అమెరికన్ ఉదారవాద రాజకీయ తత్వవేత్త జాన్ రాల్స్– ‘థియరీ ఆఫ్ జస్టిస్’ గ్రంథంలో మూడు అంశాలు కీలకం అని చెబుతారు. సమానత్వం ఉండాల్సింది– 1. హక్కుల్లో 2. అవ కాశాల్లో 3. ఎక్కువమందికి ప్రయో జనం కలిగించడం (బెనిఫిట్ ఆఫ్ మాగ్జిమైజేషన్)లో అంటారు. ఈ దృష్టి నుంచి చూసినప్పుడు, మనది వ్యవసాయ ప్రధాన సమాజం కనుక, ఇక్కడ జరిగిన సాంఘిక మార్పునకు– ‘కాటన్ తర్వాత భూమి’ (1852) ప్రాతిపదిక. అది ఆర్థిక పరిస్థితులపై మాత్రమే కాకుండా, ఇక్కడి ‘సోషల్ ఎకో సిస్టం’ మీదా ప్రభావం చూపి, కొన్ని తరాల పాటుగా కదలికలు లేకుండా చట్టు కట్టిన సామాజిక దొంతర్ల (సోషల్ ఫ్యాబ్రిక్)ను గుల్లబార్చింది. చరిత్రకారుడు బీబీ మిశ్రా గ్రంథం– ‘ది ఇండియన్ మిడిల్ క్లాస్–దెయిర్ గ్రోత్ ఇన్ మోడరన్ టైమ్స్’ (1962)లో వర్గీకరించిన పదకొండు అంశాల్లో 60 ఏళ్ళ క్రితమే, ఆరు అంశాలు గోదావరి మండలంలో కనిపిస్తాయి. భూమికి నీటి వసతి తోడవ్వడం వల్ల... వందేళ్లలో ఆ ప్రాంతం అన్ని రంగాల్లోనూ మిగతా ప్రాంతాల నుంచి వేరు పడింది.
అయితే మరి ఈ ప్రాంతాల్లో ప్రొ. మిశ్రా చెబుతున్న మధ్యతరగతి ఏది? భూములున్న ఆధిపత్య వర్గాలదే ఇక్కడా తొలి విస్తరి అయితే, ఇన్నేళ్ళ ‘సరళీకరణ’ తర్వాత కూడా– ‘వెనుకబడిన వర్గాలు వెనుకే...’ అనే పాత సూత్రమేనా? అందుకు జవాబుగానే వనరుల సమాంతర పంపిణీ కోసం... ‘జల వద్దనే ప్రవాహ దిశల్ని నలుదిక్కులకు దారి మళ్ళించడం’ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మొదలయింది. కానీ ఆరంభ దశలోనే ఈ మార్పును ఎగువ మధ్యతరగతి అంగీకరించలేకపోతున్నది. ఇదే చిత్రం!
సరళీకరణ విధానాలు తెచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల సంప్రదాయ సామాజిక దొంతర బలహీనమైంది. అదే సమయంలో అభివృద్ధి హారిజాంటల్‌గా విస్తరించడం చూడవచ్చు. ఈ అభివృద్ధిని రైతన్నలకే కాక, అట్టడుగు వర్గాల వరకు తీసుకెళ్లడానికి ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్ర విభజన తర్వాత భూమికి జలకళ తోడవ్వడంతో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. వీటి ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను అభివృద్ధి చేస్తే వ్యవసాయాధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుందని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. (చదవండి: ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’తో కొత్త వెలుగు!)
వెనుకబడిన సామాజికవర్గాల నుంచి కొత్తగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులుగా మారిన– ‘ఎంటర్ ప్రెన్యూర్’ యువతకు ఈ ప్రభుత్వం కొత్త అభివృద్ధి– ‘ప్లాట్ ఫార్మ్’ను ప్లాన్ చేసింది. సహజంగానే వీరిలో బహుజన–దళిత–మైనారిటీ సామాజిక శ్రేణులు వారి వారి దామాషా మేరకు ఎటూ ఉంటారు. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ నిర్మాణ కాలంలో రెండేళ్లపాటు– ‘వ్యాట్’, ‘జీఎస్టీ’ల్లో రూ. 2 కోట్లు మించకుండా ‘ఎంటర్ ప్రెన్యూర్’కు తిరిగి చెల్లిస్తున్నారు. కోల్డ్ చైన్స్, కోల్డ్ స్టోరేజి, కాయలు పండ్లుగా మార్చే ‘రైపెనింగ్ యూనిట్స్’కి అవి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఐదేళ్లపాటు యూనిట్ రూ. 1.50 విద్యుత్తు సబ్సిడీ ఇస్తారు. కొత్త యూనిట్లకు– ‘క్యాపిటల్ సబ్సిడీ’ 25 శాతం ఇస్తున్నారు. అలాగే, యూనిట్లను అప్ గ్రేడ్ చేస్తే ఒక కోటి రూపాయలకు మించకుండా 25 శాతం ఇస్తారు. తొలి దశ ప్రాసెసింగ్ చేసే యూనిట్లకు రూ. 2.5 కోట్లు మించకుండా యాభై శాతం వరకు ‘కేపిటల్ సబ్సిడీ’ ఇస్తున్నారు. వ్యవసాయ, హార్టికల్చర్, డైరీ, మీట్ ఉత్పత్తుల ‘కోల్డ్ చైన్’కు 35 శాతం క్యాపిటల్ సబ్సిడీ’ ఇస్తున్నారు. రెండు శ్లాబుల్లో కేపిటల్ పెట్టుబడి మీద ఐదేళ్ళ పాటు వడ్డీ మీద సబ్సిడీ 7 శాతం ఇస్తున్నారు. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...)
మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి బయటకు వెళ్లి, ప్రపంచ మార్కెట్లో పనిచేస్తున్న మన యువత సంపాదన నిల్వలు, వారి సొంత ప్రాంతంలో పెట్టు బడులుగా పెట్టడం వల్ల– ‘మైక్రో స్మాల్ అండ్ మీడియం’ యూనిట్లు రాష్ట్రంలో బాగా పెరుగుతాయి. రైతు పంటలకు గిరాకీ పెరుగుతుంది. ‘డైరీ’ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. రైతు కూలీకి ఏడాది పొడవునా ఉపాధి దొరుకుతుంది. రవాణా, శీతల గిడ్డంగులు, ప్యాకింగ్ యూనిట్లు, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లు, బ్యాంకింగ్, హోటళ్ళు... ఇలా ఒక్కొక్కటిగా ప్రతి రంగం విస్తరించి చిన్న పట్టణాలలో ఉపాధి పెరుగుతుంది. ఫలితంగా సామాజిక వ్యవస్థలోని అన్ని వర్గాలూ అభివృద్ధికి చేరువవుతాయి. (చదవండి: ‘ట్యాక్స్ పేయర్స్ మనీ’ అంటూ ‘సోషల్ ఆడిట్’!)
- జాన్‌సన్ చోరగుడి
రాజకీయ – సామాజిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment