సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పదవికి ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ రాజీనామా చేశారు. అసెంబ్లీలో బుధవారం సాయంత్రంలోగా బలపరీక్ష చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పవార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అజిత్ తాజా నిర్ణయంతో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్సీపీలో సగం మంది ఎమ్మెల్యేలతో ఫడ్నవిస్‌కు మద్దతు ప్రకటించిన అజిత్.. వెంటనే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అజిత్ నిర్ణయానికి షాకైన.. ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ తన చాతుర్యంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్నారు. మొత్తం 54 ఎమ్మెల్యేలలో దాదాపు 52 మంది సభ్యులు తమతో ఉన్నారని శరద్ ప్రకటించారు. దీంతో పార్టీని చీల్చిన అజిత్ చివరికి ఒంటరిగా మిగిలారు.
ఈ నేపథ్యంలో అజిత్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు కూడా శరద్ పావులు కదిపారు. పలువురు కీలక నేతలను పంపి.. ఆయనతో చర్చలు జరిపారు. అంతకీ అజిత్ వెనక్కితగ్గకపోవడంతో శరద్ పవార్ భార్యను రంగంలోకి దింపారు. ఆమె అజిత్‌తో సమావేశమైన గంటల వ్యవధిలోనే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో బలపరీక్షలో ఫడ్నవిస్ ప్రభుత్వం నెగ్గుకురావడం సవాలుగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ బలంలేని నేపథ్యంలో సీఎం పదవికి ఫడ్నవిస్ కూడా రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ శిబిరంలో సంతోష వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment