‘ఇక మిలిటరీ యాక్షన్స్ కాదు.. ఆర్థిక చేయూత’
వాషింగ్టన్: అణ్వాస్త్రాల విషయంలో ఉత్తర కొరియా, అమెరికాల మధ్య ఏం జరగనుందో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు. ఎప్పుడు దూకుడుగా, కవ్వించినట్లుగా స్పందించే ఆయన ఓ దౌత్యవేత్తలాగా సహనం ప్రదర్శించారు. భవిష్యత్‌లో అణుకార్యక్రమం గురించి అమెరికా, ఉత్తర కొరియా మధ్య వీడని పెద్ద ప్రతిష్టంభన కచ్చితంగా నెలకొనే అవకాశం ఉందని చెప్పిన ఆయన ఆ సమస్యను సావధానంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందంటూ నొక్కి చెప్పారు. శాంతి పరిష్కారం కూడా తప్పకుండా లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన ట్రంప్ దౌత్యమే దీనికి పరిష్కార మార్గం అని అన్నారు.
‘ఉత్తర కొరియాతో ఉన్న మేజర్ వివాదానికి శుభంకార్డు వేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. రాయభారం ద్వారా మాత్రమే దీన్ని సాధించాలి’ అంటూ ఆయన ఓవల్ కార్యాలయంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సమస్యకు శాంతిపూర్వక పరిష్కారం కోరుకుంటున్నాని చెప్పారు. ఇక నుంచి తన పాలన వర్గం సైనిక పరమైన చర్యలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోకుండా ఆర్థిక కార్యక్రమాలతో ముందుకెళదామనుకుంటున్నట్లు తెలిపారు. ‘ఉత్తర కొరియాతో సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలనుకుంటున్నాం.. కానీ అది కొంచెం క్లిష్టమైనది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.