పై నుంచి కిందికి జారే ప్రవాహధారను– నీటిబుగ్గ వద్దనే అది నలువైపులకు విస్తరించేట్టుగా దారులు సరిచేసినప్పుడు, బీడు భూములు సైతం జలాలతో తడుస్తాయి. ‘సోర్స్’గా పిలిచే ఈ నీటిబుగ్గను ఆంగ్లంలో ‘ఫౌంటెన్ హెడ్’ అంటాం. అయితే, పెట్టే చేతిని మెలివేయగలిగే శక్తి ఉన్నవారికి– ‘జల’ వద్దనే ఇవి దారులు మళ్ళించబడతాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఇటువంటి మౌలిక అంశాల పట్ల స్పృహ ఉన్నప్పుడే, ‘రాజ్యం’ అందించే ఫలాల పంపిణీలో సమన్యాయం అమలవుతుంది. ఈ దృష్టి ప్రభుత్వాలకు లేనప్పుడు, నీటిబుగ్గ వద్దనే జలాలు–ఫలాలు కూడా దారులు మళ్ళించబడతాయి. ఇన్నాళ్ళు జరిగింది అదే. అయితే, అనివార్యస్థితి ఒకటి వస్తుంది. అప్పుడు జరిగే పంపిణీ న్యాయాన్ని ఎవరైనా కేవలం ప్రేక్షక పాత్రగా చూడ్డం తప్ప మరేమీ ఉండదు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై ఏళ్ల క్రితం– ఇకముందు వ్యవసాయం సాగదేమో? అనే అనుమానాన్ని స్వయంగా సర్కారులోని పెద్దలే వ్యక్తం చేయడం మనం చూశాం. అప్పటికే కౌలు రైతుల వెతలు పెరిగి సాగుబడి భారమయింది. భూముల సొంతదారులు ఊళ్ళను వదిలిపెట్టి, నగరాలలోనో, విదేశాలలోనో ఉంటూండటంతో రాష్ట్ర మంతా – ‘ఆబ్సెంట్ ల్యాండ్ లార్డిజం’ ఎక్కువయింది. ఆ తర్వాత – ‘జలయజ్ఞం’ మొదలై సాగునీటి వసతి పెరుగుతున్న దశలో– డాక్టర్ వైఎస్‌ఆర్ తాత్కాలిక ఉపశమనంగా చిన్న సన్నకారు రైతులు– పాడి, మేకలు, గొర్రెలు, కోళ్ళు, కూరగాయల పెంపకం వంటివాటితో అదనపు ఆదాయం పెంచుకోవాలని సభల్లోనే బహి రంగంగా కోరేవారు. రాష్ట్ర విభజన తర్వాత తన తండ్రి ఆలోచన నుంచి– ఆ ‘లైన్’ స్ఫూర్తిగా తీసుకుని, గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో కొత్తగా– ‘ఫుడ్ ప్రాసె సింగ్ ఇండస్ట్రీ’ శాఖను ప్రారంభించారు.
‘కాటన్ తర్వాత భూమి...’ ఒక ఆరంభం అనుకుంటే, ‘గోదావరి మండలంలోని రెండు జిల్లాల్లోని ప్రముఖ ‘ఆగ్రో–ఇండస్ట్రీస్’ కంపెనీల కారణంగా, ఇప్పటికంటే మరింత మేలైన మానవీయ కేంద్రిత స్థిమిత స్థితిని సామాజిక పర్యావరణంగా ఒకప్పుడు ఇక్కడ చూడగలిగాము. అయితే, ‘అటోమెషన్’ ‘కంప్యూటర్ల’ ప్రవేశం తర్వాత, ఉద్యోగులు/కార్మికుల సంఖ్య నియంత్రణతో... ఉపాధి వెతుకులాట కోసం మొదలైన పట్టణాల వలసల ప్రభావం తొలుత పంటలపైన, ఆ తర్వాత ఈ పరిశ్రమలకు ముడిసరుకు సరఫరా పైనా కనిపించింది. సంస్కరణలు తర్వాత, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల దిగుమతుల్లో కేంద్రం తీసుకున్న వైఖరితో, మన ఆగ్రో పరిశ్రమల్లో సంక్షోభం చూశాం. సహకార చక్కెర మిల్లుల మూత ఈ పరిస్థితుల పర్యవసానమే! నిజానికి – ‘వ్యవసాయం దండగ...’ అనే ముగింపునకు వచ్చినప్పుడే, తదుపరి దశ గురించి పాలకుల్లో యోచన మొదలు కావాలి.
అటువంటిది లేదు కనుకనే, గత ప్రభుత్వంలో 2014 జూన్‌లో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో– ‘కాటన్ ఆనకట్ట కట్టిన తర్వాత, రైస్ మిల్లులు పెట్టడం తప్ప మీరు ఏం చేశారు?’ అని అప్పటి ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కానీ 1952 నాటికే తణుకులో ‘ఆంధ్ర షుగర్స్’, ఆ తర్వాత ఏలూరులో ‘అన్నపూర్ణ పల్వరైసెస్’ వంటివి మొదలయ్యాయి. రవాణాకు గ్రాండ్ ట్రంక్ రోడ్, కోరమండల్ రైల్వే లైన్, విశాఖపట్టణం, కాకినాడ పోర్టుల అందుబాటును ఈ ప్రాంత– ‘ఆంట్రప్రెన్యూర్లు’ గరిష్ట స్థాయిలో వినియోగించుకున్న కాలం ఒకటి వుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చిన పారిశ్రామిక వేత్తలు ఏలూరులో జనుము ఉత్పత్తులు, తాడేపల్లి గూడెంలో వంట నూనెలు ఉత్పత్తి చేశారు. ఈ నేపథ్యమే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టడానికి కారణం అయింది. (చదవండి: మేనేజ్‌మెంట్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?)
ఈ ప్రాంత తదుపరి దశ గనుక– ‘డిజిటలైజేషన్’ అయితే, భూమిని నమ్ముకుని దిగువన మిగిలిపోతున్న వర్గాల సాగుబడికి, వారి పిల్లల ఉపాధికి దారేది? అనే ప్రశ్నకు మాత్రం జవాబు లేకుండానే, విభజిత ఏపి తొలి ఐదేళ్ళు ముగిసింది. ఇలా ఎటువంటి దిక్సూచి లేని స్థితిలో, తన ప్రభుత్వానికి కొత్త దారులు తానే వేసుకునే తప్పనిసరి పరిస్థితి జగన్‌మోహన్ రెడ్డికి వచ్చింది. ఇందుకు మేలైన మానవ వనరులు అవసరం కనుక, విద్య, వైద్యం, వ్యవసాయం మీద దృష్టి తప్పలేదు. విమర్శలు ఉన్నప్పటికీ, కొత్త ఉపాధి వనరులు సృష్టించే వరకు, వివిధ వర్గాలకు తొలుత నగదు చెల్లింపు వంటి– ‘ఊతం పథకాలు’ తప్పలేదు. అయితే– ‘కరోనా’ దాన్ని అనివార్యం చేసి కొనసాగించేట్టుగా చేసింది. (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!)
అదే సమయంలో మరో అర్ధ శతాబ్ది అవసరాలకు సరిపడిన– ‘ఎకో సిస్టం’ లక్ష్యంగా, ఈ ప్రభుత్వ ప్రణాళికలు వాగ్దానపూరితంగా కనిపిస్తున్నాయి. ఇందుకు గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన– ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’ని చూడవలసి వుంటుంది. (చదవండి: మా కోరిక వికేంద్రీకరణే!)
- జాన్‌సన్ చోరగుడి
అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యా
Comments
Please login to add a commentAdd a comment