
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ ఏర్పాటుపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఘాటుగా స్పందించారు. నైతిక బాధ‍్యత వహిస్తూ మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాలపై అశోక్ గెహ్లాట్ ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
గవర్నర్ చర్యలు చూస్తుంటే బీజేపీతో చేతులు కలిపినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ‘మహా’ రాజకీయ అనిశ్చితికి గవర్నరే కారణమని విమర్శించారు. భగత్‌సింగ్ కోశ్వాయరీ పక్షపాతంతో వ్యవహరించారని, నియమ నిబంధనలను ఉల్లంఘించారని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేనకు మాత్రమే ఉందన్నారు. శనివారం ఉదయం అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కాగా బలపరీక్షను వెంటనే చేపట్టాలన్న విపక్షాల విజ్ఞప్తిపై సీఎం ఫడ్నవిస్ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను వెంటనే ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, ఎప్పడు చేపట్టాలో సోమవారం తమ నిర్ణయం తెలుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment