దౌత్యంలో కొత్త దారులు | Sakshi Editorial On Shanghai Cooperation Organisation Summit At Bishkek | Sakshi
Sakshi News home page

దౌత్యంలో కొత్త దారులు

Published Thu, Jun 13 2019 12:42 AM | Last Updated on Thu, Jun 13 2019 12:42 AM

Sakshi Editorial On Shanghai Cooperation Organisation Summit At Bishkek

మిత్ర, శత్రు దేశాలన్న తేడా లేకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అందరినీ టారిఫ్‌ల యుద్ధంతో ఠారెత్తిస్తున్న వర్తమాన వాతావరణంలో కిర్గిజిస్తాన్‌లోని బిష్కెక్‌లో గురు, శుక్రవారాల్లో షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలను బుట్టదాఖలు చేసి, కొత్త షరతులు విధిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్న ట్రంప్‌ ధోరణి వల్ల ఇబ్బంది పడని దేశమంటూ లేదు. అమెరికాకు ఎంతో సన్నిహితంగా ఉండే యూరప్‌ దేశాలు సైతం ఈ దూకుడును సహించలేకపోతున్నాయి. అందుకే ఎస్‌సీఓ తీరుతెన్నులు ఇక ముందెలా ఉండబోతున్నాయన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అది తీసుకోబోయే నిర్ణయాలు అంతర్జాతీయ సంబంధాలపై రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నదని అంచనా వేస్తున్నవారూ ఉన్నారు.

తమ తమ ప్రాంతాల్లో అమెరికా ప్రభావాన్ని పరిమితం చేయడం ఎలాగన్నది ఇప్పుడు రష్యా, చైనాలను వేధిస్తున్న ప్రశ్న. ఇందుకోసం తమ మధ్య ఉన్న వైరుధ్యాలను పక్కనబెట్టి సమ ష్టిగా కలిసి కదలాలని అవి రెండూ భావిస్తున్నాయి. పూర్వపు సోవియెట్‌ యూనియన్‌లో భాగంగా ఉన్న దేశాల్లో అమెరికా ప్రభావం క్రమేపీ పెరగడం రష్యాను కలవరపెడుతుంటే... పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో దాని తీరుతెన్నులపై చైనాకు అభ్యంతరాలున్నాయి. రష్యా, చైనాలు కూటమిగా ఏర్ప డటం అసాధ్యమని ఇన్నాళ్లూ అమెరికా భావిస్తూ వస్తోంది. కానీ ఈ ఏడాది మొదట్లో అమెరికా నిఘా సంస్థ సెనేట్‌కు సమర్పించిన ఒక నివేదిక చైనా, రష్యాల మధ్య విస్తరిస్తున్న సహకారాన్ని ప్రత్యేకించి ప్రస్తావించింది. అవి పరస్పరం స్నేహసంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు అంతర్జాతీయ సంస్థల ద్వారా వాటికి అనువైన కొత్త నిబంధనలు, ప్రమాణాలు ఏర్పరచ డానికి ప్రయత్నిస్తున్నాయని ఆ నిఘా నివేదిక వివరించింది. అంతకుముందు సోవియెట్‌ యూని యన్, చైనాల మధ్య సంబంధాల మాటెలా ఉన్నా, 80వ దశకం చివరి నుంచి అవి క్రమేపీ మెరుగుపడుతూ వచ్చాయి. సోవియెట్‌ కుప్పకూలి రష్యా ఏర్పడ్డాక రెండింటిమధ్యా మిత్రత్వమే కొనసాగుతోంది.  

వలసలను కట్టడి చేయకపోతే అమెరికాకు చేసే ఎగుమతులపై మరో 5 శాతం టారిఫ్‌లు విధించి దాన్ని 25శాతానికి తీసుకెళ్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ పక్షం రోజులక్రితం మెక్సికోను హెచ్చ రించారు. ఆ మర్నాడు మన దేశంపై విరుచుకుపడ్డారు. భారత్‌కు ఇప్పటివరకూ ఇస్తున్న సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(జీపీఎస్‌)ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనివల్ల 560 కోట్ల డాలర్లమేర భారత్‌కున్న వెసులుబాట్లు పోతాయని అమెరికా అంచనా వేస్తుండగా, అది 19 కోట్ల డాలర్లు మించదని మన దేశం చెబుతోంది. భారత్‌ మార్కెట్లలో అమెరికాకు సమాన ప్రతిపత్తి కల్పించ నప్పుడు మేమెందుకు దాన్ని కొనసాగించాలన్నది ట్రంప్‌ వాదన. అలాగే నిరుడు చైనాపైనా, 28 దేశాల కూటమి యూరప్‌ యూనియన్‌(ఈయూ)పైనా ఆయన భారీయెత్తున సుంకాలు విధించగా అటు చైనా, ఇటు ఈయూ సైతం అమెరికా ఉత్పత్తులపై తాము కూడా సుంకాలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఎవరికి వారు అమెరికా సాగిస్తున్న ఈ టారిఫ్‌ల యుద్ధం వల్ల నష్టపోతున్న తరు ణంలో ఆ దేశాలన్నీ ఏదో మేర ఏకం కావాలని చూడటం అసహజమేమీ కాదు. 

పద్దెనిమిదేళ్లక్రితం ఆవిర్భవించిన ఎస్‌సీఓలో మన దేశానికి 2017లో సభ్యత్వం లభించింది. అయితే అది కీలకమైన సంస్థగా రూపుదిద్దుకోబోతున్నదని అప్పట్లో ఎవరూ ఊహించలేదు.  ఇది ఏ దేశానికీ వ్యతిరేకంగా ఏర్పడింది కాదని, ఇందులో భద్రత, అభివృద్ధిపైనే దృష్టి సారించి, వాటికి సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తామని ఇప్పటికే చైనా ఉప విదేశాంగమంత్రి ఝాంగ్‌ హాన్‌ హ్యూ వివరణనిచ్చారు. అలా అంటూనే వాణిజ్యపరమైన ఆత్మరక్షణ విధానాలు, ఏకపక్ష విధా నాలు వగైరాలపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకుంటామని ఆయన అనడాన్నిబట్టి అమెరికా వ్యవహారశైలి, దాన్ని ఎదుర్కొనడానికి అనుసరించాల్సిన వ్యూహం వగైరాలు కూడా శిఖరాగ్ర సదస్సులో ప్రస్తావనకు రాకమానవని అర్ధమవుతోంది. ఎస్‌సీఓలో సభ్య దేశాలుగా ఉన్న భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న విభేదాలు, తనకు భారత్‌తో ఉన్న వివాదాలు పరిష్కారమైతే సంస్థ మరింత పటిష్టమవుతుందన్న అభిప్రాయం చైనాకుంది. అదే సమయంలో అమెరికా పోకడల విష యంలో భారత్, చైనాలు రెండింటికీ అభ్యంతరాలున్నాయి. ఇవే తమ మధ్య మరింత సహకారాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని చైనా విశ్వసిస్తోంది. ప్రధాని మోదీ ఈ సదస్సులో ఉగ్ర వాదం అంశాన్ని లేవనెత్తినా, నేరుగా పాక్‌ పేరెత్తి దాన్ని విమర్శించబోరని చైనా ఆశిస్తోంది. ఈ సదస్సు సందర్భంగా మోదీ, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ల మధ్య భేటీ జరగబోదని ఇప్పటికే తేటతెల్లమైంది.

అమెరికా అనుసరిస్తున్న ధోరణులు ఆ దేశానికి సన్నిహితంగా ఉండే సింగపూర్, మలేసియా వంటి దేశాలకు కూడా రుచించడం లేదు. ఎదుగుతున్న చైనాను, దాని ఆకాంక్షలను గుర్తించి అందుకు అనుగుణమైన సర్దుబాట్లు చేసుకోవాలని ఈ నెల 2న ముగిసిన ఆసియా ప్రాంత దేశాల రక్షణ సదస్సు ‘షాంగ్రీలా డైలాగ్‌’లో సింగపూర్‌ ప్రధాని లీ షెన్‌ లూంగ్‌ అమెరికాకు హితవు పలి కారు. చైనాతో వాణిజ్య, భద్రతా అంశాల్లో తగవుపడుతున్న అమెరికా తీరును మలేసియా ప్రధాని మహతీర్‌ మహమ్మద్‌ విమర్శించారు. ఇలా సన్నిహిత దేశాలకే అమెరికా అనుసరిస్తున్న ధోరణి నచ్చని స్థితిలో, దాని బాధిత దేశాలకు ఇంకెంత ఆగ్రహావేశాలుంటాయో అర్ధం చేసుకోవచ్చు. ట్రంప్‌ విధానాల వల్ల చైనా, రష్యాలు సన్నిహితమవుతున్నాయని, ఈ పరిణామం ముందూ మునుపూ అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉన్నదని ఆ దేశ పౌరులు ఆందోళన పడుతున్నారు. ఏదేమైనా శరవేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో మన దేశానికి గరి ష్టంగా ప్రయోజనాలు రాబట్టే దిశగా మన దౌత్య వ్యూహాలను పదునుపెట్టుకోవాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement