‌థాక్రే ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో ఆయన పెద్దకుమారుడు ఇంట్లోంచి వెళ్లిపోయారు.
థాక్రే మరణం తర్వాత ఉద్ధవ్‌థాక్రే ఆ నియమాన్ని బద్దలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం ద్వారా ఉద్ధవ్‌థాక్రే తండ్రి అంతరాల్లోంచి వచ్చిన ఆ నిబంధనను ఉల్లంఘించారు. తన కుటుంబంలో ఎవరూ ఎన్నికల్లో పాల్గొనకూడదని చెప్పడంలో బాల్‌థాక్రే తర్కం చాలా సులువైనది. వ్యక్తిగత వైభవం కోసం లేదా పదవికోసం, తన కుటుంబం రాజకీయాల్లో పాల్గొంటోందని ప్రజలు తమ గురించి అనుకోకూడదని థాక్రే భావించేవారు. శివసేన అంటే 80 శాతం సామాజిక సేవ, 20 శాతం రాజకీయాలు అని పదే పదే చెప్పేవారు.
ఆయన గొప్ప చింతనాపరుడు. ఒక నాయకుడు ఎన్నికల్లో పాల్గొంటున్నప్పుడు అతడు ప్రజలవద్దకు వెళ్లి ఓట్ల కోసం అడుక్కోవాలని, అలాంటి వైఖరి శివసేనను దెబ్బతీస్తుందని థాక్రే చెప్పేవారు. ఎందుకంటే శివసేన విభిన్నమైన పార్టీ అని థాక్రే విశ్వాసం. కాబట్టి మహారాష్ట్రలో ఇప్పుడు రెండు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. శివసేన పూర్తిగా సాధారణ రాజకీయ పార్టీగా మారవచ్చు లేదా అది పతనం కావచ్చు. థాక్రే గొప్ప నియమం బద్దలైపోయింది. శివసేన ప్రస్తుత పాత్రను గుర్తిస్తున్నప్పుడు ఈ అంశాన్ని మనసులో ఉంచుకోవాల్సిందే.
ఒక శివసైనికుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నది బాల్ థాక్రే చివరి కోరిక అని శివసేన నేత సంజయ్ రౌత్ ఇప్పుడు చెబుతున్నారు. కానీ తన కుటుంబ సభ్యుడొకరు సీఎం కావాలని థాక్రే ఎన్నడూ భావించలేదు. ఈ వాస్తవం ప్రస్తుత శివసేన నాయకత్వాన్ని విచ్ఛిన్న పరుస్తుంది. బాల్‌థాక్రే రాజరికపాలనపై, కాంగ్రెస్ పార్టీపై పదే పదే దాడిచేసేవారు. రాజరికపాలన క్రమక్రమంగా అంతరించిపోతుందని థాక్రే చెప్పేవారు.
శివసేన మిలిటెంట్ పార్టీగానే తప్ప అధికారంపై ఆసక్తి లేకపోవడాన్ని కొనసాగించాలని ఆయన హెచ్చరించేవారు. 1994లో తొలిసారిగా మహారాష్ట్రలో శివసేన అధికారంలోకి వచ్చినప్పుడు బాల్ థాక్రే ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ మనోహర్ జోషిని సీఎంగా నియమించిన థాక్రే తాను మనోహర్ జోషీ రిమోట్ కంట్రోల్‌గా ఉంటానని బహిరంగంగా చెప్పారు. శివసేన ప్రస్తుత స్థితిని అంచనా వేసేటప్పుడు ఈ నేపథ్యాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.
ఉద్దవ్ థాక్రే దివంగత బాల్‌థాక్రే మూడవ కుమారుడు. మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్నికల ముందు పొత్తు కుదుర్చుకున్న బీజేపీని తుంగలో తొక్కి మరీ సీఎం అయ్యారు. భారత రాజకీయాల్లో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదు. అయితే శివసేన నైతికతపై చర్చించటం కంటే అధికారం చేజిక్కించుకోవడం ద్వారా శివసేన ఎదుర్కోనున్న బలమైన సవాళ్లను అంచనా వేయడం అవసరం అని నా భావన. శివసేన ఒక పార్టీగా 1999 నుంచి పతనమవుతూ వస్తోంది. బీజేపీ–శివసేన పొత్తులో ప్రధాన భాగస్వామిగా ఉంటున్న స్థితి నుంచి సేన జూనియర్ భాగస్వామిగా పడిపోయింది.
తన ఈ పతనానికి బీజేపీనే వేలెత్తి చూపుతున్న శివసేన తన నాయకత్వ శైలిగురించి ప్రశ్నించుకోవడం లేదు. మహారాష్ట్ర శాసనసభలోని 288 సీట్లలో 124 స్థానాల్లో పోటీ చేసిన శివసేన కేవలం 58 సీట్లను గెల్చుకుంది. మిగిలిన 164 సీట్లలో పోటీ చేసిన బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగింది. ఈ లెక్కలకు సంబంధించిన తేడాను ఉపయోగించుకున్న శివసేన.. బీజేపీని విడిచి, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పర్చింది.
థాక్రే కుటుంబానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే శివసేనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ప్రధానంగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉనికిలో ఉన్న పార్టీగా పతనమైన శివసేన ముఖ్యమంత్రి పదవి ద్వారా పోయిన బలాన్ని తిరిగి పొందవచ్చని ఆశిస్తోంది. సీఎంగా ఉద్దవ్ ప్రతిచోటా ఆదేశించే స్థాయిలో ఉంటారు కాబట్టి ఇతర పార్టీల్లోని నేతలను, కార్యకర్తలను కూడా పార్టీలోకి ఆకర్షించవచ్చు. ఉనికిలేని ప్రాంతాల్లో కూడా పార్టీని బలోపేతం చేసుకోవచ్చు. తాను కోల్పోయిన గౌరవాన్ని ముఖ్యమంత్రి పదవి ద్వారా తిరిగి పొందవచ్చని, పార్టీ నాయకులు, కార్యకర్తులు మునుపటిలా పార్టీని వదలకపోవచ్చని థాక్రే కుటుంబం ఆశిస్తోంది.
అధికారం దన్నుతో పునర్వైభవాన్ని పొందవచ్చన్నది వీరి ఆశ. ఇప్పుడు కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి నుంచి మద్దతు ద్వారా బాంబే కార్పొరేషన్‌లో ఆధిక్యత సాధించవచ్చని శివసేన నాయకత్వం భావిస్తోంది. 2019లో కంటే 2024 ఎన్నికల్లో మరిన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశాన్ని కూడా ముఖ్యమంత్రి పదవిద్వారా పొందవచ్చు. శివసేన గత ముఖ్యమంతి నారాయణ్ రానేతో సహా ఇతర పార్టీల్లోకి వెళ్లిన శివసైనికులను అధికార బలంతో తిరిగి ఆకర్షించడమో లేక ప్రతీకారంతో దెబ్బతీయడానికి సీఎం పదవి ఆస్కారం ఇవ్వనుంది. అలాగే చక్కెర ఫ్యాక్టరీలలో, కో ఆపరేటివ్స్‌లో వాటాను పెంచుకోవచ్చు. పైగా శివసేనకు జాతీయ స్థాయిలో ప్రతిష్ట కూడా పెరగనుంది.
దేశంలో అతి పెద్ద రాష్ట్రం, దేశ ఆర్థిక రాజధానిని కలిగిన మహారాష్ట్రపై పట్టు సాధించడం ద్వారా జాతీయ రాజకీయాలను శాసించవచ్చని శివసేన అంచనా. ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే మంచి పాలనను అందిస్తే, సమర్థతను నిరూపిస్తే భవిష్యత్తులో తాను గొప్ప రాజకీయవేత్తగా కావచ్చు. 1999 నుంచి 2014 వరకు 15 సంవత్సరాలపాటు కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అనుభవించిన అధికారాన్ని శివసేన సమర్థపాలన ద్వారా అందుకోవచ్చు.
అన్నిటికంటే మించి మహారాష్ట్రలో వైఫల్యం నుంచి బీజేపీ గుణపాఠం తీసుకుని దిద్దుబాట పట్టకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని కావడానికి నరేంద్రమోదీ చిక్కు సమస్యలు ఎదుర్కోవచ్చు. మహారాష్ట్రను కోల్పోవడం భారీ నష్టమని బీజేపీకి అర్థమైంది. మహారాష్ట్రలో అధికార పగ్గాలు తిరిగి చేపట్టడానికి మోదీ, అమిత్ షాలు పథకాలు ఏమేరకు ఫలిస్తాయన్న అంశంపైనే శివసేన భవిష్యత్తు, ప్రస్తుత అధికార పొత్తు భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి.
వ్యాసకర్త : పెంటపాటి పుల్లారావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment