మహా సంక్షోభం: సుప్రీం కీలక ఆదేశాలు | No Maharashtra Floor Test For Now, SC Asks For 2 Key Letters Tomorrow | Sakshi
Sakshi News home page

ఫడ్నవిస్‌, అజిత్‌ పవార్‌కు సుప్రీం నోటీసులు

Published Sun, Nov 24 2019 12:43 PM | Last Updated on Sun, Nov 24 2019 9:44 PM

Supreme Court Send Notice To Fadnavis And Ajit Pawar On Maharashtra - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను వెంటనే ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, ఎప్పడు చేపట్టాలో సోమవారం తమ నిర్ణయం తెలుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ బలం ఉందంటూ ఫడ్నవిస్‌ గవర్నర్‌కు సమర్పించిన లేఖను, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్‌ పంపిన లేఖను తమకు అందజేయాలని సొలిసిటర్‌ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులపై వివరణ ఇవ్వాల్సిందిగా.. కేంద్ర ప్రభుత్వానికి, దేవేంద్ర ఫడ్నవిస్‌, అజిత్‌ పవార్‌లకు నోటీసులు జారీచేసింది. బలపరీక్షను వెంటనే చేపట్టాలన్న విపక్షాల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దీంతో పఢ్నవిస్‌ ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది.  తదుపరి విచారణను సోమవారం ఉదయం 10:30 గంటలకు వాయిదా వేసింది. దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్‌ ఎన్వీ రమణ, అశోక్‌ భూషన్‌, సంజీవ్‌ కన్నాలతో కూడిన  ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సెలువు రోజైనా ఆదివారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. (అజిత్‌ పవార్‌కు ఝలక్‌ ఇచ్చిన ఎమ్మెల్యేలు)

ఎన్సీపీ, శివసేన తరఫున కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించగా.. బీజేపీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో శనివారం చోటుచేసుకున్న పరిణామాలను సిబల్‌ ధర్మాసనానికి వివరించారు. మెజార్టీ లేని పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని, గవర్నర్‌ నిర్ణయం చట్ట విరుద్ధమని అన్నారు. ఎన్నికల ముందు ఏర్పడిన కూటమి విచ్ఛిన్నం అయ్యిందని, ఆ తరువాత మెజార్టీ గల మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు. ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం ఇవ్వకుండా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కూడిన కూటమికి బల నిరూపణకు తక్షణమే అవకాశం ఇవ్వాలని ధర్మాసనానికి విజ‍్క్షప్తి చేశారు.  ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని సిబల్‌ కోరారు.

‘గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ పక్షపాతంతో వ్యవహరించారు. నియమ నిబంధనలను ఉల్లంఘించారు. బీజేపీకి మెజారిటీ ఉన్నట్లు భావిస్తే.. ఈరోజే (ఆదివారం) అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలి. మెజార్టీ లేని ఫడణవీస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగవిరుద్ధం, చట్టవిరుద్ధమని ప్రకటించాలి. బేరసారాలు, చట్టవ్యతిరేక చర్యలను నివారించేందుకు వీలుగా 24 గంటల్లోపు విశ్వాసపరీక్ష జరిగేలా ఆదేశించాలి. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలి’ అని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిమండలి నిర్ణయం లేకుండా రాష్ట్రపతి పాలనను ఎలా ఎత్తివేస్తారని సిబల్‌ ప్రశ్నించారు. బీజేపీ తరుఫున ముకుల్‌ రోహత్గి కోర్టులో వాదనలు వినిపిస్తూ.. మెజార్టీ గల పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని తెలిపారు. గవర్నర్‌ తనకున్న విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని ఎలా సవాలు చేస్తారని ప్రశ్నించారు.



ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ ఎన్సీపీలోని తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు  ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు.  అయితే ఫడ్నవిస్‌కు మద్దతు తెలిపిన అజిత్‌ వర్గం ఎమ్మెల్యేలంతా ఆదివారమే శరద్‌తో భేటీ కావడంతో బలపరీక్షలో బీజేపీ నెగ్గడం సవాలుగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement